ఆ వర్గం ఓటు బ్యాంకు టార్గెట్.. బీజేపీ వద్ద రెడీగా మరో సంచలన ఎన్నికల అస్త్రం!

రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణపై బీజేపీ వరాల వర్షం కురిపిస్తున్నది.

Update: 2023-10-05 01:50 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణపై బీజేపీ వరాల వర్షం కురిపిస్తున్నది. దీర్ఘకాలంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్‌లో ఉన్న హామీలపై చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నది. తొమ్మిదేళ్లుగా కాగితాలకే పరిమితమైన పసుపు బోర్డు ఏర్పాటు, గిరిజన వర్శిటీ హామీపై నిర్ణయం తీసుకున్నది. కేబినెట్‌లో ఆమోదం పొందడానికి ముందే స్వయంగా ప్రధాని మోడీ తెలంగాణ గడ్డ మీద నుంచి ప్రకటనలు చేశారు.

ఆ వరుసలో ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ డిమాండ్‌నూ క్లియర్ చేయాలని భావిస్తున్నది. ఆగమేఘాల మీద మందకృష్ణ మాదిగను ఢిల్లీకి పిలిపించుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా దీనిపై నాలుగు రోజుల క్రితం చర్చించారు. ఎలక్షన్ ప్రచారంలో భాగంగా స్వయంగా అమిత్ షా లేదా ప్రధాని మోడీ దీనిపై స్పష్టమైన ప్రకటన (హామీ) ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ ఈ ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. ఎస్సీ వర్గీకరణ డిమాండ్‌పై స్పష్టమైన హామీ ఇవ్వడం ద్వారా మాదిగ ఓటు బ్యాంకును కొంత వరకైనా ఆకర్షించొచ్చన్నది బీజేపీ ఆలోచన. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఐదు నెలల్లోనే (నవంబర్ 29, 2014) అసెంబ్లీలో తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపినప్పటికీ తొమ్మిదేళ్లుగా ఎలాంటి నిర్ణయానికి నోచుకోకుండా పెండింగ్‌లో ఉండిపోయింది.

అధికార పార్టీ దళితబంధు పేరుతో దళితుల ఓట్లు తన వైపునకు తిప్పుకునే ప్రయత్నం రెండున్నరేళ్ల క్రితమే ప్రారంభించింది. ఎస్సీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ కొన్ని గ్యారెంటీలను ప్రకటించి ఆ సెక్షన్‌కు దగ్గరయ్యేందుకు కసరత్తు మొదలు పెట్టింది. బీజేపీకి అలాంటి అస్త్రం లేకపోవడంతో ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ తమతోనే సాధ్యమని హామీనిచ్చి ఎన్నికల్లో లబ్ధి పొందాలని అనుకుంటున్నది.

మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన బీజేపీ

ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని, ఈ అధికారాన్ని రాష్ట్రాలకే అప్పగించేలా కేంద్రాన్ని ఒప్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలంగాణ బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టో (2018)లో పేర్కొన్నది. కేంద్రంలో అధికారంలో ఉన్నది ఆ పార్టీయే అయినా ఇప్పటివరకూ ఆ దిశగా తీసుకున్న చర్యలేమీ లేవు. వెంకయ్యనాయుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పలు సందర్భాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు.

తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ కోసం జరుగుతున్న పోరాటం ఒక పార్టీకి సంబంధించిన రాజకీయ అంశం కాదని, ఒక కులం మీద మరో కులం కొట్లాడేది కాదని, ఇది సామాజిక అంశమని 2016 నవంబర్ 27న పెరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన ఎంఆర్‌పీఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి) ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభలో వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ దృష్టిలోనూ ఇది ఉన్నదని నొక్కిచెప్పారు. వర్గీకరణ అంశం సాకారం కావాలంటే చట్టం రూపొందాల్సి ఉన్నదని, పార్లమెంటు ఆమోదం అనివార్యమని వెంకయ్యనాయుడు నొక్కిచెప్పారు.

కేంద్రంలో 2014లో ప్రధాని మోడీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడినా ఎస్సీ వర్గీకరణ డిమాండ్‌కు పరిష్కారం లభించకపోవడంతో మంద కృష్ణ మాదిగ సహా పలు పార్టీల నేతలు ఈ విషయాన్ని వెంకయ్యనాయుడు దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర మంత్రివర్గంలో చర్చించి క్లియరెన్స్ లభించేలా చొరవ తీసుకోవాలని కోరారు. కానీ ఆయన మంత్రివర్గం నుంచి వైదొలిగి ఉప రాష్ట్రపతిగా పదవీ కాలం ఐదేండ్లు పూర్తయినా వర్గీకరణ అంశం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న తరహాలో ఉండిపోయింది.

పసుపు బోర్డు తరహాలో ప్రకటన

పసుపు బోర్డు విషయంలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత 2014-19 మధ్యకాలంలో పలుమార్లు కేంద్ర వాణిజ్య, వ్యవసాయ మంత్రులకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం స్వయంగా ప్రధానికి విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు వేదికగా బీఆర్ఎస్ ఎంపీలు ఉభయ సభల్లోనూ ఈ అంశాన్ని లేవనెత్తారు. కానీ ‘అసాధ్యం’ అంటూ వ్యవసాయ శాఖ మంత్రులు రాధామోహన్ సింగ్, నరేంద్రసింగ్ తోమర్, వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు వేదికగా పలుమార్లు స్పష్టం చేశారు.

ఈ రీజన్‌తోనే పసుపుబోర్డు అంశానికి అతీగతీలేకుండా పోయింది. కానీ హటాత్తుగా ప్రధాని మోడీ స్వయంగా తెలంగాణ గడ్డ మీద నుంచే పసుపు బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మూడు రోజుల వ్యవధిలోనే కేంద్ర కేబినెట్‌ ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. గిరిజన వర్శిటీ విషయంలోనూ అదే జరిగింది.

ఇప్పుడు ఈ రెండు ప్రకటనల తరహాలోనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర పర్యటనకు వచ్చే ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్‌షా.. ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నది. మంద కృష్ణ మాదిగను హడావిడిగా ఢిల్లీకి పిలిపించుకున్న అమిత్ షా ఎస్సీ వర్గీకరణ అంశం గురించి చర్చించారు. కిషన్‌రెడ్డి చొరవతో రానున్న రోజుల్లో పొలిటికల్ మైలేజ్ పెంచుకోవడానికి బీజేపీ ఈ అంశాన్ని

తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. ఎస్సీ వర్గీకరణపై ప్రధాని లేదా అమిత్ షా ప్రకటన చేస్తారా?.. లేక హామీతోనే సరిపెట్టుకుంటారా ? అనేది క్లారిటీ రావాల్సి ఉన్నది. రానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే బిల్లు పెట్టనున్నట్లు హామీ ఇస్తారనే లీకులు అందుతున్నాయి. అప్పటికల్లా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉన్నది.

రాష్ట్రంలో వర్గీకరణ ఎఫెక్ట్ ఏ మేరకు ఉంటుందనే లెక్కలను పరిశీలిస్తే...

(2011 జనాభా లెక్కల వివరాల ప్రకారం)

రాష్ట్రంలో మొత్తం దళిత జనాభా : 54.32 లక్షలు

ఇందులో మాదిగ సామాజికవర్గం : 32.22 లక్షలు

మాల సామాజికవర్గం : 15.27 లక్షలు

అమలవుతున్న రిజర్వేషన్ : 15%

వర్గీకరణ డిమాండ్ ప్రకారం.. (జస్టిస్ రామచంద్రరాజు నివేదికలోని సిఫారసుల..) : 1% గ్రూప్-ఏ (ఆది ఆంధ్రులు); 6% గ్రూప్-బీ (మాల.. తదితర); 7% గ్రూప్-సీ (మాదిగ.. తదితర); 1% గ్రూప్-డీ (రెల్లి.. తదితర)

తెలంగాణ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో (2018)లో 11వ హామీ

తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం : 2014 నవంబర్ 29

Tags:    

Similar News