ఆ ఊరు వినాయక నిమజ్జనానికి దూరం

దేశమంతా నవరాత్రి పూజల అనంతరం వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడం అనవాయితీగా వస్తుండగా ఆ ఊర్లో మాత్రం వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేయకపోవడమే విచిత్ర ఆనవాయితీగా కొనసాగుతుంది.

Update: 2024-09-18 06:27 GMT

దిశ, వెబ్ డెస్క్ : దేశమంతా నవరాత్రి పూజల అనంతరం వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడం అనవాయితీగా వస్తుండగా ఆ ఊర్లో మాత్రం వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేయకపోవడమే విచిత్ర ఆనవాయితీగా కొనసాగుతుంది. గత 75 ఏళ్లుగా వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా ఆ ఊరి ప్రజలు భద్రపరుస్తున్నారు. తెలంగాణలోని నిర్మల్ జిల్లా కుభీర్ మండలం సిర్పెల్లి సమీపంలోని మహారాష్ట్ర సరిహద్దు గ్రామం పాలాజ్ లో కర్ర గణేశుడు కొలువై ఉన్నాడు. ప్రతి సంవత్సరం వినాయక చవితికి గ్రామస్తులు బీరువాలో భద్రపరిచిన కర్ర వినాయకుడిని బయటకు తీసి 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు. నవరాత్రుల పూజల అనంతరం చివరి రోజున గణేశుడి విగ్రహాన్ని గ్రామ సమీపంలోని వాగుకు తీసుకొచ్చి నీళ్లు చల్లి మళ్లీ తీసుకుని వెళ్లి బీరువాలో భద్రపరుస్తారు. ఇలా 75 ఏళ్లుగా కర్ర వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా ప్రతి సంవత్సరం నవరాత్రుల్లో తిరిగి బయటకు తీసి ప్రతిష్టించుకుని ఊరంతా పూజలు చేసి తిరిగి భద్రపరుచుకోవడం చేస్తున్నారు. వినాయకుడిని నిమజ్జనం చేయడం అరిష్టమని..అందుకే గత 75ఏళ్లుగా ఇదే ఆచారాన్ని అనుసరిస్తున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే కర్రతో రూపొందించిన వినాయక విగ్రహం కావడంతో విగ్రహం దెబ్బతినకుండా కాపాడే చర్యల్లో భాగంగానే నిమజ్జనం చేయకుండా ఉండే ఆచారాన్ని పూర్వికులు ముందు చూపుతో అనుసరించేలా చేశారని కూడా మరికొందరు పేర్కొన్నారు.  


Similar News