TG Assembly: సర్పంచ్‌ల పెండింగ్ బిల్లులపై దద్దరిల్లిన అసెంబ్లీ.. బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) ఇవాళ ప్రారంభం అయ్యాయి.

Update: 2024-12-16 05:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) ఇవాళ ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం కాగానే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar) ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) సర్పంచ్‌ల పెండింగ్ బిల్లులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గడిచిన ఏడాది కాలంగా సర్పంచ్‌లకు చెల్లించాల్సిన రూ.691 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. నిధులు విడుదల చేయాలని కోరుతూ.. ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిస్తే సర్పంచ్‌లను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారని ఆరోపించారు. బడా కాంట్రాక్టర్లకు ప్రభుత్వం రూ.1200 కోట్ల బిల్లులు చెల్లించిన ప్రభుత్వం.. చిన్న కాంట్రాక్టర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు మాత్రం నయా పైసా అందలేదని అన్నారు.

పంచాయతీ ఎన్నికల‌లోపు పెండింగ్‌లో ఉన్న బిల్లులు వెంటనే క్లియర్ చేయాలని.. ఎప్పటిలోగా క్లియర్ చేస్తారో సర్కార్ సమాధానం చెప్పాలని హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. అనంతరం హరీశ్‌రావు అడిగిన ప్రశ్నకు మంత్రి సీతక్క (Minister Sithakka) సమాధానమిస్తూ.. పదేళ్ల బీఆర్ఎస్ (BRS) పాలన పంచాయతీ వ్యవస్థ పూర్తి నిర్వీర్యం అయిందని అన్నారు. 2014 నుంచే సర్పంచ్‌ల బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయని.. ఆ బిల్లులు గత ప్రభుత్వం ఎందుకు చెల్లించలేదో సమాధానం చెప్పాలన్నారు. ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న హరీశ్‌ రావుకు సర్పంచ్‌ల బిల్లుల గురించి తెలియదా అంటూ చురకలంటించారు. నేడు తమకేం తెలియదన్నట్లుగా బీఆర్ఎస్ ఈ విషయంపై మాట్లాడటం హస్యాస్పదంగా ఉందన్నారు. పల్లె ప్రగతి నిధులు విడుదల చేయకపోవడం వల్లే.. బిల్లులు పెండింగ్‌లో పడ్డాయని కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే సర్పంచ్‌ల పెండింగ్ బిల్లులపై మంత్రి సీతక్క సరైన సమాధానం చెప్పలేదంటూ బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు.    

Tags:    

Similar News