TG Govt.: కొత్త టీచర్లకు జీతాలు నిల్..! రెండు నెలలుగా పెండింగ్‌లోనే
రాష్ట్రంలో డీఎస్సీ 2024లో కొత్తగా నియామకమైన టీచర్లలో దాదాపు సగం మందికి వేతనాలు అందలేదని తెలుస్తోంది.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో డీఎస్సీ 2024లో కొత్తగా నియామకమైన టీచర్లలో దాదాపు సగం మందికి వేతనాలు అందలేదని తెలుస్తోంది. ఆయా జిల్లాల్లో పలువురికి వేతనాలు అందినా కొన్ని జిల్లాల్లో మాత్రం వేతనాలు ఇంకా అందలేదని చెబుతున్నారు. రెండు నెలలుగా పెండింగ్ లోనే ఉన్నట్లుగా సమాచారం. జాయినింగ్ తేదీపై తలెత్తిన సందిగ్ధం వల్ల ఆయా జిల్లాల్లో వేతనాల చెల్లింపులు ఆలస్యానికి కారణమైనట్లు తెలుస్తోంది. అలాగే జనగణన సర్వే సైతం కారణంగా చెబుతున్నారు. వాటితో పాటు ఆయా జిల్లాల్లో ఉద్యోగులకు పర్మినెంట్ అకౌంట్ నంబర్ ఇవ్వడంలోనూ ఆలస్యమవ్వడం వల్ల డిలే అయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఆయా జిల్లాల్లో మాత్రం జాయినింగ్ తేదీపై స్పష్టత వచ్చి ఎస్టీవోలకు బిల్లులు పెట్టుకున్నా వేతనాలు చెల్లింపులో జాప్యం జరుగుతోందని టీచర్లు చెబుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదీన ఎల్బీ స్టేడియం వేదికగా 10 వేలకు పైగా టీచర్లకు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఆపై వారం రోజుల పాటు ఆయా జిల్లాల్లో కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్స్ ఇచ్చారు. నియామక పత్రాలు అందించిన సమయంలో ఆరోజు నుంచే వారికి వేతనాలు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ సైతం అక్టోబర్ 10 నుంచి వేతనాలు అందిస్తామని ఉత్తర్వులు సైతం జారీ చేసింది. అయితే.. విధులు నిర్వర్తించని తేదీల్లో వేతనాలు ఎలా ఇస్తారంటూ ఆర్థిక శాఖ కొర్రీలు పెట్టడంతో పరిస్థితి డైలమాలో పడింది. 10వ తేదీ నుంచి వేతనాలు చెల్లించాలని తీసుకున్న నిర్ణయాన్ని ఆర్థికశాఖ ఏమాత్రం ఒప్పుకోలేదని తెలుస్తోంది. అందరికీ 16వ తేదీ నుంచి చెల్లిస్తామని స్పష్టంచేసింది.
ఇదిలా ఉండగా జూన్‌లో చేపట్టిన బదిలీల్లో కొంతమంది టీచర్లు బదిలీ అయ్యారు. కొన్ని పాఠశాలల్లో సింగిల్ టీచర్ ఉన్న కారణంగా వారిని రిలీవ్ చేయకుండా ఆలాగే కొనసాగించారు. కొత్త టీచర్లు చేరిన తర్వాత వారిని రిలీవ్ చేశారు. అయితే కొత్త వారికి అపాయింట్‌మెంట్ ఆర్డర్ అందుకున్న కాలానికి జాయినింగ్ రిపోర్టు ఇచ్చే నాటికి వారం రోజుల వ్యవధి ఏర్పడింది. ఈ వ్యవధిలో కొత్త టీచర్లకు వేతనాలు ఇస్తే ఈనెల 10వ తేదీ నుంచి రిలీవ్ అయ్యే మధ్యకాలానికి ఒకే పోస్టుకు ఇద్దరు టీచర్లకు వేతనాలు అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే 16 నుంచే ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే వేతనాలు అందుకోని పలువురు టీచర్లు వేతనాలు ఇంకెప్పుడు రిలీజ్ అవుతాయాని ఎదురుచూస్తున్నారు. డోలాయమానంలో వేతనాల చెల్లింపులు ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇన్నాళ్లు ఉద్యోగం లేదని ఇబ్బందులు పడిన వారు.. కొలువుల్లో చేరాక వేతనాల కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఇష్యూకు సర్కార్ ఎప్పుడు చెక్ పెడుతుందనేది చూడాలి.