Bandi Sanjay: నిజాలు బయటకు వస్తుంటే కాంగ్రెస్ కు వశపడటం లేదు: బండి సంజయ్

'ది సబర్మతి రిపోర్ట్' సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Update: 2024-11-22 11:35 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సుదీర్ఘ కాలం దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ చరిత్రలోని వాస్తవాలను తెరమరుగు చేసిందని ఇప్పుడు వాస్తవ చరిత్ర బయటకు వస్తుంటే ఆ పార్టీకి వశపడటం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. కాంగ్రెస్ అంటే అబద్ధాలు అని దుయ్యబట్టారు. చరిత్రలోని వాస్తవిక కోణాన్ని ఆవిష్కరించే 'ది సబర్మతి రిపోర్ట్' (The Sabarmati Report) వంటి సినిమాలు ఇంకా అనేకం రావాలని ఆకాంక్షించారు. శుక్రవారం హైదరాబాద్ లో ఈ సినిమాను వీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రది జాతీయవాది చూడవల్సిన సినిమా 'ది సబర్మతి రిపోర్ట్' అన్నారు. 2002 గోద్రా (Godhra Riots 2002) ఘటనలోనూ ఓ వర్గానికి కొమ్ము కాస్తూ మత విద్వేషాలు పెంచి రాజకీయ లబ్ధి పొందాలనే కాంగ్రెస్ కుట్ర ఈ సినిమా ద్వారా బహిర్గతం అయిందన్నారు. గోద్రా ఘటనపై ఇన్నాళ్లు తామేది మాట్లాడినా బీజేపీ నేతలు రాజకీయం కోసమే ఇలా మాట్లాడుతున్నారని ఓ సెక్షన్ మీడియా ఆరోపణలు చేస్తూ వస్తోందని ఆరోపించారు. కానీ వాస్తవాలేంటో కళ్లకు కట్టినట్లుగా చూపించేలా ఈ మూవీని తెరకెక్కించారని బండి సంజయ్ అన్నారు. ఈ సినిమా సిబ్బందిని అభినందించారు.

తెలంగాణలో పన్ను మినహాయింపు ఇవ్వాలి:

ఇండియాపై పాకిస్తాన్ గెలిస్తే సంబరాలు చేసుకునే పరిస్థితి మన దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ ఉందన్నారు. ఇప్పటికీ భారత దేశంలో మినీ పాకిస్తాన్, మినీ బంగ్లాదేశ్, మినీ అప్ఘనిస్తాన్ అనే ప్రాంతాలు ఉన్నాయని రాబోయే రోజుల్లో ఇటువంటి ఘటనలు జరగవనే నమ్మకం కూడా లేదంటే మారాల్సింది ఎవరని ప్రశ్నించారు. ఇలాంటి వాటిపై సమాజం స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సినిమాను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా చూడాలన్నారు. ఈ సినిమాకు రాష్ట్ర ప్రభుత్వం పన్ను రాయితీ (Tax Exemption) ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూపీలో పన్ను రాయితీ కల్పించారని గుర్తుచేశారు. 

Tags:    

Similar News