పేదల ఇళ్లు కూల్చొద్దు రేవంత్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్‌కు మూసీ బ్యూటిఫికేషన్ అవసరమేనని, కానీ పేదల ఇండ్లను తొలగించకుండా చేపట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు....

Update: 2024-10-26 17:17 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌కు మూసీ బ్యూటిఫికేషన్ అవసరమేనని, కానీ పేదల ఇండ్లను తొలగించకుండా చేపట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను కిషన్ రెడ్డి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ పారిశ్రామిక రంగం, ఐటీ, ఫార్మా, డిఫెన్స్, హెల్త్ సెక్టార్, విద్యారంగాల్లో హైదరాబాద్ వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని ఆయన తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు క్రాంటాక్టర్లకు బిల్లులు లేక, హైదరాబాద్ సివిక్ ప్రాబ్లమ్స్‌లో పని చేసే కార్మికులకు జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మంజూరైన పనులకు టెండర్లను పిలిస్తే క్రాంటాక్లర్లు ముందుకు రాని పరిస్థితి ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు. చిన్నపాటి వర్షం పడితే డ్రైనేజీ వాటర్ ఇండ్లలోకి రావడంతో ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, అనేక బస్తీలు, హైదరాబాద్ చుట్టుపక్కల కాలనీల్లో ఓపెన్ డ్రైనేజీ ఉందని కిషన్ రెడ్డి అన్నారు. ఇంతవరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటుచేయలేదన్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో డ్రైనేజీ వ్యవస్థ స్తంభించిపోయే అవకాశం ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే.. రూ.లక్షన్నర కోట్లతో మూసీ నది బ్యూటిఫికేషన్ చేస్తామని అంటున్నారని, ముందు బస్తీల్లో డ్రైనేజీ సమస్యను పరిష్కారం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగర అభివృద్ధి విషయంలో హైలెవల్ మీటింగ్ ఏర్పాటు చేసి కావాల్సిన నిధులు మంజూరు చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా గిరిజన సాంప్రదాయ నృత్యమైన ‘గుస్సాడి’కి ప్రత్యేక గుర్తింపు తీసుకుకొచ్చిన పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు మృతిపై విచారం వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సైతం కనకరాజు మరణం బాధాకరమని పేర్కొన్నారు. కనకరాజు ఆత్మకు శాంతి చేకూరాలని కిషన్ రెడ్డి కోరారు.


Similar News