Group-1: గ్రూప్-1 గ్రేస్ మార్కుల గోల.. మొర పెట్టుకుంటున్న తెలుగు అభ్యర్థులు
భవిష్యత్తులో నిర్వహించే గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల్లో తెలుగు బాషలో సమాధానాలు రాసే అభ్యర్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వాలనే డిమాండ్ తెరమీదికి వస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: భవిష్యత్తులో నిర్వహించే గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల్లో తెలుగు బాషలో సమాధానాలు రాసే అభ్యర్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వాలనే డిమాండ్ తెరమీదికి వస్తోంది. రానున్న రోజుల్లో తెలుగు మీడియంలో పరీక్షలు రాసే అభ్యర్థులే కరువయ్యే అవకాశముందనే వాదన వినిపిస్తోంది. ఇటీవల టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల్లో ఇంగ్లీష్ లో జవాబులు రాసిన అభ్యర్థులు మంచి మార్కులు సాధించగా, తెలుగులో రాసిన అభ్యర్థులు వెనకంజలో ఉన్నారు.
తెలుగు వర్సెస్ ఇంగ్లీష్
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల ఫలితాల విడుదల తరువాత ఇంగ్లీష్,తెలుగు బాషల మధ్య వార్ నడుస్తోంది. తెలుగులో జవాబులు రాసిన అభ్యర్థులకు తక్కువ మార్కులు, ఇంగ్లీష్ లో రాసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చాయనే విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ పరిస్థితికి కారణాలను విద్యావేత్తలు ఊటంకిస్తున్నారు. కొన్నేళ్లుగా రాష్ట్రంలో తెలుగు మీడియం విద్యార్థుల సంఖ్య తగ్గడం, ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ పరిస్థితి ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. దాదపు 25 ఏళ్ల క్రితమే ఇంగ్లీష్ పై మోజు పెరిగి క్రమంగా గ్రామీణ ప్రాంతాల్లోకి పాకింది. ఆ ప్రభావం ఈ మధ్య టీజీపీఎస్సీ రిలీజ్ చేసిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో కనిపించింది.అందుకే ఇంగ్లీష్ లో పరీక్షలు రాసిన అభ్యర్థులు ఎక్కువ మార్కులు సాధించారు.
తెలుగులో మెటిరియట్ తక్కువ?
తెలుగు బాషలో మెయిన్స్ రాసిన అభ్యర్థులకు సరైన మెటిరియల్ లభించకపోవడం ప్రధాన సమస్యగా మారింది. మార్కెట్ సూత్రం ప్రకారం పబ్లిషర్స్ తమ పుస్తకాల డిమాండ్ మేరకు ఇంగ్లీష్ బుక్స్ ను ఎక్కువగా ముద్రిస్తున్నారు. దీంతో తెలుగు మీడియం అభ్యర్థులు తమకు లభ్యమైన పుస్తకాలతో సొంతంగా మెటిరియట్ తయారుచేసుకుని ప్రపేర్ అవుతున్నారు. ఈ కారణంగా విస్తృత మెటిరియట్ ఉండే ఇంగ్లీష్ మీడియం విద్యార్థులతో పోటీ పడలేకపోతున్నారు. అలాగే తెలుగు మీడియంలో మెయిన్స్ రాసిన అభ్యర్థుల్లో 30–32 ఏళ్లుకు పై బడిన వారే అధికంగా ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అధిక వయసుగలవారు ఉన్నారు.
ఇంగ్లీష్ మోజుతో మాతృభాషకు ఇబ్బంది
తెలుగు మీడియంలో పిల్లలను చదివించడం పేరంట్స్ నమోషీగా భావించి, ఇంగ్లీష్ బోధించే స్కూళ్లకు పంపారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. మెజారిటీ విద్యార్థులు మాతృభాష అయిన తెలుగులో చదవలేకపోతున్నారు. రాయలేకపోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్ లో తెలుగులో చదవడం,రాయగలిగేవారు అరుదుగా కనిపించే అవకాశం ఉంది. మహారాష్ట్రలో అక్కడి మాతృబాషలో పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు సర్వీస్ కమిషన్ కొన్ని గ్రేస్ మార్కులు కలపాలని అక్కడ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ కూడా ఆ తరహా నిర్ణయం తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.
ఏపీలో ఇదే పరిస్థితి
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల్లో తెలుగు భాషలో సమాధానాలు రాసిన అభ్యర్థులు చాలా తక్కువ సంఖ్యలో, ఇంగ్లీష్ లో పరీక్షలు రాసినవారు అధిక సంఖ్యలో ఎంపికయ్యారు. ఏపీలో కూడా తెలుగు అభ్యర్థుల కంటే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులే మంచి ఫలితాలు సాధించారని, అందుకు ప్రధాన కారణం వారికి లభ్యమయ్యే మెటిరియల్ అంటున్నారు నిపుణులు.