Minister Seethakka: నీటి సమస్యపై రివ్యూ.. సీతక్క కీలక ఆదేశాలు

నీటి సమస్యపై మంత్రి సీతక్క కీలక ఆదేశాలు జారీ చేశారు..

Update: 2024-10-26 17:24 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతి ఐదు, ఆరు నియోజకవర్గాలను ఒక యూనిట్‌గా పరిగణించి రిజర్వాయర్లలోని నీటి నిల్వలను ఎప్పటికప్పుడు చెక్ చేయాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు. శనివారం ఆమె సచివాలయంలో ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాగు నీటి సరఫరాలో ఎక్కడా సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శుద్ధి చేసిన నీరే సరఫరా అయ్యేలా చూడాలన్నారు. ఇక చాలా గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నా, ప్రజలు బోర్లు, ఆర్వో ప్లాంట్లను కోరుతున్నారని మంత్రి గుర్తు చేశారు. వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత మళ్లీ బోర్లు, ఆర్వో ప్లాంట్ల మీద ప్రజలు డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితులు రావడం బాధాకరమన్నారు. ఆ విధానం పోయేలా మిషన్ భగీరథ సిబ్బంది పని చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. మిషన్ భగీరథ నీళ్లపై ప్రజలకు నమ్మకం కలిగించాలన్నారు. ప్రతి గృహానికి నల్లా నీరు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. మిషన్ భగీరథ ట్యాంకులను తరచు శుభ్ర పరచాలని సీతక్క పేర్కొన్నారు. 

మిషన్ భాగీరథ పైప్ లైన్ల లీకేజీ‌ని అరికట్టాలని సీతక్క సూచించారు. తాగు నీటి సరఫరాపై అన్ని గ్రామాల నుంచి నెలవారీగా నివేదికలు తెప్పించాలని పేర్కొన్నారు. నీటి సరఫరాలో సమస్య తలెత్తుతున్న ఉట్నూర్ వంటి ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని డిప్యూట్ చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ఏ చిన్న సమస్య తలెత్తినా పై అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. పని క్యాలెండర్‌ను రూపొందించాలన్నారు. ప్రతి ఏఈ చేతిలో యాక్షన్ ప్లాన్ ఉండాలన్నారు. ఆయా గ్రామాల్లో చిన్న సమస్యతో మిషన్ భగీరథ నీళ్లు రాక పోతే ఆల్టర్నేట్ సోర్సు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. త్వరలోనే నీటి పంపిణీ ఫిర్యాదులపై టోల్ ఫ్రీని అందుబాటులోకి తీసుకువస్తామని సీతక్క తెలిపారు.


Similar News