TG Assembly : ఆధారాలు ఉంటే చూపాలి.. హరీష్ రావు సంచలన డిమాండ్
రాష్ట్రంలో దశ, దిశ లేని పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో దశ, దిశ లేని పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. శాసనసభలో బడ్జెట్ పద్దుపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చలో ఆయన శనివారం మాట్లాడారు. బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందన్నారు. రూ.4.5లక్షలు లేని జీఎస్‌డీపీని రూ.14లక్షలకు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకెళ్లిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన బాగాలేదని మాటలు చెబితే సరిపోతుందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ టార్గెట్ గానే బడ్జెట్ ప్రసంగం ఉందన్నారు. ప్రభుత్వం పచి అబద్ధాలు చెబుతోందని తెలిపారు.
బడ్జెట్‌లో వాస్తవాలను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన బాగాలేదని అంటున్నారని ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రూ.200 పింఛన్‌ను రూ. 2వేలకు పెంచామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ రూ.4వేల పింఛన్ నాలుక మీదనే ఉందన్నారు. పదేళ్ల పాలనలో ఉన్న సమాచారాన్ని తొలగించారని ఫైర్ అయ్యారు. 8 నెలల్లో ప్రభుత్వం ఏం సాధించిందో చెప్పాలని కోరారు. కరెంట్ ఎలా ఉందో ప్రజలను అడుగుదామని హరీష్ రావు అన్నారు. ట్యాక్స్ రెవెన్యూ ఎక్కువ వస్తుందని బడ్జెట్‌లో పెట్టారని తెలిపారు.విధానాల రూపకల్పన కంటే మమ్మల్ని తిట్టడంపైనే ఎక్కువ దృష్టి పెట్టారన్నారు. గతంలో కాంగ్రెస్ పాలనలో కరెంట్ పరిస్థితి గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని.. కేశవరావు ఇంటికి సీఎం పోతే కరెంట్ పోయిందని గుర్తు చేశారు.