శభాష్ సర్కార్.. దీపావళికి ముందే వరాల వర్షం

దీపావళి పండుగ కానుకగా ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్‌లో 3,500 చొప్పున అతి నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది.

Update: 2024-10-27 02:33 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: దీపావళి పండుగ కానుకగా ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్‌లో 3,500 చొప్పున అతి నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. ఉద్యోగులకు గత ప్రభుత్వం నుంచీ పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏ (కరువుభత్యం)లలో ఒకదాన్ని వెంటనే ఇవ్వాలని నిర్ణయించింది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 317లోని ఇబ్బందులపై కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్టును కూలంకషంగా చర్చించిన మంత్రివర్గం... వెంటనే స్పౌజ్, మ్యుచవల్, హెల్త్ గ్రౌండ్స్ బదిలీలను చేపట్టాలని నిర్ణయించింది. జీవో 46తో పాటు జీవో 317లోని వివాదాస్పదంగా ఉన్న బదిలీల విషయంలో త్వరలో అసెంబ్లీ సెషన్‌లో చర్చించి తగిన సవరణలు చేసి కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ కోసం పంపాలని కూడా నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా కులగణన ప్రక్రియను నవంబరు 30 లోగా కంప్లీట్ చేయాలని తీర్మానించింది. హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణలో భాగంగా ఐదు లైన్లను పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించాలని కూడా నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ అధ్యక్షతన సచివాలయంలో శనివారం సాయంత్రం దాదాపు ఐదు గంటల పాటు చర్చించిన కేబినెట్ అంశాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ మీడియాకు వివరించారు.

ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్‌కు 3,500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నదని, దీపావళి పండుగ అమావాస్య రోజును పరిగణనలోకి తీసుకుని మరుసటి రోజు లేదా నవంబరు 2 తేదీన లాంఛనంగా శ్రీకారం చుట్టాలని కేబినెట్ నిర్ణయించినట్లు మంత్రులు తెలిపారు. పేదల్లో నిరుపేదగా ఉన్న కుటుంబాలకు గృహవసతి కల్పించేలా ప్రతీ గ్రామంలో గ్రామ సభ పెట్టి ఇందిరమ్మ కమిటీల ద్వారా పారదర్శకమైన పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగులకు గత ప్రభుత్వం నుంచీ పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలలో ఒకదాన్ని వెంటనే అమలు చేయాలని, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రభుత్వంలో వారు భాగస్వాములు కావడంతో ముఖ్యమంత్రి ఇటీవల ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపిన అనంతరం మంత్రివర్గంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సీఎం, డిప్యూటీ సీఎం వేర్వేరుగా జరిపిన సంప్రదింపుల అనంతరం కేబినెట్ ఈ దిశగా నిర్ణయం తీసుకుని దీపావళి కానుకగా ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. ఒక్క డీఏతో ప్రభుత్వానికి నెలకు అదనంగా రూ. 230 కోట్ల మేర ఖర్చవుతుందని, ఏటా ఇది దాదాపు రూ. 3 వేల కోట్లుగా ఉంటుందన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నందున ప్రస్తుతానికి ఒకటి రిలీజ్ చేయాలని కేబినెట్ నిర్ణయించిందని, ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే ఉద్యోగులు అడగకుండానే విడుదల చేస్తామని తెలిపారు.

గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 317, జీవో 46తో ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీల్లో, కొత్త ఉద్యోగాల నియామకాల్లో సమస్యలు తలెత్తాయని, కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదికను మంత్రివర్గ సమావేశంలో లోతుగా చర్చించి తక్షణం స్పౌజ్, మ్యుచువల్, హెల్త్ గ్రౌండ్స్ ఉన్న ఉద్యోగులను బదిలీ చేయాలని నిర్ణయించినట్లు మంత్రులు తెలిపారు. దూర ప్రాంతాలకు జరిగిన బదిలీల్లో చోటుచేసుకున్న ఇబ్బందులతో పాటు జీవో 46తో రిక్రూట్‌మెంట్‌లోని సమస్యలను అసెంబ్లీ సెషన్‌లో చర్చించి తగిన మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపాలని తీర్మానం చేసినట్లు వివరించారు. చట్టంతో వచ్చే చిక్కులు, న్యాయస్థానాల్లో ఉన్న కేసుల రీత్యా వెంటనే వాటిపై నిర్ణయం తీసుకోలేకపోయామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగానే కులగణనను రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాలని ఇటీవల నిర్ణయం తీసుకున్నదని, దీన్ని మంత్రివర్గ సమావేశంలో చర్చించిన తర్వాత నవంబరు 30 లోగా ప్రక్రియను పూర్తి చేయాలని డెడ్‌లైన్ పెట్టుకున్నట్లు మంత్రులు తెలిపారు. ప్లానింగ్ డిపార్టుమెంటును నోడల్ ఏజెన్సీగా నియమించినందున 80 వేల మంది సిబ్బందితో నవంబరు 3 లేదా 4 తేదీల్లో ప్రారంభించేలా షెడ్యూలుపై చర్చించినట్లు తెలిపారు. ప్రతీ బృందం 150 ఇంట్లను సర్వే చేసేలా ప్లానింగ్ జరిగిందన్నారు. ఇందుకోసం త్వరలోనే ట్రెయినింగ్ సెషన్ ఉంటుందని, సోమవారం ముఖ్యమంత్రి అధ్యక్షతన వివిధ విభాగాలు, జిల్లా కలెక్టర్లతో కాన్ఫరెన్సు ఉంటుందన్నారు.

ఖరీఫ్ సీజన్ ధాన్య సేకరణపైనా ఈ సమావేశంలో చర్చించామని, రైతుల నుంచ కొనుగోలు చేయడానికి దాదాపు 6 వేల కేంద్రాలను నెలకొల్పుతామని, ఇప్పటికే కొన్ని ప్రారంభమయ్యాయని పేర్కొన్న మంత్రులు... కస్టమ్ మిల్లింగ్ కోసం రైస్ మిల్లులకు ఇవ్వడానికి కేబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫారసులను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఇక్కడ రైతులకు మంచి జరిగే విధంగా నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. గతంలో మిల్లింగ్ కోసం ఇచ్చిన దాదాపు రూ. 20 వేల కోట్ల విలువైన ధాన్యం ఇంకా మిల్లుల దగ్గరే ఉన్నదని పేర్కొన్నారు. క్లీన్ చిట్ ఉన్న మిల్లులను కేటగిరీ-1గా పరిగణించి వడ్లను అందిస్తామన్నారు. ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన తర్వాత పేమెంట్ చేసిన మిల్లులను సెకండ్ కేటగిరీగా, నోటీసుల తర్వాత రికవరీ చేసినవాటిని థర్డ్ కేటగిరీగా, డిఫాల్టర్లను నాల్గవ కేటగిరీగా విభజించుకున్నట్లు తెలిపారు. చివరి కేటగిరీ మిల్లులకు కస్టమ్ మిల్లింగ్ కోసం ధాన్యాన్ని ఇవ్వవద్దని కేబినెట్ నిర్ణయించినట్లు తెలిపారు. మిల్లుల నుంచి బ్యాంకు గ్యారంటీలను తీసుకుని పక్క రాష్ట్రాలతో కంపేర్ చేసి బెస్ట్ రిజల్టు ఉండేలా పౌర సరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంటుందన్నారు. మిల్లర్లు లేవనెత్తిన అంశాలను పరిష్కరించడంపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు.

హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణలో భాగంగా ఫస్ట్ ఫేజ్‌లో పెండింగ్‌లో ఉన్న లింకులతో పాటు సెకండ్ ఫేజ్‌ను అమలు చేసేలా కేబినెట్ నిర్ణయం తీసుకున్నదని మంత్రులు తెలిపారు. నాగోల్-శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, రాయదుర్గం-కోకాపేట్, మియాపూర్-పటాన్‌‌చెరు, ఎల్బీనగర్-హయత్‌నగర్, ఎంజీబీఎస్-చంద్రాయణ్‌గుట్ట.. ఐదు లైన్లను కొత్తగా నిర్మించనున్నట్లు తెలిపారు. పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్‌గా ఈ ప్రాజెక్టు అమలవుతుందని, ఇందుకోసం సుమారు రూ. 24,269 కోట్లు ఖర్చవుతుందని, త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్ పంపనున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో దాదాపు 16 వేల కి.మీ. మేర రహదారులను నిర్మించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్, రోడ్లు-భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టేలా ఆ రెండు శాఖల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రులు వివరించారు. ప్రతీ గ్రామం నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు, జిల్లా కేంద్రం నుంచి రాజధానికి ఫోర్ లైన్ రోడ్లను నిర్మి,చనున్నట్లుతెలిపారు. రానున్న నాలుగేండ్ల కాలంలో ఈ టార్గెట్‌ను పూర్తి చేయడానికి పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిని ఎంచుకున్నట్లు తెలిపారు. పాత జిల్లాను యూనిట్‌గా తీసుకుని ఇంజనీరింగ్ నిపుణులు, అన్ని డిపార్టుమెంట్లలోని అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఈ విధానాన్ని స్టడీ చేసి మోడల్స్ తెప్పి,చుకుని సమగ్రమైన డీపార్‌ను రూపొందించాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపారు. అంచనా ప్రకారం గరిష్టంగా దాదాపు రూ. 28 వేల కోట్ల మేర నిధులు అవసరమవుతాయని తెలిపారు.

ప్రస్తుతం ఉన్న ఉస్మానియా ఆస్పత్రిని గోషామహల్ పోలీసు గ్రౌండ్స్ (స్టేడియం)కు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించగా దానికి అనుగుణంగా భూమిని బదలాయిస్తూ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు తెలిపారు.

ములుగులో నెలకొల్పనున్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి అవసరమైన 211 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఒక్కో ఎకరానికి నామినల్‌గా రూ. 250 ధరను నిర్ణయించినట్లు తెలిసింది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పుతున్న యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్శిటీ స్థాపనకు గతంలోనే కేబినెట్ ఆమోదం తెలిపిందని, ఈ సమావేశంలో దాన్ని తాత్కాలికంగా గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ స్టేడియంలో నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన స్కిల్స్ యూనివర్శిటీకి అనుసంధానం చేసేలా మధిర, హుజూర్‌నగర్, వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మూడు కొత్త ఐటీఐలను నెలకొల్పడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మంత్రులు తెలిపారు.

రాష్ట్రంలో రెండు కొత్త కాలేజీలను నిర్మించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకోగా తాజా కేబినెట్ భేటీలో ఇందుకు అవసరమైన సిబ్బందిని కేటాయించేలా నిర్ణయం జరిగినట్లు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, ఆదేశాల మేరకు రిజర్వాయర్లలో పేరుకుపోయిన పూడికను తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, కేబినెట్ భేటీలో దీనిపై లోతుగా చర్చ జరిగిన తర్వాత పైలట్ ప్రాజెక్టుగా కడెం రిజర్వాయర్‌ను ఎంపిక చేసినట్లు మంత్రులు వివరించారు. ఇక్కడి అనుభవాలను పరిగణనలోకి తీసుకుని విశ్లేషించిన తర్వాత మేజర్, మీడియం రిజర్వాయర్లలో సైతం పూడికతీత పనులను కంటిన్యూ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అన్ని రిజర్వాయర్లలో సగటున 23% మేర పూడికతీత పేరుకుపోయినట్లు తేలిందని, దీనితో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గిందన్నారు.

కులగణనపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ఒకే రోజులో ప్రక్రియను పూర్తి చేసిందని, ఆ రిపోర్టు ఇప్పటికీ బహిర్గతం కాలేదని ప్రస్తావించి ఈసారి జరగనున్న కులగణన పకడ్బందీగా పారదర్శకంగా జరుగుతుందన్నారు. మొత్తం 80 వేల మంది ప్రభుత్వ సిబ్బంది ఇంటింటి సర్వే చేస్తారని, ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనంతో పాటు కులాలవారీగా వివరాలను ఈ ప్రక్రియలో ప్రభుత్వం సేకరించనున్నట్లు తెలిపారు. ప్రతీ టీమ్ సగటున 150 ఇండ్లను కవర్ చేస్తుందని, నవంబరు 30 తేదీలోగా ప్రక్రియను పూర్తి చేసేలే కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రశ్నావళి, విధివిధానాలు, ఇతర రాష్ట్రాల్లోని అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ప్లానింగ్ డిపార్టుమెంటు నోడల్ ఏజెన్సీగా 30 రోజుల్లోనే పూర్తి చేసేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం అవసరమైన ట్రెయినింగ్‌ను నవంబరు 3, 4 తేదీల్లో లాంఛనంగా ప్రారంభించాలనుకుంటున్నామని, ముఖ్యమంత్రి ఒకటి రెండు రోజుల్లో (సోమవారం) సంబంధిత అధికారులు, జిల్లా కలెక్టర్లతో కాన్ఫరెన్సు ఏర్పాటు చేస్తారని తెలిపారు. 


Similar News