TG Budget-2024 : బడ్జెట్‌లో హైదరాబాద్‌కు టాప్ ప్రియారిటీ

నూతన ఆర్థిక సంవత్సరం (2024-25)కు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మహానగరానికి టాప్ ప్రియారిటీ ఇచ్చింది.

Update: 2024-07-25 09:29 GMT

దిశ, సిటీ బ్యూరో: నూతన ఆర్థిక సంవత్సరం( 2024-25)కు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మహానగరానికి టాప్ ప్రియారిటీ ఇచ్చింది. మహానగరంలోని కోటిన్నర మంది జనాభాకు అత్యవసరమైన, అతి ముఖ్యమైన సేవలందించే జీహెచ్ఎంసీకి గతంలో ఎన్నడూ లేని విధంగా నిధులు కేటాయించటంతో పాటు సిటీలో జనజీవనాన్ని ప్రభావితం చేసే వివిధ విభాగాలన్నింటికీ కలిపి సర్కారు ఏకంగా రూ. 22 వేల 800 కోట్లను కేటాయించటం పట్ల వివిధ శాఖలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సమైక్య, ప్రత్యేక పాలనలోనూ గతంలో ఎన్నడూ లేని విధంగా సర్కారు జీహెచ్ఎంసీకి బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యతనిస్తూ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీకి రూ.3065 కేటాయింపులు జరపటంతో బల్దియాకు కాస్త ఊరట కలిగింది. 

వర్తమాన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీహెచ్ఎంసీకి రూ. 5 వేల కోట్లను కేటాయించాలని జీహెచ్ఎంసీ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ది శాఖ ద్వారా ప్రతిపాదనలు పంపిన సంగతి తెల్సిందే. జీహెచ్ఎంసీ కోరిన రూ. 5 వేలకు చేరువగా రూ. 3065 కేటాయించటంతో పాటు హైదరాబాద్ మహానగరంలో ప్రత్యేకంగా మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు ఏకంగా రూ. 10 వేల కోట్లను కూడా కేటాయించటం జీహెచ్ఎంసీ చరిత్రలోనే ఫస్ట్ టైమ్‌గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కోటిన్నర మంది జనాభాకు అవసరమైన, అత్యవసరమైన సేవలందించే జీహెచ్ఎంసీ పరిధితో పాటు ఔటర్ వెలుపల ఉన్న ప్రాంతాలను, స్థానిక సంస్థలను కలుపుతూ ఇటీవలే ఏర్పాటైన హైడ్రాకు కూడా రూ. 100 కోట్ల నిధులు కేటాయించింది.

జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతులకు ప్రత్యేకంగా రూ.3050 కోట్లు, అదనంగా సిటీ అభివృద్దికి రూ.10 వేల కోట్లు, జలమండలికి రూ.3385 కోట్లు, హెచ్ఎండీఏకు రూ.500 కోట్లు, మెట్రో రైలు విస్తరణు (పాతబస్తీ)కి రూ.500 కోట్లు, ఏయిర్ పోర్టు మెట్రోరైలుకు రూ. 500 కోట్లు, జీహెచ్ఎంసీ పరిధితో పాటు ఔటర్ వెలుపలనున్న ప్రాంతాల్లో డిజాస్టర్ మేనేజ్ మెంట్, ఆస్తుల పరిరక్షణ కోసం ఇటీవలే ఏర్పాటు చేసిన హైదాకు రూ. 200 కోట్లు కేటాయించింది. ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని మూసీ ప్రక్షాళన, సుందరీకరణకు రాష్ట్ర బడ్జెట్ లో రూ. 1500 కోట్లు కేటాయించి సర్కారు చిత్తశుద్ధిని చాటుకుంది.

Tags:    

Similar News