ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగాణ టీడీపీ.. వ్యూహమిదే!

టీడీపీ రాబోయే ఎన్నికలకు సన్నద్ధమవుతుంది. అందులో భాగంగానే ‘ప్రజలకోసం.. ప్రగతికోసం..ఇంటింటికీ తెలుగుదేశం’ నినాదంతో ప్రజల ముందుకు వెళ్తున్నది.

Update: 2023-02-24 23:45 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: టీడీపీ రాబోయే ఎన్నికలకు సన్నద్ధమవుతుంది. అందులో భాగంగానే ‘ప్రజలకోసం.. ప్రగతికోసం..ఇంటింటికీ తెలుగుదేశం’ నినాదంతో ప్రజల ముందుకు వెళ్తున్నది. ప్రతి ఇంటికి వెళ్లి గతంలో టీడీపీ చేసిన అభివృద్ధిని కరపత్రాలతో వివరించనున్నారు. మానిటరింగ్ పరిశీలకులకు ఈ నెల 26న టీడీపీ అధినేత చంద్రబాబు కిట్లను అందజేయనున్నారు. నెలరోజులపాటు ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించనున్నారు.

పర్యవేక్షణకు పరిశీలకులు

ఖమ్మం సభతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపిన టీడీపీ, అన్ని జిల్లాల్లో సభల నిర్వహణకు సన్నద్ధమతుంది. మరోవైపు ఇంటింటికీ టీడీపీ పేరుతో నెల రోజులపాటు ప్రజల్లో ఉండేలా చర్యలు చేపడుతుంది. ప్రతి ఇంటికి వెళ్లి గత టీడీపీ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేసి వివరించనున్నారు. ప్రజలకు అండగా ఉంటామనే భరోసాను కల్పించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. రాష్ట్రాన్ని 1,329 డివిజన్లుగా విభజించారు. 661 మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లు, 540 గ్రామీణ రెవెన్యూ మండలాలు,128 మున్సిపాలిటీలను డివిజన్లుగా విభజించి వాటికి పరిశీలకులుగా నియమించారు. గత పార్లమెంట్ కమిటీలు ఇన్‌చార్జులు పార్లమెంట్ పరిశీలకులుగా, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జులు అసెంబ్లీ కోఆర్డినేటర్‌గా, మండల పార్టీ అధ్యక్షులు మండల పరిశీలకులుగా వ్యవహరిస్తారు. వారిపై రాష్ట్ర అధ్యక్షుడుతో పాటు మరో ముగ్గురు నిత్యం పర్యవేక్షణ చేస్తారు. ఎప్పటికప్పుడు ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్, నేతల పనితీరును తెలుసుకోనున్నారు.

26న ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు

ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం కోసం నియమించిన కోఆర్డినేటర్లు/ పరిశీలకులకు కిట్లు అందజేసేందుకు 26న చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ భవన్‌కు వస్తున్నారు. ఈ కిట్‌లో పార్టీ సభ్యత్వాల బుక్, అభివృద్ధి బ్రోచర్, కుంకుమ భరణి, గ్రామ, వార్డుల వివరాలుకు చెందిన హ్యాండ్ బుక్ వివరాలు ఉన్నాయి. వార్డు స్థాయిలో ప్రజల నుంచి సమస్యలు, టీడీపీపై ఫీడ్ బ్యాక్‌ను తెలుసుకొని పూర్తి వివరాలను నమోదు చేసి నివేదికను అధిష్టానానికి అందజేయనున్నారు. ఆ అంశాల వారీగా సమస్యలపై పోరుబాట చేపట్టనున్నట్లు పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. నెల రోజులపాటు ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం చేపడతామని వివరించారు.

Tags:    

Similar News