ఏక్ స్టేట్ -ఏక్ పోలీస్ వ్యవస్థ వారికి అవసరం!

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరి జీవితాల్లో పాటుగా బెటాలియన్ కానిస్టేబుల్ కుటుంబాల బతుకులు కూడా మారుతాయనే ఆకాంక్షతో

Update: 2024-10-27 01:15 GMT

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరి జీవితాల్లో పాటుగా బెటాలియన్ కానిస్టేబుల్ కుటుంబాల బతుకులు కూడా మారుతాయనే ఆకాంక్షతో ఎదురుచూసిన వారి కుటుంబాల్లో నిరాశే మిగిలింది. బెటాలియన్ పోలీస్ కానిస్టేబుల్ కుటుంబాల్లో గత కొన్ని సంవత్సరాలుగా దాగివున్న అసంతృప్తి పెల్లుబికి ఆందోళనగా మారి, అది రాష్ట్ర రాజధానిని చుట్టుముట్టింది. గతంలో రాజకీయ పార్టీలు ఏక్ పోలీస్ వ్యవస్థ ఏర్పాటు విషయంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. సమకాలీన సమాజంలో ప్రాధాన్యత లేని ఈ బెటాలియన్ పోలీస్ వ్యవస్థ నిర్వహణ కూడా రాష్ర్ట ప్రభుత్వానికి ఆర్ధిక భారంగా మారుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో బెటాలియన్ స్పెషల్ పోలీస్ వ్యవస్థను రద్దు చేసి 'ఏక్ స్టేట్ -ఏక్ పోలీస్' విధానం తీసుకొని రావడం ద్వారా కానిస్టేబుల్‌ల కుటుంబాల జీవితాల్లో గుణాత్మక మార్పులు సాధ్యం అవుతాయి.

నాడు మలిదశ తెలంగాణ ఉద్యమంలో కానిస్టేబుల్ కృష్ణయ్య ముదిరాజ్, డీఎస్పి నళిని, కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ లాంటి ఎందరో పోలీస్ వీరుల ఉద్యమ స్ఫూర్తితో ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం.. నేడు తెలంగాణలో పోలీసు కుటుంబాలు న్యాయబద్ధమైన హక్కులకై రోడ్డుకెక్కడం చాలా బాధాకరమైన విషయం. బ్రిటిష్ కాలం నాటి పాత పోలీస్ వ్యవస్థ విధానాన్ని బెటాలియన్ పోలీస్ వ్యవస్థలో నేటి స్వతంత్ర భారతదేశంలో కూడా అమలుపరచడం వలసవాద పాలనను తలపిస్తుంది.

బెటాలియన్ పోలీస్ వ్యవస్థ ఉద్దేశం

నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో పెరుగుతున్న వామపక్ష భావజాలాన్ని నియంత్రించేందుకు, నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు ఈ బెటాలియన్ పోలీస్ వ్యవస్థను బలోపేతం చేస్తూ, గ్రే హౌండ్స్ అనే కొత్త పోలీస్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. కానీ, మలిదశ తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఆ విప్లవ పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రంకై పోరాడాయి. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తదనంతరం నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ, కొంతవరకు యువత ఆధునిక భావాల వైపు వెళుతున్నారు. దీంతో గత ముఖ్యమంత్రి కల్వ కుంట్ల చంద్రశేఖర్ రావు కూడా నక్సలిజం ప్రభావం తగ్గిందని ప్రకటించారు. సీఆర్పీఎఫ్ లాంటి కేంద్ర బలగాలు జాతీయ స్థాయిలో దేశ రక్షణలో బాధ్యత వహిస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్ పోలీస్ ఇండియన్ రిజర్వ్ అనే పేరుతో తెలంగాణ రాష్ర్ట బెటాలియన్ పోలీస్‌లను వివిధ రాష్ట్రాలలో పనిచేయించడం కూడా సహేతుకం కాదని గ్రహించాల్సిన వాస్తవం. అలాగే దేశంలో శాటిలైట్, ఇంటర్నెట్, జీపీఎస్ సదుపాయాల ద్వారా నిఘా వ్యవస్థలు కూడా పటిష్టమవుతున్న నేపథ్యంలో తెలంగాణ బెటాలియన్ స్పెషల్ పోలీస్ వ్యవస్థ అవసరం, మనుగడ నేడు ప్రశ్నార్థకంగా మారింది.

సమస్య ఆవిర్భావం..

ఈ బెటాలియన్ స్పెషల్ పోలీస్ వ్యవస్థలో విధాన పరమైన అంశాలైన ‘కంపెనీ మూమెంట్’ అనే విధానంలో పోలీసులని ఒకచోట కొన్నిరోజుల వరకు కుటుంబానికి దూరంగా ఉంచడం జరుగుతుంది. ఈ కంపెనీ మూమెంట్ కారణంగా ఎన్నో పోలీస్ కుటుంబాలు అత్యవసర విషయాలకి తమ కుటుంబ పెద్ద దిక్కు అయిన ఉద్యోగి సమయానికి అందుబాటులో లేకపోవడంతో జరిగిన ప్రాణ, ఆర్థిక నష్టాలు వెలకట్టలేనివి. అంతేకాకుండా ‘రోల్ కాల్’ విధానం లో పోలీసు కానిస్టేబుల్ కచ్చితంగా ఉదయం, సాయంత్రం అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల ఒక ఉద్యోగి రోజుకు కనీసం 12 గంటలు సంబంధిత బెటాలియన్‌లోనే ఉండాల్సిన సందర్భం ఏర్పడుతుంది.

అనైతిక బానిసత్వం ఇంకానా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వీరిని రాత పరీక్షలు నిర్వహించకుండా కేవలం ఫిజికల్, దేహదారుఢ్య పరీక్షల ద్వారా ఎంపిక చేసినప్పటికీ, వారు నేడు ఉన్నతాధికారులుగా పదవీ విరమణ వయసుకి దగ్గరలో ఉన్నారు. వీరికి కనీసం పరిపాలనకు సంబంధించిన ప్రాథమిక విషయాలపై అవగాహన లేక కిందిస్థాయి కానిస్టేబుల్స్‌పై ఆధారపడుతున్నారు. అంతేకాకుండా, అనధికారికంగా అమలు అవుతున్న ‘ఆర్డర్లీ’ విధానంలో ప్రతీ ఉన్నత అధికారికి కొంతమంది బెటాలియన్ కానిస్టేబుల్‌లను అనుసంధానం చేసి, అనైతిక సేవలను, ఉద్యోగ మ్యానువల్‌లో లేని పనుల ను వారికి కేటాయిస్తూ, భయంతో కూడిన బలవంతపు వెట్టిచాకిరీ విధానంలోకి వారిని నెట్టివేసింది. ఈ బెటాలియన్ పోలీస్ వ్యవస్థలో ఉన్న అంతర్గత అధికారిక ఒత్తిడి, వివక్షల కారణంగా ఎంతోమంది కానిస్టేబుల్ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ, ఇప్పటివరకు ఆత్మహత్యలపై ఒక్క నిజనిర్ధారణ కమిటీని కూడా నియమించకపోవడం గమనార్హం.

ఇది కుల వ్యవస్థలో భాగమే..!

ఒకే పోలీసు నియామక బోర్డు ద్వారా ఎంపికైనా భిన్న విభాగ పోలీస్ వ్యవస్థలలో బెటాలియన్ వ్యవస్థకు సంబందించిన పోలీసు ఉన్నతాధికారులు కంపెనీ మూమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో పోలీస్ స్టేషన్‌లను కేటాయించినప్పుడు సివిల్, ఏ.ఆర్ లాంటి ఇతర పోలీసు విభాగాల నుండి వివక్షలకు గురికావడం ఒక రకమైన కుల వ్యవస్థని తలపిస్తుంది. గతంలో తమిళ చిత్ర పరిశ్రమలో రైటర్, విడుదల వంటి సినిమాలు పోలీస్ వ్యవస్థలోని వివక్షని సమాజానికి తెలిపే ప్రయత్నం చేసి, ఆయా రాష్ట్రాలలో పోలీస్ వ్యవస్థలో సంస్కరణలకై పరోక్ష కృషి చేయడం జరిగింది. కానీ తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఇలాంటి సామాజిక పరమైన అంశాలతో చిత్రాలు నిర్మించలేకపోవడం గమనార్హం.

రక్షించే వారికే రక్షణ కరువై..

ఎన్నో సంవత్సరాలుగా నష్టపోతున్న పోలీస్ కానిస్టేబుల్ 'కార్మిక' కుటుంబాలు డిమాండ్ చేస్తున్న అంశాలు.. 'ఒకే రాష్ట్రం ఒకే పోలీస్' విధానాన్ని అమలుపరచడం, ఒకే పనిపై వాళ్లని నియమించడం, వారికి ఎనిమిది గంటల పని విధానాన్ని కల్పించడం. ‌కానిస్టేబుల్స్‌నీ వివక్షకు గురి చేయకుండా, అనైతిక బానిసత్వం నుంచి విముక్తి కలిగించి వృత్తిపరంగా గౌరవప్రదమైన జీవితాన్ని కల్పించాలి. కుటుంబానికి దూరంగా ఉంచి, వారి పిల్లల భవిష్యత్తు‌కి ఆటంకం కలిగించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ కుటుంబాన్ని, ప్రభుత్వాన్ని కాపాడే పోలీస్ వ్యవస్థలోని కానిస్టేబుల్ కుటుంబాలకి రక్షణ నేడు కరువు అయింది. సమకాలీన సమాజంలో ప్రాధాన్యత లేని ఈ బెటాలియన్ పోలీస్ వ్యవస్థ నిర్వహణ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ధిక భారంగా మారుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో బెటాలియన్ స్పెషల్ పోలీస్ వ్యవస్థను రద్దు చేసి 'ఏక్ స్టేట్ -ఏక్ పోలీస్' విధానం తీసుకొని రావడం ద్వారా కానిస్టేబుల్‌ల కుటుంబాల జీవితాల్లో గుణాత్మక మార్పులు సాధ్యం అవుతాయి. 

డా. గాదె. వంశీధర్

ఉస్మానియా విశ్వవిద్యాలయం

97018 11602

Tags:    

Similar News