TG Govt.: అన్నదాతల్లో ఆనందం.. ఖాతాల్లో సన్న వడ్ల బోనస్ రూ.756 కోట్లు జమ
సన్న వడ్లకు బోనస్ ప్రభుత్వానికి, రైతులకు మేలు చేసేదిగా నిలిచింది.
దిశ, తెలంగాణ బ్యూరో: సన్న వడ్లకు బోనస్ ప్రభుత్వానికి, రైతులకు మేలు చేసేదిగా నిలిచింది. మిగిలిన అన్ని పథకాల కంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉహించిన దాని కంటే ఎక్కువగా రైతుల నుంచి పాజిటివ్ అభిప్రాయం వచ్చిన పథకంగా రూ.500 బోనస్ పథకం నిలిచింది. పంట పండించిన రైతులకు నేరుగా మేలు చేసే విధంగా ఉన్న ఈ పథకం నిజమైన రైతులకు లబ్ధి చేకూరిందని వారు ఖుషిలో ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 8313 కొనుగోలు కేంద్రాల ద్వారా దొడ్డు రకం వడ్లు 26.86 లక్షల మెట్రిక్ టన్నులు, సన్న రకం వడ్లు 15.12 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. మొత్తంగా 41.98లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు రైతుల నుంచి రూ.9738కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన దాంట్లో 41.50 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. సన్న రకం వడ్లు 15.12 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిన ప్రభుత్వం రైతులకు రూ.500 బోనస్ కింద రూ.756 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది.
సన్న వడ్లు అత్యధికం ఇందూరులో..
సన్న వడ్లను రూ.500 బోనస్ తో కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం నిజామాబాద్ జిల్లా నుంచి అత్యధికంగా సేకరించింది. ఈ ఒక్క జిల్లాలోనే 3,16,723 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. నిజామాబాద్ జిల్లాకు దరిదాపుల్లో కూడా ఏ జిల్లా లేదు. ఆ తరువాత పెద్దపల్లి జిల్లాలో 1,86,359 మెట్రిక్ టన్నులు, ఖమ్మం జిల్లాలో 1,35,253 మెట్రిక్టన్నులు, కామారెడ్డి జిల్లాలో 98,555 మెట్రిక్ టన్నులు, కరీంనగర్ లో 71,356 మెట్రిక్ టన్నులు, వరంగల్ లో 66,056 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు.
మిల్లర్లలో మార్పు వచ్చేనా..?
రైస్మిల్లర్లపై అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వారిపై అనేక కేసులు నమోదు, విజిలెన్స్ దాడులు చేసినా వారిలో మార్పు రావడంలేదు. వానాకాలానికి సంబంధించి ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు తరలించగా, అక్రమాల్లో అరితేరిన కొందరు మిల్లర్లు 80 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లుగా సివిల్ సప్లయ్ అధికారులు గుర్తించారు. రైస్ మిల్లర్ల వద్దకు చేరిన ధాన్యం నిలువలపై ఎన్ ఫోర్స్మెంట్ వింగ్ ద్వారా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లర్లకు తరలించిన ధాన్యాన్ని మిల్లర్లు బయట విక్రయించినట్లు గుర్తించారు. మిల్లర్ల బుద్ది తెలిసిన అధికారులు ఎన్ ఫోర్స్ మెంట్ ద్వారా నిఘా పెట్టారు. తనిఖీలు చేశారు. 80మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పక్కదారి పట్టించారని గుర్తించారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఇప్పటికే డిఫాల్టర్లుగా ముద్రపడిన వారిని దూరం పెట్టారు. వీటన్నంటి నేపథ్యంలో ప్రభుత్వ హెచ్చరికలతో ఈ సారి ధాన్యం దారి మల్లింపు ఉండదని రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తో పాటు ఆయా జిల్లాల అసోసియేషన్లు ప్రభుత్వానికి మాట ఇచ్చాయి.
సన్న వడ్లు వివరాలు.
కొనుగోలు చేసిన సన్న వడ్లు - 15.12 లక్షల మెట్రిక్టన్నులు
అమ్మిన రైతుల సంఖ్య - 2,67,438
రూ.500 బోనస్ ధాన్యం విలువ - రూ.756 కోట్లు