TG Venkatesh vs kavitha: కవిత ఆవేశం తగ్గించుకో.. టీజీ వెంకటేశ్ కౌంటర్

జైలు బయట కవిత చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ కౌంటర్ ఇచ్చారు.

Update: 2024-08-28 05:52 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ పై బయటకు వచ్చాక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి, బీజేపీ నేత టీజీ వెంకటేశ్ కౌంటర్ ఇచ్చారు. కవిత మాట్లాడే భాష సరిగా లేదని ఆమె ఆవేశం తగ్గించుకోవాలని సూచించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన టీజీ వెంకటేశ్.. కవిత చాలెంజ్ తమిళనాడులో శశికళ అంతుతేలుస్తానంటూ మాట్లాడినట్లుగా ఉందని, కవిత చాలెంజ్ చేసిన తీరు కొంచెం బాధాకరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ పై బీజేపీ ప్రతీకారం తీర్చుకోవాలంటే యాక్షన్ వేరేలా ఉండేదన్నారు. పగ సాధించాలనే ఉద్దేశమే ఉంటే సీఎం రేస్ లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతున్న కేటీఆర్ నో లేదా కేసీఆర్ నో జైలుకు పంపేవారు కానీ కవితను కాదు కదా అని ప్రశ్నించారు. కవిత సీఎం రేస్ లో లేదని అలాంటప్పుడు ఆమెను ఎందుకు జైలుకు పంపుతామన్నారు. ఈ కేసులో ప్రత్యక్షంగానో పరోక్షంగానో కవిత పాత్ర ఉందనే ఆధారాలు దర్యాప్తు సంస్థలకు లభించడంతోనే ఆమెను అరెస్ట్ చేశారన్నారు. ఈ కేసులో కవితకు బెయిల్ మాత్రమే లభించిందని కేసు కొట్టివేయలేదన్నారు. ఒక వేళ కవిత తప్పు చేయకుంటే దుర్మార్గులతో తిరిగితే ఆ నిందలు వీళ్లకు కూడా పడేఅవకాశం ఉందన్నారు. బీజేపీతో బీఆర్ఎస్ రాజీపడలేదని, ఒక వేళ రాజీపడి ఉంటే కవిత భాష అలా ఉండేది కాదన్నారు. చెరువుల ఆక్రమణలపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని.. చెరువులను బతికించుకుంటే బాగుంటుందని టీజీ వెంకటేశ్ అభిప్రాయపడ్డారు. ఆ ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి కొనసాగించాలన్నారు. అక్రమ నిర్మాణఆలను వైసీపీ కూడా గాలికి వదిలేసిందని ఏపీలోనూ చెరువులను పరిరక్షించే చర్యలు చేపట్టాలన్నారు.


Similar News