TG Politics: వరదల్లో బురద రాజకీయం..! సైలెంట్ మోడ్‌లో ప్రతిపక్ష నేత

రాష్ట్రంలో వర్షాలు, వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే సహాయక చర్యల్లో నిమగ్నమైన మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగాన్ని డీమోరల్ చేసేలా ప్రతిపక్ష నేతలు విమర్శలు చేయడాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఖండించారు.

Update: 2024-09-03 02:27 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వర్షాలు, వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే సహాయక చర్యల్లో నిమగ్నమైన మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగాన్ని డీమోరల్ చేసేలా ప్రతిపక్ష నేతలు విమర్శలు చేయడాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఖండించారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ తన ఫామ్ హౌస్‌ను విడిచి బాధిత ప్రాంతాల్లో ప్రజలను కలిసి వారి కష్టనష్టాల్లో పాలు పంచుకుంటే బాగుండేదని, దాన్ని ఆయన బాధ్యతగా గుర్తిస్తే ప్రయోజనం ఉండేదన్న సీఎం.. ఆ పని చేయనప్పుడు ఆ హోదా అవసరమా? అని ప్రశ్నించారు. కేటీఆర్ తన అవసరాల కోసం అమెరికాలో ఉంటూ ఎక్స్ ద్వారా ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని కూడా తప్పుపట్టారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఆఫీసర్లతో రివ్యూ అనంతరం సూర్యాపేట జిల్లా పర్యటనలో మీడియాతో సీఎం పై వ్యాఖ్యలు చేశారు.\

హేళన చేయడం బాధ్యతారాహిత్యం

సొంత పార్టీ మనిషికి బెయిల్ కోసం 20 మంది లీడర్లు ఢిల్లీకి వెళ్లారని, కానీ ఇప్పుడు వరదల సమయంలో ప్రజలను ఆదుకోవడానికి మాత్రం ఒక్కరూ ముందుకు రావడంలేదని సీఎం పేర్కొన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా సాయం చేయడానికి రంగంలోకి దూకాలని, కానీ ఆ పని చేయడానికి బదులు ఫీల్డులో ఉన్నవారిని హేళన చేస్తూ మాట్లాడటం, విమర్శలు చేయడం బాధ్యతారాహిత్యమన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండానే తాము కేంద్ర ప్రభుత్వం నుంచి వరద నష్టానికి సాయాన్ని కోరుతున్నామని, కేంద్ర ప్రభుత్వం ఒక పెద్దన్న పాత్ర పోషించి రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరుతున్నామని తెలిపారు. అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వానికి సైతం రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతిపక్షం అలాంటి సహకారాన్ని అందించాలని కోరారు.

ఫీల్డు మీద లేని బీఆర్ఎస్!

స్వయంగా ఫీల్డులో తిరిగి ప్రజలు పడుతున్న కష్టాలు తెలుస్తాయని, తన లాగానే ప్రధాన ప్రతిపక్ష నేత కూడా వచ్చి తిరిగితే ప్రజలకు న్యాయం జరిగేదని సీఎం వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్‌కు చెందిన ఇద్దరు ముగ్గురు లీడర్ల తప్ప సీనియర్లు, మాజీ మంత్రులు బాధిత ప్రాంతాల్లో పర్యటించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రజలతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించేందుకు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్న బీఆర్ఎస్.. ఇప్పుడు వరదల సమయంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ఫీల్డులో లేకపోవడం చర్చనీయాంశమైంది. సీఎం ప్రస్తావన మాత్రమే కాకుండా ప్రజలూ దీన్ని చర్చించుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఎక్కడా కనిపించడంలేదంటూ కేటీఆర్ ఎక్స్ ద్వారా చేసిన కామెంట్లకు సీఎం ఘాటుగానే రిప్లయి ఇచ్చారు.

బీఆర్ఎస్ లీడర్లు, కేటీఆర్ చేసే కామెంట్లపై సీఎం రేవంత్ ఖమ్మం జిల్లా మీడియా సమావేశంలోనూ ప్రస్తావించి అలాంటి చిల్లర రాజకీయాలకు స్వస్తి చెప్పాలని హితవు పలికారు. క్లిష్ట సమయాల్లో రాజకీయాలకు అతీతంగా స్పందించడం ఒక అవసరమని, అదే భావనతో బీఆర్ఎస్ లీడర్లు కూడా చొరవ తీసుకుని ప్రజలకు సాయం చేసి ఉంటే అభినందించి ఉండేవారమన్నారు. దానికి బదులుగా ఫీల్డులో ఉండి పనిచేస్తున్నవారిని డీమోరల్ చేసే తరహాలో విమర్శలు చేయడం వ్యక్తిగతంగా కేటీఆర్‌కు, ఆయన పార్టీకి దోహదపడేది కాదని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకులుగా వారికి తగదన్నారు.


Similar News