ఓయూ డీన్ శ్రీరాములుకు గ్లోబల్ పవర్ లీడర్ అవార్డు
ఉస్మానియా యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగానికి చెందిన డీన్ డీ శ్రీరాములుకు గ్లోబల్ పవర్ లీడర్ అవార్డు దక్కింది.
దిశ, తెలంగాణ బ్యూరో : ఉస్మానియా యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగానికి చెందిన డీన్ డీ శ్రీరాములుకు గ్లోబల్ పవర్ లీడర్ అవార్డు దక్కింది. వరల్డ్ కన్సల్టింగ్ రీసెర్చ్ కార్పొరేషన్ ఇంటర్నేషనల్, మకామ్ మెక్ డతొనాల్డ్ అకాడమీ సంయుక్తంగా సిడ్నీలో న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. అకాడమీ అభివృద్ధిలో ఆయన చేసిన కృషి, సేవలు, విజన్, డెడికేషన్ కు గాను ఈ గుర్తింపు దక్కింది. ఇదిలా ఉండగా సిడ్నీ నుంచి వచ్చిన ఆయన ఓయూ వైస్ చాన్స్‌లర్‌ను ఆయన బుధవారం కలిశారు.
కాగా వర్సిటీ బృందం శ్రీరాములుకు అవార్డు దక్కడంపై హర్షం వ్యక్తంచేసింది. వారు ఆయనకు అభినందనలు తెలిపారు. వర్సిటీకి దక్కిన గౌరవంగా వైస్ చాన్స్‌లర్ మొలుగారం కుమార్ పేర్కొన్నారు. వర్సిటీకి ఇదొక గొప్ప మైలురాయిగా అభివర్ణించారు. బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగానికి శ్రీరాములు చేసిన అసమాన సేవలకు ఈ అవార్డు దక్కిందని వీసీ కుమార్ పేర్కొన్నారు. ప్రపంచ వేదికపై ఉన్నత విద్యలో ఉస్మానియా యూనివర్సిటీ అత్యుత్తమ కేంద్రంగా ఉందనేందుకు ఈ అవార్డు నిదర్శనమని వివరించారు. కాగా వీసీ కుమార్ కు, రిజిస్ట్రార్ గడ్డం నరేశ్ రెడ్డి, వీసీ ఓఎస్డీ జితేందర్ కుమార్ నాయక్, బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగాధిపతి వై జహంగీర్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్‌పర్సన్ స్మిత సాంబ్రాణికి శ్రీరాములు కృతజ్ఞతలు తెలిపారు.