రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం!

భారతదేశంలో రాజ్యాంగం సర్వోన్నతమైనది. దేశంలోని అన్ని వ్యవస్థలు, సంస్థలు భారత రాజ్యాంగ పరిధికి లోబడే పనిచేయాలి. కానీ గత దశాబ్ద కాలంలో భారత

Update: 2024-11-26 00:45 GMT

భారతదేశంలో రాజ్యాంగం సర్వోన్నతమైనది. దేశంలోని అన్ని వ్యవస్థలు, సంస్థలు భారత రాజ్యాంగ పరిధికి లోబడే పనిచేయాలి. కానీ గత దశాబ్ద కాలంలో భారత రాజ్యాంగ మౌలిక స్వరూపమే మార్చే విధంగా రాజ్యాంగం దాడులను ఎదుర్కొంటుంది. ప్రస్తుతం రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్ల నుండి బయటపడాలంటే ప్రజా చైతన్యమే శరణ్యం. రాజ్యాంగం ఎంత మంచిదైనా, గొప్పదైన దానిని అమలు చేసే వాళ్లు చెడ్డవాళ్లు అయితే అది పని చేయదని అంబేద్కర్‌ చెప్పారు. అందుకే భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత భారతీయులందరిపైన ఉంది. ఇందుకోసం బాలల్లో రాజ్యాంగ విలువలు, లక్ష్యాల మీద పూర్తి అవగాహన కల్పించాలి.

దేశంలో కొనసాగుతున్న కార్పొరేట్ రాజకీయాలు, క్రోనీ క్యాపిటలిజం రాజ్యాంగ మౌలిక లక్ష్యాలకు పూర్తిగా విరుద్ధం. కార్పొ రేట్లు రాజకీయ రంగాన్ని నియంత్రిస్తూ వారి వ్యాపార(స్వ) ప్రయోజనాలను కాపాడుకుంటున్నారు. పాలకులు భారత రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇచ్చి, వారి సైద్ధాంతిక భావజాలాన్ని ప్రజలపై రుద్దడం ఎంత వరకు సమంజసం? ప్రజల్లో శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించాల్సిన వారే మూఢ నమ్మకాలను ప్రోత్సహిస్తూ, శాస్త్రీయ వైఖరులకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంటే పౌర సమాజం బాధ్యతగా మెలగల్సిన అవసరం ఉంది. పాలకులు ప్రశ్నించే గొంతులను నొక్కేస్తూ, చరిత్రను, చారిత్రక చిహ్నాలను ధ్వంసం చేస్తూ, ప్రజా శ్రేయస్సు మరిచి కార్పొరేట్లకు దాసోహం అంటూ, వారి సైద్ధాంతిక భావజలాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దుతూ రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నారు.

సంవిధాన్ దివస్...

రాజ్యాంగం అత్యున్నత విలువలతో కూడుకున్నది. ప్రజలు, కుల, మత, భాష, లింగ, ప్రాంత, జాతి మొదలైన తారతమ్యాలు లేకుండా అందరూ సమానమేనని రాజ్యాం గం పునరుద్ధరించింది. స్వేచ్ఛ, సమానత్వం సౌబ్రాతృత్వం, సమన్యాయం, లౌకికవాదం సమగ్రత మొదలైన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఆచరించేలా రూపొందించారు. ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలతో దేశ ప్రజలందరూ ఒక్కటే అని చాటి చెప్పింది. దేశ ప్రజలందరూ ఇష్టపూర్వకంగా ఒప్పుకొని ఆమోదించుకున్న నియమాలు, ప్రతిజ్ఞలు, హక్కులు, బాధ్యతల సమాహారమే ఈ రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని అంబేద్కర్‌ ఆధ్వర్యంలో ముసాయిదా కమిటీ ప్రపంచంలోని 60 దేశాల రాజ్యాంగాలను తులనాత్మక అధ్యయనం చేసి రూపొందించింది. 1949 నవంబర్‌ 26న భారత రాజ్యాంగ సభ అధికారికంగా భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. రాజ్యాంగ విలువల పట్ల దేశ ప్రజల్లో గౌరవ భావాన్ని పెంపొందించడానికి ప్రతీ యేటా నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2015లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ 125వ జయంతి సందర్భంగా నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాజ్యాంగ దినోత్సవాన్ని 'సంవిధాన్ దివస్' అని జాతీయ న్యాయ దినోత్సవం అని కూడా పిలుస్తారు.

రాజ్యాంగ విలువలు నేర్పించాలి!

నేటి బాలలే రేపటిపౌరులు..142 కోట్ల భారతదేశ జనాభాలో 15ఏళ్లలోపు ఉన్న బాల లు 36 కోట్లు. దేశ జనాభాలో వీరు 25. 4%. భవిష్యత్ భారతావని ముఖచిత్రాన్ని మార్చే మూల స్తంభాలే ఈ చిన్నారులు. కుల, మత భావోద్వేగాలను రాజకీయాలకు వాడుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత రాజ్యాంగ విలువలను నేటి బాలలకు నేర్పిం చడం అత్యావశ్యకం. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 74 సంవత్సరాలు పూర్తి అయింది. దేశంలో భిన్నత్వంలో ఏకత్వం కొనసాగడానికి రాజ్యాంగం ఎంతో దోహద పడింది. భారత రాజ్యాంగ మౌలిక లక్ష్యాల ను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. నేటి బాలల్లో చిన్నప్పటి నుంచే భారత రాజ్యాంగ విలువలు పెంపొందించడానికి ప్రజలంతా ఒకటే అనే భావన కల్పించుటకు మనుషుల మధ్య ఉన్న సామాజిక, ఆర్థిక అంతరాలు మనుషులను దూరం చేయకూడదని వీరిలో సమతాభావం పెం పొందించుటకు బాలలకు భారత రాజ్యాంగ విలువలు నేర్పించాలి. ఇందుకోసం బాల్యం నుంచే ప్రతిరోజు బడుల్లో ప్రార్థన సమ యంలో విధిగా భారత రాజ్యాంగ ప్రవేశిక ప్రతిజ్ఞ చేపించాలి. దీని ద్వారా భారత రాజ్యాంగంపై బాల్యం నుండే బాలలకు గౌరవం, అధ్యయనం చేయాలనే ఆలోచన పెరుగుతుంది. తెలుగు రాష్ట్రాలు ఇందుకై చొరవ తీసుకొని రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో ప్రార్థన సమయంలో రాజ్యాంగ ప్రవేశ పీఠిక ప్రతిజ్ఞ చేయించేలా చర్యలు తీసుకుని రేపటి పౌరులను భారతదేశంలోనే అత్యున్నత విలువలు గల వ్యక్తులుగా తీర్చిదిద్దాలి. బాలల్లో రాజ్యాంగ విలువలు, లక్ష్యాల మీద పూర్తి అవగాహన కల్పించడం వల్ల వారిని అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్ది భవిష్యత్ తరానికి అందించిన వారమవుతాము. 

(సంవిధాన్ దివస్...సందర్భంగా)

- పాకాల శంకర్ గౌడ్.

సామాజిక విశ్లేషకులు.

98483 77734

Tags:    

Similar News