కాంగ్రెస్‌కు నామినేటెడ్ పోస్టుల టెన్షన్

కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ప్రకటించిన నామినేటెడ్ పోస్టులపై టెన్షన్ నెలకొన్నది. ఈ ఏడాది మార్చి 16న 37 మందికి వివిధ శాఖల్లో చైర్మన్లుగా ప్రకటిస్తూ సీఎంవో వర్గాలు ఓ నోట్ రిలీజ్ చేశాయి.

Update: 2024-07-08 03:16 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ప్రకటించిన నామినేటెడ్ పోస్టులపై టెన్షన్ నెలకొన్నది. ఈ ఏడాది మార్చి 16న 37 మందికి వివిధ శాఖల్లో చైర్మన్లుగా ప్రకటిస్తూ సీఎంవో వర్గాలు ఓ నోట్ రిలీజ్ చేశాయి. కానీ ఇప్పటి వరకు ఆయా చైర్మన్లకు అధికారికంగా జీవోలు, ఉత్తర్వులు అందలేదు. లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన వెంటనే ఆర్డర్స్ వస్తాయని గతంలో పలువురు మంత్రులు వెల్లడించారు. దాదాపు వంద రోజులు అవుతున్నా, ప్రభుత్వం నుంచి అఫీషియల్‌గా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకపోవడం గమనార్హం. జీవోల కోసం ప్రతి రోజూ వెయిట్ చేస్తున్నామని, మానసిక ఒత్తిడికి లోనవుతున్నామని ఆ జాబితాలోని ఓ అనధికారిక చైర్మన్ తెలిపారు. ఆ 37 మందిలో కొందరు జీవోల రాక కోసం నిద్రలేని రాత్రులు గడుపుతూ అనారోగ్యం పాలైనట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి.

మరోవైపు తమకు చైర్మన్లుగా అవకాశం లభించిందనే సంతోషంలో చాలా మంది నేతలు కొత్త వెహికల్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. సుమారు మూడు నెలలైనా, ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో ఇప్పుడు ఆయా నేతలు టెన్షన్ పడుతున్నారు. తమకు ఆర్డర్ ఇవ్వకపోతే వాహనం మెయింటెనెన్స్ ఎలా అని మదన పడుతున్నారు. ఈఎంఐఈలు కట్టేదెలా అని ఆయా నేతలు సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు తెలిసింది. ఇక లిస్టులో తమ పేరు ఉన్నదని కుటుంబ సభ్యులు, బంధు, మిత్రులు, సన్నిహితులకు దావత్‌లు సైతం ఇచ్చారు. ఇంకొందరు బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే పార్టీలు ఇచ్చేందుకు అంతా ప్రిపేర్ చేసుకున్నారు. సీఎంవో ప్రకటించిన జాబితాలో తమ పేరును చూసి ఆనంద పడ్డామని, కానీ ఇప్పటికీ ఉత్తర్వులు ఇవ్వకపోవడమేమిటీ? అంటూ ఓ నేత అసంతృప్తిని వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని ఆర్డర్స్ వచ్చేలా చూడాలని కోరారు.

కొత్తోళ్లకు పెద్దపీట ?

కాంగ్రెస్ పార్టీలో మొదట్నుంచి పనిచేసేవాళ్లకు ఉత్తర్వులు ఇచ్చేందుకు నెలలు పాటు టైమ్ తీసుకుంటున్న తమ సర్కార్, ఇతర పార్టీల నుంచి వచ్చినోళ్లకు పెద్దపీట వేస్తుందని స్వయంగా పార్టీ నేతలే చెపుతున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన జితేందర్ రెడ్డి, కేకేలకు రోజుల వ్యవధిలోనే ప్రభుత్వ సలహాదారులుగా అధికారిక ఉత్తర్వులు ఇవ్వడమే కాగా, క్యాబినెట్ హోదా కల్పించారని, తామేం పాపం చేశామని 37 మంది జాబితాలోని ఓ అనధికారిక చైర్మన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. పార్టీ పవర్‌లోకి రాక ముందు తామంతా పీసీసీ అధ్యక్షుడి రేవంత్ రెడ్డి నాయకత్వంతో గాంధీ భవన్ వేదికగా ఊడిగం చేశామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ తమకు న్యాయం జరగకపోతే ఎలా? అని ఆవేదన వ్యక్తం చేశారు.

పవర్ లేనప్పుడు గాంధీభవన్ ముందు నుంచి కూడా వెళ్లేందుకు ఇష్టపడని లీడర్లు ఇప్పుడు, డైలీ పార్టీ ప్రధాన కార్యాలయం, సీఎం ఇళ్లు, సచివాలయం చుట్టూ తిరుగుతూ ప్రభుత్వ పెద్దలను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారంటూ మండిపడ్డారు. గత కేసీఆర్ ప్రభుత్వంలోనూ ఇలాంటి లీడర్లకు పెద్దపీట వేసినందుకే ఆ పార్టీ ఓటమి పాలైందని, ఇప్పుడు తమ ప్రభుత్వం కూడా ఇలాంటి విధానాలను అమలు చేస్తుంటే బాధగా ఉన్నదని ఓ నేత తన ఆవేదనను వెలిబుచ్చారు.


Similar News