తెలంగాణ నిరుద్యోగులకు టీజీఎస్ఆర్టీసీ గొప్ప శుభవార్త!

తెలంగాణలోని నిరుద్యోగులకు టీజీఎస్ఆర్టీసీ గొప్ప శుభవార్త చెప్పింది.

Update: 2024-06-02 12:38 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని నిరుద్యోగులకు టీజీఎస్ఆర్టీసీ గొప్ప శుభవార్త చెప్పింది. త్వరలోనే తెలంగాణ ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. హైద‌రాబాద్ లోని బ‌స్ భ‌వ‌న్ ప్రాంగ‌ణంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దశాబ్ది వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాల‌ర్పించిన అమ‌రుల‌కు నివాళుల‌ర్పించారు. అనంతరం టీజీఎస్ఆర్టీసీ భ‌ద్రతా సిబ్బంది నుంచి గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులు 2011లో 29 రోజులపాటు ‘మేము సైతం’ అంటూ సకల జనుల సమ్మెను కొనసాగించారని, దేశ చరిత్రలో జరిగిన అతి పెద్ద సమ్మెల్లో సకల జనుల సమ్మె ఒకటిగా నిలిచిందపని అన్నారు.

ఈ సమ్మెలో పెద్ద ఎత్తున 56,604 మంది ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొని స్వరాష్ట్ర సాధనకు నిర్విరామంగా కృషి చేశారని, తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చరిత్రలో నిలిచిపోయిందని కొనియాడారు. అలాగే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన 48 గంటల్లోనే అమలు చేశామని, ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమ స్పూర్తితో పని చేస్తుండటం వల్లే మహాలక్ష్మి విజయవంతంగా అమలవుతోందన్నారు. మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా మరో 2000 కొత్త డీజిల్, 990 ఎలక్ట్రిక్ బస్సులను దశల వారిగా వాడకంలోకి తీసుకురావాలని యాజమాన్యం నిర్ణయించిందని తెలిపారు. డీజిల్, ఎలక్ట్రిక్ బస్సులను కలుపుకుని మొత్తంగా 2990 కొత్త బస్సులు త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. కొత్త బస్సులకు అనుగుణంగా 3 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని తెలిపారు. ప్రభుత్వ అనుమతితో వాటిని వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని సజ్జనార్ వెల్లడించారు.


Similar News