మరో నాలుగు ఏరియాల్లో చెత్త డంపింగ్‌.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

మరో నాలుగు ఏరియాల్లో చెత్త డంపింగ్‌‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..

Update: 2025-01-03 02:46 GMT

దిశ, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో చెత్తను మేడ్చల్ జిల్లా జవహార్‌నగర్ డంపింగ్ యార్డులో డంప్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) పరిధిలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలకు చెందిన చెత్తను సైతం ఇక్కడే డంప్ చేస్తున్నారు. అయితే రోజురోజుకు చెత్త ఉత్పత్తి పెరుగుతుండడంతో డంప్ చేయడానికి జవహార్‌నగర్ డంపింగ్ యార్డులో స్థలం లేకుండాపోయింది. దీంతోపాటు ఈ డంపింగ్ యార్డుపై భారం తగ్గించడానికి నగరానికి నలుదిక్కులా మరో నాలుగు డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది.

338 ఎకరాల్లో.. 8,500 టన్నులు..

జవహార్‌నగర్ డంపింగ్ యార్డుకు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 339 ఎకరాల స్థలాన్ని కేటాయించి, హైదరాబాద్ నగరంలో నిత్యం వెలువడుతన్న వ్యర్థాలను అక్కడికి తరలించింది. ఇంటింటి నుంచి సేకరించిన చెత్తను సెకండరీ కలెక్షన్‌, ట్రాన్స్‌ఫర్‌ పాయింట్స్‌ (ఎస్‌సీటీపీ) నుంచి వ్యర్థాలను జవహర్‌నగర్‌ డంప్‌ యార్డుకు తరలిస్తున్నారు. 2007 నుంచి 2012 వరకు సరైన నిర్వహణ లేకపోవడంతో దాదాపు 125 ఎకరాల్లో చెత్త పేరుకుపోయింది. దీని నిర్వహణ కోసం 2009లో రాంకీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న పలు కారణాలతో 2012 వరకు అమలులోకి రాలేదు. ఆ తరువాత 2012 నుంచి వ్యర్థాల నిర్వహణ మొదలైంది. 2014లో 3,500 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అయితే నేడు 7,500 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. గతంలో ఒక వ్యక్తి 350 గ్రాముల చెత్త ఉత్పత్తి చేస్తే ప్రస్తుతం 750 గ్రాములకు పెరిగింది. చెత్త డంప్ చేయడానికి జవహార్ నగర్ యార్డుపై భారం తగ్గించడానికి అధికారులు ప్రత్యామ్నాయ ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ప్రతి రోజు జీహెచ్ఎంసీతో పాటు శివారు ప్రాంతాల మున్సిపాలిటీల నుంచి వచ్చే చెత్త కలిపి మొత్తం 8,500 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. దీనిలో 3,825 టన్నుల(45శాతం) తడిచెత్త వస్తుంది. దీంతో కంపోస్టు తయారు చేస్తున్నారు. 4,675 టన్నులు (55శాతం) డ్రై వేస్ట్ వస్తుంది. దీన్ని ఆర్డీఎఫ్‌గా కన్వర్ట్ చేస్తున్నారు. దీన్ని సిమెంట్ కంపెనీలు అయిల్‌గా వాడుకుంటున్నారు. దీంతోపాటు విద్యుత్ ఉత్పత్తి కూడా చేస్తున్నారు. ప్రతి 2,500 టన్నుల ఆర్డీఎఫ్ ఉత్పత్తి అవుతుంది. 1,250 టన్నుల ఆర్డీఎఫ్‌తో 24 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. మరో ప్లాంట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

ప్యార నగర్‌కు గ్రీన్ సిగ్నల్..

జవహార్‌నగర్ డంపింగ్ యార్డుపై భారం తగ్గించడానికి మరో నాలుగు డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. అందులో భాగంగానే సంగారెడ్డి జిల్లా లక్డారంలో 100 ఎకరాలు, ప్యార నగర్‌లో 125 ఎకరాలు, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని చౌటుప్పల్ మండలంలోని మల్కాపురంలో 200 ఎకరాలు, మేడ్చల్ జిల్లాల్లోని దుండిగల్‌లో 85 ఎకరాలను అధికారులు గుర్తించారు. గతంలో రంగారెడ్డి జిల్లా కేశంపేట్‌లోనూ 150 ఎకరాల స్థలాన్ని అధికారులు పరిశీలించారు. అయితే ఏ ప్రాంతంలో డంపింగ్ యార్డులు ఏర్పాటు చేద్దామని అధికారులు ప్రయత్నించిన స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అయితే ప్యార నగర్‌లో మాత్రం కలెక్టర్ అంగీకరించినట్టు తెలిసింది. దీంతోపాటు అటవీశాఖ క్లియరెన్స్ కూడా వచ్చింది. కానీ అక్కడ సైతం ప్రజలు, రాజకీయ నాయకుల నుంచి వ్యతిరేకత ఉంది. ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి సీరియస్‌గానే తీసుకున్నారు. ప్యారనగర్ డంపింగ్ యార్డు గురించి స్వయంగా వెళ్లి ఆ జిల్లా కలెక్టర్‌ను కలిసి సమస్యను వివరించినట్టు తెలిసింది. మిగిలిన ప్రాంతాలపై కమిషనర్ దృష్టిసారించినట్టు తెలిసింది.

దుండిగల్‌లో విద్యుత్ ప్లాంట్..

దుండిగల్‌లో 85 ఎకరాల్లో 14.5 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను మాత్రమే నిర్వహిస్తున్నారు. అక్కడ చెత్తను డంప్ చేయడానికి స్థానికులు అంగీకరించడంలేదు. ఇక్కడ జవహార్‌నగర్ లాగా కాకుండా మాడ్రన్ టెక్నాలజీతో డంపింగ్ యార్డును ఏర్పాటు చేయడానికి జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తోంది. చెత్తను ఎప్పటికప్పుడు ప్రాసెసింగ్ చేయడంతో పాటు ఆర్డీఎఫ్‌ను విద్యుత్ తయారీ కోసం వినియోగించాలని నిర్ణయించారు. అయితే జీహెచ్ఎంసీ పరిధిలో రోజుకు 7,400 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. అయితే తడి, పొడి, ప్లాస్టిక్, పలురకాలు వేరు చేసిన తర్వాత 3,500 టన్నుల ఆర్డీఎఫ్‌ను తయారు చేయనున్నారు. దీని ద్వారా జవహార్‌నగర్ డంపింగ్ యార్డు ఆవరణంలో 1,250 టన్నులతో ఆర్ఢీఎఫ్ ఉపయోగించి 24 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. దుండిగల్‌లోనూ 850 టన్నుల ఆర్ఢీఎఫ్‌తో 14.5 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. దీంతోపాటు జవహార్‌నగర్‌లో మరో 1,250 టన్నులు ఆర్డీఎఫ్‌తో 24మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ప్లాంట్ సిద్ధమవుతోంది. మార్చి 2025లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కానుందని అధికారులు చెబుతున్నారు.


Similar News