నేడు కేబినెట్ భేటీ.. కొత్త రేషన్ కార్డులపై నిర్ణయం తీసుకునే ఛాన్స్
సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) అధ్యక్షతన నేడు సెక్రటేరియట్(Secretariat)లో భేటీ కానున్న మంత్రివర్గం(Cabinet).. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) అధ్యక్షతన నేడు సెక్రటేరియట్(Secretariat)లో భేటీ కానున్న మంత్రివర్గం(Cabinet).. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. హైడ్రాకు చట్టబద్దత కల్పించేందుకు తయారు చేసిన ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలుపనుంది. దీంతో ఇంతకాలం హైడ్రాకు ఉన్న న్యాయపరమైన చిక్కులు తొలిగిపోతాయని అధికారులు భావిస్తున్నారు. ప్రజాపాలన భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 11 లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న నిబంధనల మేరకు కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలా? కొత్త రూల్స్ తయారు చేయాలా? అనే అంశంపై చర్చించి కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది.
అలాగే రేషన్ కార్డులతో సంబంధం లేకుండా ప్రతి నిరుపేద కుటంబానికి హెల్త్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందుకోసం ఎలాంటి రూల్స్ రూపొందించాలి? అనే అంశంపై కూడా చర్చ జరిగే చాన్స్ ఉంది. రైతుభరోసా స్కీమ్ అమలుకు కావాల్సిన మార్గదర్శకాలపై కూడా చర్చే జరిగే అవకాశం ఉంది. ఎన్ని ఎకరాల విస్తీర్ణం ఉన్న రైతులకు భరోసా ఇవ్వాలనే అంశంపై మంత్రులు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, రైతుల అభిప్రాయాలు తీసుకున్నారు. వచ్చిన ఫీడ్ బ్యాక్ పై మంత్రివర్గంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ఖమ్మంలో వచ్చిన వరదల వల్ల పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. కానీ, ఇంతవరకు కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందలేదు. ఈ అంశంపై కూడా మంత్రివర్గంలో చర్చించి, వెంటనే సాయం అందించాలని కేంద్రాన్ని కోరనున్నారు. మరోవైపు రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం, ఎస్ఎల్బీసీ పనుల వేగవంతం, రుణమాఫీ అందని రైతులకు సాయం అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. కోఠి ఉమెన్స్ వర్సిటీకి చాకలి ఐలమ్య పేరు, తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు, కొత్తగా ఏర్పాటు చేసిన ఇనిస్టిట్టూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతూ కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.