‘సైలెంట్ కాలేదు.. జస్ట్..!’ హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పెషల్ ఇంటర్వ్యూ

హైడ్రా నాలుగు రోజులపాటు ఆక్రమణలను కూల్చింది. సీఎం ప్రకటన రాగానే చల్లబడింది అని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

Update: 2024-10-27 02:17 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హైడ్రా నాలుగు రోజులపాటు ఆక్రమణలను కూల్చింది. సీఎం ప్రకటన రాగానే చల్లబడింది అని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ సైలెంట్ కాలేదు..చల్లబడలేదు..వ్యవస్థగతమైన నిర్మాణం…సాంకేతిక పరిజ్ఞ‌ానం పెంచుకుని మరింత స్ట్రాంగ్ గా తయారవుతోంది. విద్యా సంస్థల కూల్చివేతలను అకాడమిక్ ఇయర్ తర్వాత ప్రభుత్వ నిర్ణయానికనుగుణంగా చర్యలు ఉంటాయి. కొంత పనిగట్టుకుని హైడ్రాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే 100 పోస్టుల్లో 80 పోస్టులకు హైడ్రాకు అనుకూలంగా ఉంటున్నాయి. బెంగుళూరు, చెన్నై నగరాల్లో వచ్చిన వరదల కారణంగా అక్కడ కూడా హైడ్రా కావాలని డిమాండ్లు వస్తున్నాయి ‘ అని హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ అన్నారు. హైడ్రా ఏర్పడి నేటితో 100 రోజులు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ’దిశ‘కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పలు అంశాలను వెల్లడించారు.

సైలెంట్ అయింది.. హైడ్రా ఇంకా ఏం చేయలేదనే విమర్శలొస్తున్నాయి?

హైడ్రా సైలెంట్ కాలేదు. చేయాల్సిన పనులకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ చేస్తున్నది. చట్టపరమైన, సాంకేతిక పరమైన, వ్యవస్థాగత పరమైన అంశాలను కూడగట్టుకుని మరింత స్ట్రాంగ్‌గా మారడానికి సిద్ధమవుతోంది. గతంలో ప్రతి ఒక్క రూ హైడ్రా చట్టబద్దత గురించి మాట్లాడేవారు..ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇవ్వడంతో చట్టపరమైన బలం చేకూరింది. జీహెచ్ఎంసీ పరిధిలో పలు అంశా లకు అధికారాలొచ్చాయి.

మొదట్లో ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలోని అన్నింటినీ కూల్చస్తామన్నారు. తర్వాత అనుమతులుంటే కూల్చబోమంటున్నారు. ఏం జరిగింది?

హైడ్రా.. ప్రభుత్వం కింద పనిచేసే సంస్థ. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలకు కట్టుబడి హైడ్రా పనిచేస్తోంది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో ప్రభుత్వ సంస్థల నుంచి అనుమతులుంటే కూల్చబోం. ఒక వేళ ఎలాంటి అనుమతుల్లేని భవనం అయినా వాటిల్లో కుటుంబాలుంటే వాటిని కూడా కూల్చబోం. ఎందుకంటే కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసినవారు ఇబ్బందులు పడడమే కాదు. బ్యాంకు రుణాలు తీసుకుని ఇండ్లను కొనుగోలు చేస్తారు..కూల్చడంతో ఇల్లు పోతది..రుణం చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వేల కోట్ల సంపద అవిరైపోతుంది. ప్రజలకు నష్టం..ప్రభుత్వ ఆదాయానికి తీవ్ర నష్టం. అనుమతుల్లేకుండా వ్యాపార కార్యకలాపాలను నిర్వహించే వాటిని మాత్రమే కూల్చేస్తాం. స‌ర్వే నంబ‌ర్లు మార్చేసి.. త‌ప్ప‌డు స‌మాచారంతో అనుమ‌తులు పొంది.. భూములు, చెరువుల‌ను ఆక్ర‌మించి చేప‌ట్టిన‌ నిర్మాణాలపై హైడ్రా చ‌ర్య‌లు తీసుకుంటుంది.

ఆక్రమణలను గుర్తించడానికి ఎలాంటి సాంకేతిక పరిజ్ఞ‌ాన్ని వినియోగిస్తున్నారు?

చెరువులు, కుంటలు, వాటర్ బాడీలను డిజిటల్ సర్వే ద్వారా వివరాలు సేకరిస్తాం. భవిష్యత్ లో ఆక్రమణలు జరగకుండా, వాటిని గుర్తించడానికి సర్వే ఆఫ్ ఇండియా, ఎఆర్ఎస్ఏల సహకారం తీసుకుంటున్నాం. దీంతోపాటు సర్వే ఆఫ్ ఇండియా ద్వారా 1971-72 నాటి ట్రోఫోషీట్ తీసుకుంటాం. ఎఆర్ఎస్ఏ ద్వారా 2010లో వాటర్ బాడీస్ పరిస్థితి, ప్రస్తుత పరిస్థితిని ఫొటో ద్వారా గుర్తిస్తాం. దీంతోపాటు డీటీసీపీ ఆధ్వర్యంలో ’త్రీడీ శాటిలైట్ ఇమేజింగ్‘ విధానాన్ని అమలు చేయనున్నారు. వీటన్నింటిని వినియోగించుకోబోతున్నాం.

చెరువులకు ఫైనల్ నోటిషికేషన్ ఇవ్వలేదు. వాటిని ఎలా పరిరక్షిస్తారు?

ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో 549 చెరువులకు సర్వే నిర్వహించడంతోపాటు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించి 411 చెరువులకు ప్రిలిమినరీ నోటిపికేషన్ ఇచ్చాం. 138 చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చాం. త్వరలోనే అన్ని చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నాం. వీటితోపాటు ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన జియో ట్యాగింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.

విపత్తుల నిర్వహణ ఎలా ఉంది?

విపత్తుల నిర్వహణను సైతం హైడ్రా ప్రాధాన్యతగా తీసుకుంటుంది. నగరంలో 141 వాటర్ లాగింగ్ పాయింట్లు ఉన్నాయి. వాటిలో 30 ప్రాంతాలు ప్రమాదకరమైనవిగా గుర్తించాం. వీటి కారణంగా నగరంలో భారీగా ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. దీంతోపాటు వర్షాకాలంలో నాలాలు పొంగిపొర్లినప్పుడు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులెదుర్కొంటున్నారు. అయితే బెంగళూరు తరహాలో నాలాల్లో సెన్సార్లను అమర్చాలని నిర్ణయించాం. సెన్సార్లతో నాలాల్లోని నీటి మట్టాలను తెలపడంతోపాటు ప్రజలను అలర్ట్ చేయడానికి అవకాశముంది.

ఆఫీసులెక్కడ, అధికారులు, సిబ్బంది ఎంత మంది ఉన్నారు?

హైడ్రా హెడ్ ఆఫీసు బేగంపేట్ లోని ఫైగా ప్యాలెస్ ను ప్రభుత్వం కేటాయించింది. రిపేర్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ రీజినల్ ఆఫీసు బుద్దభవన్, సైబరాబాద్ రీజినల్ ఆఫీసు నానక్ రాంగూడలోని హెచ్జీసీఎల్ కార్యాలయం, రాచకొండకు సంబంధించిన ఆఫీసును తార్నాకలోని పాత హెచ్ఎండీఏ కార్యాలయంలో ఏర్పాటు చేస్తాం. 500 మంది ప్రభుత్వ ఉద్యోగులతోపాటు 2వేల మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉంటారు. కొంత మందిని నియమించుకునే ప్రక్రియ కొనసాగుతోంది.

హైడ్రాకు ఆయా శాఖల సహకారం ఎలా ఉంది?

జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఇరిగేషన్, రెవెన్యూ, పురపాలక శాఖలు హైడ్రాకు అన్ని రకాలుగా సహకరిస్తున్నాయి. ముఖ్యంగా ఓఆర్ఆర్ పరిధిలోని 27 మున్సిపాలిటీల్లో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఆక్రమణలే కాకుండా అక్రమ నిర్మాణాలను సైతం కూల్చేసే అధికారం హైడ్రాకు ఉంది. ఆ ప్రాంతాల్లో అడ్వర్ టైజ్ మెంట్ ఆదాయం పెంచడం, ఫైన్ ఎన్ఓసీ ఇచ్చే అంశాలు హైడ్రా పరిధిలోనే ఉన్నాయి.

నిర్మాణ వ్యర్థాలను తొలగించే బాధ్యత ఎవరిది?

ఆక్రమణలను కూల్చిన తర్వాత వ్యర్థాలను స‌ద‌రు బిల్డ‌రే తొల‌గించాలి. లేని ప‌క్షంలో వారిపై హైడ్రా చ‌ర్య‌లు తీసుకుంటుంది. ఇప్ప‌టికే ప‌లువురికి నోటీసులు కూడా ఇచ్చింది. అయితే కొంత‌మంది నిర్మాణ వ్య‌ర్థాల‌ను తొల‌గిస్తుండ‌గా.. మ‌రి కొంద‌రు అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. మ‌రి కొంత‌మంది అక్క‌డ ఉన్న విలువైన ఇనుప చువ్వ‌లు, ఇత‌ర సామ‌గ్రిని తీసుకుని వ్య‌ర్థాల‌ను వ‌దిలేస్తున్నారు. అక్క‌డ పూర్వ స్థితికి భూమిని తీసుకురావాల్సిన బాధ్య‌త బిల్డ‌ర్ల‌పైనే ఉంది. చెరువుల‌కు పున‌రుజ్జీవ‌నం క‌ల్పించే క్ర‌మంలో హైడ్రానే చొర‌వ‌చూపి.. అక్క‌డ నిర్మాణ వ్య‌ర్థాల‌ను తొల‌గిస్తోంది. ఇందుకు అయ్యే ఖ‌ర్చును నిర్మాణ‌దారుడి నుంచి వ‌సూలు చేస్తుంది. ఎర్ర‌కుంట చెరువులో నిర్మించిన భ‌వ‌నాల వ్య‌ర్థాల‌ను తొల‌గించాల‌ని స‌ద‌రు నిర్మాణ‌దారుడు సుధాక‌ర్ రెడ్డికి హైడ్రా నోటీసులు జారీ చేసింది. అయితే విలువైన వ‌స్తువుల‌ను తీసుకెళ్లి.. భ‌వ‌న వ్య‌ర్థాల‌ను అక్క‌డే వ‌దిలేశారు. ఆయనపై చర్యలు తీసుకుంటాం.

100 రోజుల్లో సాధించిన ఫలితాలు?

హైడ్రా 19 జూలై 2024న జీఓ నెం.99 ద్వారా ఏర్పడింది. నేటితో 100 రోజులు పూర్తిచేసుకుంది. ఈ 100 రోజుల్లో చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ఆక్రమించి నిర్మించిన భవనాలు, ప్లాట్లను కొనుగోలు చేయకూడదని అవగాహన పెరిగింది. డాక్యుమెంట్లు లీగల్ ఉన్నాయా? లేదా? వాటర్ బాడీ ఉందా? లేదా? అనే అంశాలను చెక్ చేసుకుంటున్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు, ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదని అధికారుల్లో బాధ్యత పెరిగింది. ప్రభుత్వ స్థలాలు, పార్కులు, నాలాలు, రోడ్లు, ఇతర స్థలాలను కబ్జా చేయాలంటేనే కబ్జాదారులు దడుసుకుంటున్నారు. ఇంతకుముందు ఇలాంటివి లేవు. కానీ హైడ్రా కారణంగా వచ్చాయి.

భవిష్యత్ ప్రణాళిక ఏంటి?

ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోని ఆక్రమణలను కూల్చడమే కాదు. చెరువులను పునరుజ్జీవనం చేయడమూ హైడ్రా బాధ్యతనే. ప్రగతి నగర్ లోని ఎర్రకుంట చెరువు, కూకట్ పల్లిలోని నల్ల చెరువు, రాజేంద్రనగర్ లోని అప్పా చెరువు, మాదాపూర్ లోని సున్నం చెరువుల్లో కూల్చవేతలకు సంబంధించిన మట్టి కుప్పలను తొలగించే పనులు జరుగుతున్నాయి. దీపావళి తర్వాత బెంగళూరు వెళ్లి అక్కడ చెరువుల పునరుజ్జీవనం చేసిన తీరు, ఆనంద్ మల్లగవాడే చేసిన కృషిని పరిశీలిస్తాం. చెరువుల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతోపాటు సీసీ కెమెరాలను సైతం అమర్చనున్నాం. సీఎస్ఆర్ కింద నిర్మాణ సంస్థలకు కాకుండా ఫార్మా, ఐటీ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే చెరువులను దత్తతకు ఇవ్వాలి.


Similar News