Congress: నవంబరులో కీలక మీటింగ్‌.. హైదరాబాద్‌ రానున్న ఆగ్రనేతలు

కుల గణన మీటింగ్‌కు రాహుల్ గాంధీ, కార్జున ఖర్గే రానున్నారని పీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్ గౌడ్ పేర్కొన్నారు..

Update: 2024-10-26 17:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కుల గణన మీటింగ్‌కు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్​మల్లి కార్జున ఖర్గే రానున్నారని పీసీసీ చీఫ్​మహేష్​ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. నవంబరులోఈ మీటింగ్‌ను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నామన్నారు. శనివారం ఆయన ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్​మల్లికార్జున ఖర్గేలను ప్రత్యేకంగా కలిశారు. అనంతరం మీడియాతో చిట్ చాట్ చేశారు. వచ్చే నెలలో ఏఐసీసీ కీలక నేతలు నగరానికి రానున్నారని వెల్లడించారు. డిసెంబరులో కొన్ని శుభవార్తలు వింటారని ప్రకటించారు. ఇక తెలంగాణ కాంగ్రెస్‌లో ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరికలు ఆగలేదని, కేటీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్లు కూడా నిత్యం తమను సంప్రదిస్తూనే ఉన్నారన్నారు. అయితే పాత, కొత్త నాయకత్వం కలిసి పని చేయాల్సి ఉన్నదని, అలా సమన్వయం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు కొంత మంది ఎమ్మెల్యేలకు డీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వబోతున్నామన్నారు. దీని వలన ఆయా జిల్లాల్లో పార్టీ మరింత యాక్టివ్‌గా మారే అవకాశం ఉన్నదన్నారు. అయితే నూతన పీసీసీ కార్యవర్గానికి మరికొంత టైమ్ పడుతుందని వెల్లడించారు. కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులకు పదేళ్ల జైలు శిక్ష కూడా తక్కువేనని వెల్లడించారు. రాష్ట్ర ఆదాయం తగ్గలేదని, గతంలో ఉన్నట్లే ఇప్పుడు ఉన్నదన్నారు.


ఇక ఉన్నోళ్లను కాపాడుకునేందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. జీవన్ రెడ్డి అనుచరుడి హత్యపై విచారణ చేయాలని సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు ఇచ్చారన్నారు. మంత్రివర్గ విస్తరణ అంశం... అధిష్టానం, సీఎం చేతుల్లో ఉన్నదన్నారు. ఇక ఇప్పటికే చేరినోళ్లకు కొంత టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని, అందుకే చేరినట్లు ప్రకటించడం లేదన్నారు. పొంగులేటి పొలిటికల్ బాంబ్ లపై తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని వెల్లడించారు. ఇక సురేఖ వ్యక్తుల పేర్లు తీసుకోని మాట్లాడి ఉండకూడదని, అది సబబు కాదని పేర్కొన్నారు. కేసీఆర్ అవినీతి‌పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారన్నారు. కాళేశ్వరం మతలబును కూడా వెలికితీస్తున్నామన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయన్నారు. ఇప్పుడు చాలా తక్కువ ధరకే విద్యుత్ దొరుకుతుందన్నారు. విద్యుత్ చార్జీల పెంపు ఆలోచన లేదన్నారు. అయితే కేసీఆర్ కు గతంలో ఉన్న ఆర్థిక వెసులుబాటు తమకు ఇప్పుడు లేదన్నారు.తెలంగాణ ఏర్పడ్డప్పుడు రాష్ట్రం మిగులు బడ్జెట్‌తో ఉన్నదని, కానీ గడిచిన పదేళ్లలో 8 లక్షల కోట్లు అప్పు చేశారన్నారు. పది ఏళ్లలో విడతల వారీగా చేసిన దాని కంటే తామే ఎక్కువ సంఖ్యలో రుణమాఫీ చేశామన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు, కేసీఆర్ చేసిన అప్పులను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. తమ టెన్యూర్‌లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతామన్నారు. పథకాలను ఎగ్గొట్టాలనే ఆలోచన లేదన్నారు. త్వరలోనే అన్ని పథకాలను గ్రౌండ్ చేస్తామన్నారు.

హైడ్రా‌లో పేద వాళ్లు ఇళ్లు కేవలం ఒకటే ఉన్నదని, మిగతావన్నీ పెద్దలవే అని పేర్కొన్నారు. కానీ సోషల్ మీడియాలో అనైతికంగా ప్రచారం చేస్తున్నారన్నారు. తప్పిదాలు ప్రచారం చేసే హ్యాండిళ్లను పట్టుకుందామంటే అవన్నీ విదేశాల నుంచి జనరేట్ అవుతున్నాయన్నారు. బీఆర్ ఎస్ పదేళ్లలో విచ్చలవిడిగా చెరువుల కబ్జా జరిగిందన్నారు. వాయనాడులో జరిగిన విధ్వంసం తెలంగాణలో జరగకూడదనే యుద్ధ ప్రాతిపదికన మూసీ ప్రక్షాళన చేపట్టామన్నారు. జీవో 29 పై ఎవరికి నష్టం జరుగదని అధికారులు చెప్పారని వివరించారు. మెరిట్ లిస్ట్ లో ఎవరికి అన్యాయం జరగడం లేదన్నారు. ఎవరు ఆందోళన చేశారో..ఎందుకు చేశారో తెలియడం లేదన్నారు. 9 నెలలు అవుతున్నా, ప్రతిపక్ష నేత ఎక్కడికి వెళ్లిండో అర్థం కావడం లేదన్నారు.

ప్రజల సమస్యలపై కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదో తెలియడం లేదన్నారు. సీఎం తమ్ముడు తిరుపతి రెడ్డి ఆయన ఇల్లును కూల్చామనే అధికారులు నోటీసులు ఇచ్చారని, కానీ కోర్టు డైరెక్షన్ వల్లే కూల్చలేదన్నారు. ఇక గవర్నమెంట్ కు ఎవరైన విరాళాలు ఇవ్చొచ్చని, అదాని కూడా అదే తరహాలో ఇచ్చారన్నారు. హైడ్రా, మూసీ అంశాలు జీహెచ్ ఎంసీలో ప్రభావం చూపవన్నారు. ఫిరాయింపులపై కోర్టు నిర్ణయమే ఫైనల్ అని పేర్కొన్నారు. చేరికల విషయంలో జీవన్‌రెడ్డికి వివరించిన తర్వాతే చేర్చుకున్నామన్నారు. జీవన్ రెడ్డికి పార్టీ అండగా ఉంటుందన్నారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, భూ ఆక్రమణలు ఇలా అన్ని కేసులపై విచారణ జరుగుతుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ పెద్ద వ్యవహారమని, కేంద్రాచట్టలు వర్తిస్తాయన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి అనుసంధానకర్తగా గాంధీ భవన్ ఉంటుందన్నారు. 2029 ఎన్నికలు తమకు ఫైనల్ అని పేర్కొన్నారు. బీసీల అంశంలో మల్లన్న పక్కదారి పట్టారని, తాను, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ దీపాదాస్ మున్షి సర్ధి చెప్పామన్నారు.


Similar News