TG SSC Exams: రేపటి నుంచి తెలంగాణలో టెన్త్ పరీక్షలు.. 5 నిమిషాలు గ్రేస్ పీరియడ్
తెలంగాణలో (Telangana) రేపటి (మార్చి 21) నుంచి పదవ తరగతి పరీక్షలు (SSC Exams) ప్రారంభం కానున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో (Telangana) రేపటి (మార్చి 21) నుంచి పదవ తరగతి పరీక్షలు (SSC Exams) ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ఇప్పటికే అధికారులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 11,547 పాఠశాలల నుంచి 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వారిలో అబ్బాయిలు 2,58,895 మంది, అమ్మాయిలు 2,50,508 మంది ఉన్నారు. ఈ మేరకు అధికారులు 2,650 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్(Hall Tickets) ను అధికారులు ఇప్పటికే విడుదల చేశారు.
ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడం కోసం ప్రభుత్వ పరీక్షల విభాగం కార్యాలయంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. విద్యార్థులకు ఏమైనా సందేహాలు, సమస్యలుంటే 040-23230942 నెంబర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. అలాగే, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. పరీక్ష జరిగే సమయంలో ఆ చుట్టు పక్కల జిరాక్స్ సెంటర్లు మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ట్రాఫిక్, ఇతర సమస్యలను దృష్టిలో ఉంచుకుని ముందుగానే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలని అధికారులు సూచించారు. అలాగే విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ పీరియెడ్ ఉంటుందని తెలిపారు.
స్మార్ట్ వాచ్, సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు కేంద్రంలోకి అనుమతి లేదు. ఒత్తిడికి లోనవకుండా విద్యార్థులకు పరీక్ష రాసేలా తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలన్నారు. ఇక గతంలో పదో తరగతి విద్యార్థులకు 11 పేపర్లు ఉండేవి. ఈ సంవత్సరం నుంచి ఏడు పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఫిజికల్స్ సైన్స్, బయోలజీ పేపర్లను వేర్వేరు రోజుల్లో నిర్వహించనున్నారు. ఈ రెండు పరీక్షలు ఒక్కో పేపర్ గంటన్నర వ్యవధిలో రాయాల్సి ఉంటుంది. ఇక సమాధానాలు రాసేందుకు క్యూఆర్ కోడ్‌తో ముద్రించిన 24 పేజీలతో సన్నని లైన్లతో కూడిన బుక్‌లెట్ ఇవ్వనున్నారు.
Read More..