కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతుల్లో టెన్షన్

ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ధాన్యం రైతులు అవి ఎప్పుడు ప్రారంభిస్తారో నని దీనంగా ఎదురు చూస్తున్నారు.

Update: 2023-04-21 06:47 GMT

దిశ, లోకేశ్వరం: వరి ధాన్యం చేతికి వచ్చి నెల రోజులు గడిచినా ఇంకా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ధాన్యం రైతులు అవి ఎప్పుడు ప్రారంభిస్తారో నని దీనంగా ఎదురు చూస్తున్నారు. గత 15 రోజుల నుండి వాతావరణంలో మార్పుల వల్ల వర్షం ఎప్పుడు వస్తుందో తెలియని గందరగోల పరిస్థితులు నెలకొనడం వల్ల కొనుగోలు కేంద్రాల్లో ఆరపెట్టిన ధాన్యం వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. పంట పండించడానికి పడిన బాధల కంటే చేతికి వచ్చిన ధాన్యాన్ని అమ్ముకోవడమే రైతుకు సవాలుగా మారింది.

ధాన్యం చేతికి వచ్చి నెల రోజులు..

నిజామాబాద్ జిల్లాకు సరిహద్దు గ్రామాలైన అబ్దుల్లాపూర్, జోహార్ పూర్, వాస్తాపూర్, వాటోలి, ధర్మోరా, పంచగుడి తదితర గ్రామాల్లో ధాన్యం చేతికి వచ్చి నెల రోజులు గడిచింది. ఆ జిల్లా రైతులతో పోటీపడి ఈ గ్రామాల రైతులు పంటలు సాగు చేస్తున్నారు. నందిపేట్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వం పక్షం రోజుల క్రితమే వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ధాన్యం కొనుగోళ్లు చేపట్టింది.

కానీ లోకేశ్వరం మండలంలో మాత్రం ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. పొరుగు జిల్లా రైతులతో పోటీపడి పంటలు పండించడమే ఇక్కడి రైతులకు శాపంగా మారిందా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. పోటీపడి పంటలు పండించే వారిని ప్రోత్సహించాలి కానీ, ప్రభుత్వం ఇలా ఇబ్బందులకు గురిచేయడం సరికాదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పలు గ్రామాల్లో 100 దాటిన టోకెన్ నంబర్లు...

లోకేశ్వరం మండలంలోని పలు గ్రామాల్లో ఇప్పటికే కొనుగోలు కేంద్రాల నిర్వహకులు టోకెన్లు జారీ చేయగా అబ్దుల్లాపూర్, జోహార్ పూర్ తదితర గ్రామాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన రైతులకు వందకు పైగా టోకెన్లు జారీ చేశారు. కానీ ఇంతవరకు కొనుగోలు ప్రారంభించలేదు. అలాగే ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు తరలించకపోవడంతో ప్రస్తుతం వరి కోతలు చేపట్టిన రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఆరబెట్టేందుకు స్థలం లేక నానా అవస్థలు పడుతున్నారు. అలాగే గన్ని సంచుల కొరత ధాన్యం తరలింపుకు లారీల కొరత తదితర సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఇకనైనా వీలైనంత త్వరలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతుల బాధలు తీర్చాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది.

నెల రోజుల నుండి కుప్పల వద్ద నిద్రిస్తున్నా... కట్ట రాజు, రైతు అబ్దుల్లాపూర్

ఈ యాసంగిలో 8 ఎకరాల్లో వరి పైరు సాగు చేయగా, ధాన్యం చేతికి వచ్చి నెల రోజులు గడిచింది. అకాల వర్షం ఎప్పుడు వస్తుందో తెలియని గందరగోళం పరిస్థితులు నెలకొనడం వల్ల రేయింబవళ్లు ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నాను. ఇకనైనా ప్రభుత్వం మా బాధలు గుర్తించి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి.

Tags:    

Similar News