TG Govt.: ప్లాట్లకు ‘పెట్టుబడి సాయం’ కట్! ‘రైతు భరోసా’పై సర్కార్ నిర్ణయం

సాగు భూములకే రైతుభరోసా ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Update: 2025-01-08 01:34 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సాగు భూములకే రైతుభరోసా ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగా కసరత్తు సైతం చేస్తున్నది. ఈ నిర్ణయంతో హైదరాబాద్ శివారుతోపాటు రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది ప్లాట్ల యజమానులకు ఊరట దక్కనుంది. బీఆర్ఎస్ హయాంలో నాలుగు దశాబ్దాల క్రితమే ప్లాట్లు చేసి అమ్మేసిన భూములకు ధరణి పోర్టల్/ఆర్వోఆర్-2020 పుణ్యాన పాసుబుక్కులు వచ్చాయి. దాని ద్వారా రైతుబంధు కూడా ఖాతాల్లో జమ అవుతున్నది. దీంతో ఆ భూములను అమ్మేసిన యజమానుల వారసులు యజమానులు మళ్లీ హక్కుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో తామే ఉన్నామంటూ ప్లాట్ల యజమానులపై దాడులకు కూడా వెనుకడుగు వేయడం లేదు. ఇలా అనేక వివాదాలు ఉత్పన్నం కాగా, ప్రభుత్వ నిర్ణయంతో వీటికీ పరిష్కారం లభించే అవకాశముంది. కాగా, వ్యవసాయేతర భూములకు కూడా పెట్టుబడి సాయం పొందిన విస్తీర్ణం రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి, వికారాబాద్, నల్లగొండ, సిద్ధిపేట, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో 8 లక్షల ఎకరాలకు పైగానే ఉంటుంది. ఈ విషయాన్ని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కూడా గతంలో ధ్రువీకరించారు.

ప్లాట్లుగా చేసిన పట్టా భూములుగానే..

గ్రామ పంచాయతీ అనుమతులతో వేలాది ఎకరాలను లే అవుట్లుగా మార్చారు. నగర శివారు కావడంతో పెట్టుబడి రూపంలో లక్షలాది మంది ఆ ప్లాట్లను కొనుగోలు చేశారు. వాళ్ల దగ్గర సేల్ డీడ్లు, లే అవుట్ కాపీలు ఉన్నాయి. కొన్ని ప్లాట్లు పది మంది వరకు చేతులు మారాయి. అయితే చాలా వరకు లేఅవుట్లకు సంబంధించి భూ రికార్డులను మార్చలేదు. నేటికీ పట్టాభూములుగా, పట్టాదారుడి పేరుతోనే ఉన్నాయి. 2017లో భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత వీటిని ప్లాట్లుగా మార్చకుండా వేలాది కొత్త పాసు పుస్తకాలు జారీ చేశారు. దాంతో చాలా మంది రైతుబంధు స్కీమ్ ద్వారా రూ.లక్షలు పొందారు. ఇందులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కీలక నాయకులు ఉన్నారు. నాలా కన్వర్షన్ ఫీజు చెల్లించలేదనే ఒకే ఒక్క కారణంతో వ్యవసాయ భూములుగా రాస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నాలా కన్వర్షన్ చేసిన భూములకు కూడా పాసు పుస్తకాలు జారీ చేశారు. ‘ధరణి’లో నేచర్ ఆఫ్ ల్యాండ్ కాలమ్ ను క్షేత్ర స్థాయిలో పరిశీలించకుండానే నమోదు చేసిన కారణంగా లక్షలాది సేల్ డీడ్లకు విలువ లేకుండా పోయింది. ప్లాట్లు, సాగు భూముల లావాదేవీలన్నీ ఒక్క చోట ఉన్నప్పుడే ఇలాంటి అక్రమాలు అనేకం చోటు చేసుకున్నాయి. మరిప్పుడు వేర్వేరుగా చేపట్టే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ద్వారా ఈ దందా యథేచ్ఛగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈసీల్లో దేని లెక్క దానికే..

ఒకటే భూమిని అగ్రికల్చర్ ల్యాండ్ గా, ప్లాట్లుగా ఏకకాలంగా సమాంతరంగా రిజిస్ట్రేషన్లు చేశారు. ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్లలో ప్లాట్లుగా రిజిస్ట్రేషన్లు చేసినట్లుగా రికార్డులు కనిపిస్తుంటాయి. కానీ వాటినే సాగుభూములుగా మరోసారి రిజిస్ట్రేషన్‌ చేయడానికి ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. పాసు పుస్తకాల ఆధారంగా సాగుభూముల, సేల్‌డీడ్‌/లింక్‌ డాక్యుమెంట్ల ఆధారంగా ప్లాట్ల రిజిస్ట్రేషన్లు కొనసాగించారు. కండ్ల ముందే లేఅవుట్లు కనిపిస్తున్నా రెవెన్యూ అధికారులు మాత్రం పహాణీ రికార్డుల్లో దశాబ్దాలుగా సాగు భూములుగానే కొనసాగిస్తున్నారు. వ్యవసాయ భూమి నుంచి పంచాయతీ లేఅవుట్లు, ప్లాట్లు, ఆ తర్వాత మళ్లీ అగ్రికల్చర్ ల్యాండ్ గా రిజిస్ట్రేషన్, మళ్లీ ఇప్పుడు అదే భూమిలో హెచ్‌ఎండీఏ అనుమతితో లేఅవుట్‌ పర్మిషన్ పొందిన ఉదంతాలు ఉన్నాయి. తహశీల్దార్లు, ఆర్డీవోలు, సబ్ రిజిస్ట్రార్లు ఒక్కసారి రికార్డులను పరిశీలిస్తే ప్లాట్లుగా మారిన భూముల లెక్కలు తేల్చడం పెద్ద పనేం కాదని న్యాయవాదులు అంటున్నారు.ః

కొనుగోలు చేసిన ముఠాలు

లే అవుట్లుగా మారినా.. పాస్ బుక్కులు జారీ అయిన భూములను కొనుగోలు చేసేందుకు ముఠాలు పని చేశాయి. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలంలో కొందరు నాయకులు ఇలాంటి దందాతోనే రూ.వందల కోట్లు సంపాదించారు. కొందరు నాయకులు, అధికారుల అండదండలతో పంచాయతీ లే అవుట్లుగా చేసి విక్రయించిన భూములను సాగు భూములుగా పెద్దోళ్లకు విక్రయిస్తూ సొమ్ము చేసుకున్నారు. కాలేజీలకు, కంపెనీలకు అమ్మేస్తున్నారు. సదరు సంస్థలు రూ.50 లక్షలు పలికే భూములు రూ.25 లక్షలకే వస్తుండడంతో ఎలాంటి విచారణ లేకుండానే కొనుగోలు చేస్తున్నాయి. అవే భూములను బ్యాంకుల్లో మార్టిగేజ్ చేసి రూ.కోట్లల్లో రుణాలు తీసుకున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో ఇలా బ్యాంకుల్లో రూ.వేల కోట్లు రుణంగా తీసుకున్నట్లు సమాచారం. పాసు పుస్తకాల ఆధారంగా బ్యాంకు అధికారులు ఎలాంటి షరతుల్లేకుండా రుణాలిచ్చినట్లు తెలిసింది. భూములు, ప్లాట్లు కొనుగోలు చేసినవారు రెవెన్యూ, మున్సిపల్‌, గ్రామ పంచాయతీల్లో మ్యుటేషన్‌ చేయించుకోని ఫలితంగా మొదటి వ్యక్తులే హక్కుదారులుగా ఉంటున్నారు. ఉద్దేశ్యపూర్వకంగా, ప్రలోభాలకు గురి చేస్తుండడంతో వారే తిరిగి అమ్మేందుకు ముందుకొస్తున్నట్లు ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి అభిప్రాయపడ్డారు. యాదాద్రి, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో దశాబ్దాల క్రితం లేఅవుట్లు చేసిన భూములను మళ్లీ వ్యవసాయ భూములుగా కొనుగోలు చేసిన వారి జాబితాలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి అనుచరులు ఉన్నారని తెలిసింది. కొందరు ప్రజాప్రతినిధులు 10 నుంచి 20 ఎకరాలకు వరకు కొనుగోలు చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు వాటి చుట్టూ బౌండరీలు ఏర్పాటయ్యాయి.

ఎన్నెన్ని కథలో..

* రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నం మండలం మంగళపల్లి, సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరులో వందలాది ఎకరాలకు రైతుబంధు ఇస్తున్నారు. అక్కడ ఏనాడో ప్లాట్లు చేసి అమ్మేశారు.

* యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం నెమరుగోముల సర్వే నం.154, 155, 157లలోని 16 ఎకరాల్లో 1989 లోనే శ్రీసాయిబాబా నగర్ పేరుతో ప్లాట్లుగా అమ్మేశారు. దానిపై కన్నేసిన కొందరు వ్యవసాయ భూములుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

* రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం బుల్కాపూర్ సర్వే నం.71, 72, 73, 74, 75, 76 ల్లో ప్లాట్లు చేశారు. 1986లోనే గ్రామ పంచాయతీ లేఅవుట్లు చేసి వందలాది మందికి అమ్మేశారు. అప్పట్లో భానూర్ లో బీడీఎల్ ఫ్యాక్టరీ వస్తుందని, ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రచారం చేశారు. వాళ్లంతా ఈ ప్రాంతంలోనే ఉండే అవకాశం ఉందంటూ ప్లాట్లు అమ్మేశారు. ఎంతో మంది ఆశ పడి కొనుగోలు చేశారు. కొందరైతే పదుల సంఖ్యలో ప్లాట్లు కొనేశారు. ఉద్యోగులు, అధికారులు సైతం ఆ ప్లాట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. తెనాలి, గుంటూరు, విజయవాడకు చెందిన వారు కూడా ప్లాట్ల కొనుగోలుదార్లలో అధికంగా ఉన్నారు. అయితే ఈ వెంచర్లను పట్టాదారులు సంయుక్తంగా కాకుండా విడివిడిగా చేశారు. ఎవరి ల్యాండ్ లో వారి ప్లాట్లకు 1 నుంచి నంబర్లు వేసి అమ్మేశారు. దాంతో ఒకటే వెంచర్ కాకుండా వేర్వేరుగా రికార్డుల్లో దర్శనమిస్తున్నాయి. లే అవుట్ కామన్ గా ఉన్నప్పటికీ నంబర్లు మాత్రం విడివిడిగా చేసి క్రయ విక్రయాలు నడిపారు. ఇదంతా జీవో 111 అమల్లోకి రాకముందే చోటు చేసుకోవడం గమనార్హం.

నోటీసులు ఇచ్చి..

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం పోచారం గ్రామ రెవెన్యూ పరిధిలో మోత్కుపల్లి యాదగిరి రెడ్డి సర్వే నెంబర్ 38, 39, 40 లో అమ్మేసిన 33 ఎకరాల భూమికి పట్టాదారు పాసు పుస్తకం తీసుకున్నారు. గడిచిన ఐదేండ్లుగా రైతుబంధు ద్వారా రూ.20 లక్షలు తీసుకున్నారు. ఈ విషయాన్ని ధరణి భూ సమస్యల వేదిక కన్వీనర్, సామాజిక కార్యకర్త మన్నె నర్సింహారెడ్డి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నాన్ అగ్రికల్చర్ గా మారిన ల్యాండ్ కి సంబంధించిన అమౌంట్ రూ.16.80 లక్షలను రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వసూలుకు తహశీల్దార్ నోటీసులు జారీ చేస్తే.. ఆ ఆర్డర్ ని నిలిపివేశారు.

చర్యలేవి?

హ్యామీ హోమ్ కన్ స్ట్రక్షన్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీ మేడ్చల్ మండలం రావల్ కోల్, షాజాదిగూడ, సోమారం గ్రామాల్లో నేచర్ 1, నేచర్ 2, అర్బన్ టౌన్ పేరిట వెంచర్లు చేసి అమ్మేసింది. ఇదంతా 24 ఏండ్ల క్రితమే జరిగింది. అందరూ సేల్ డీడ్స్ ద్వారానే ప్లాట్లు కొనుగోలు చేశారు. కానీ ధరణి పోర్టల్ లో రైతుల పేర్లు రావడంతో తిరిగి కొత్త పాసు బుక్స్ పొందారు. వీటిని రద్దు చేయాలంటూ 2020 నుంచి తహశీల్దార్, ఆర్డీవో, కలెక్టర్, సీసీఎల్ఏకు హ్యాపీ హోమ్స్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నోసార్లు మొర పెట్టుకున్నది. అయితే మేడ్చల్ కలెక్టర్ గా ఎస్.హరీశ్ పని చేసిన కాలంలోనే దీన్ని గుర్తించారు. ఆయన లేఖ నం.డి1/2125/2021, తేదీ.27.11.2021 ద్వారా అక్రమాలను గుర్తించారు. ఇల్లీగల్ గా ఆక్రమించుకోవడంతో పాటు రైతుబంధు క్లెయిమ్ చేస్తున్నారని సీసీఎల్ఏకు లేఖ ద్వారా వివరించారు. రావల్ కోల్ లో సర్వే నం.196, 195, 177, 174, 179, 192, 175, 194లో 12.25 ఎకరాలు, షాజాదిగూడలో సర్వే నం.76, 77, 72, 70, 71, 73లో 11.29 ఎకరాలు, సోమారంలో సర్వే నం.65, 62, 63, 86, 72, 81 ల్లో 12.34 ఎకరాల్లో నాలా కన్వర్షన్ చేయకుండా లే అవుట్ చేసి అమ్మేసినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలను లేఖలో ప్రస్తావించారు. ఇప్పటి వరకు ప్లాట్ల యజమానులకు న్యాయం జరగలేదు. ఇల్లీగల్ గా రైతుబంధు తీసుకున్న వారిపైనా చర్యలు తీసుకోలేదు.

అధికారుల నుంచి వసూలు చేయాలి: గుమ్మి‌రాజ్ కుమార్ రెడ్డి, న్యాయవాది

భూసేకరణ చేసిన భూములకు, నాలా మార్పిడి చేసిన భూములకు రైతు భరోసా ఇస్తే, ఆ డబ్బును తహశీల్దార్లు, ఆర్డీవోల నుంచి వసూలు చేయాలి. ఎందుకంటే ఒకవైపు ప్రొసీడింగ్ ఇచ్చి రెవెన్యూ రికార్డులు మార్చక పోవడం ఇలా జరుగుతున్నది. రైతుబంధు అక్రమంగా పొందిన వారిపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించే అవకాశం ఉంది. అదే కార్యరూపం దాల్చితే రూ.వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకి చేరుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వెంచర్లకు, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కి పెట్టుబడి సాయం ఇవ్వొద్దని నిర్ణయం తీసుకున్నది. వ్యవసాయం చేస్తున్న వారికే సాయం అందించాలని రైతాంగం కూడా కోరుతున్నది. గత ఐదేండ్లుగా వేలాది మంది అక్రమార్కులు రైతుబంధు కింద రూ.లక్షలు పొందారు. ఆ సొమ్మును తిరిగి వసూలు చేయడంలో తప్పేం లేదు.

Tags:    

Similar News