నిండా నిర్లక్ష్యం..ప్రమాదపుటంచున వంతెన!!

అసలే వానాకాలం..ఆపై అతి భారీ వర్షాలు పడుతున్న తరుణంలో నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యంతో వాహనదారులు ప్రమాదంలో పడేలా ఉన్నారు.

Update: 2024-09-10 03:06 GMT

దిశ, డోర్నకల్(కురవి):అసలే వానాకాలం..ఆపై అతి భారీ వర్షాలు పడుతున్న తరుణంలో నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యంతో వాహనదారులు ప్రమాదంలో పడేలా ఉన్నారు. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్న వేళ వాటిపై ఉన్న వంతెనలు పర్యవేక్షించి భద్రతను చూడాల్సిన సదరు అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండటంతో ప్రమాదం పొంచి ఉంది. మహబూబాబాద్ కురవి మండలం బంచరాయి తండా వద్ద జాతీయ రహదారిపై ఉన్న వంతెన ప్రమాదకరంగా మారింది. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో వంతెన ధ్వంసమయ్యే అవకాశమున్నట్లు వాహనదారులు తెలుపుతున్నారు.

మరచిన పర్యవేక్షణ, నిర్వహణ..

మహబూబాబాద్ ‌- ఇల్లందు ప్రధాన రహదారిపై నిత్యం వేలాదిగా వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఈ ప్రధాన రహదారి పై కురవి మండలం బంచరాయి తండా గ్రామ సమీపంలోని పాకాల వాగు పై ఉన్న వంతెన వర్షపు నీటితో బురద గుంతలను తలపిస్తుంది. వంతెనపైన రెండు వైపులా గడ్డి పెరిగి సాధారణ నేలను తలపిస్తోంది. వంతెనపై నీరు నిలవడంతో కాంక్రీట్, ఐరన్ దెబ్బతిని వంతెన కూలే ప్రమాదముందని వాహనదారులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.


Similar News