కొత్త వీసీలు ఎవరు? 10 వర్సిటీల్లో ముగిసిన వీసీల పదవీకాలం.. ఐఏఎస్ అధికారులకు ఇంచార్జ్ బాధ్యతలు!
తెలంగాణలోని పది ప్రభుత్వ యూనివర్సిటీల వీసీల పదవీకాలం ఇవాళ్టితో(మంగళవారం) ముగిసింది. కొత్త వీసీల నియామకానికి సమయం పట్టే అవకాశం ఉంది.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని పది ప్రభుత్వ యూనివర్సిటీల వీసీల పదవీకాలం ఇవాళ్టితో(మంగళవారం) ముగిసింది. కొత్త వీసీల నియామకానికి సమయం పట్టే అవకాశం ఉంది. అయితే, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2021 మే 22న పది వర్సిటీలకు వీసీలను నియమించారు. ఓయూ, కాకతీయ, జేఎన్‌టీయూ, శాతవాహన, మహాత్మాగాంధీ, తెలంగాణ, పాలమూరు, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, జవహర్ లాల్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీల వీసీల పదవి కాలం నేటితో ముగిసింది.
పదవీకాలం ముగిసేలోపే కొత్త వాళ్లను నియమించాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేసినప్పటికీ, ఎన్నికల కోడ్ కారణంగా ప్రక్రియ పూర్తి కాలేదు. అయితే, కొత్త వీసీలు ఎవరు? లేక పాత వారినే కొనసాగిస్తారా?ఇంచార్జీలకు బాధ్యతలు అప్పగిస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన పూర్తి అయింది. కాకతీయ వర్సిటీ మినహా మిగిలిన తొమ్మిది వర్సిటీలకు సెర్చ్ కమిటీలను కూడా ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.
సార్వత్రిక ఎన్నికల ఫలితాల విడుదల అనంతరం కొత్త వీసీల నియామకం చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. వీసీల స్థానంలో వేరే వారిని ఇన్ ఛార్జ్‌లు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే సీనియర్ ఐఏఎస్ అధికారులను ఇంచార్జీలుగా ప్రభుత్వం నియమించే ఆలోచనలో ఉన్నది. నియామకాల వరకు వారినే కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ సాయంత్రం ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారులను పది వర్సిటీలకు ఇంఛార్జీ వీసీలుగా బాధ్యతలు ఇవ్వనున్నట్లు సమాచారం.