తెలంగాణ పోలీసుల తడాఖా.. రాజస్థాన్‌లో భారీ ఆపరేషన్.. పక్కా ప్లాన్‌తో 27 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్

తెలంగాణ పోలీసులు తమ తడాఖా చూపించారు. రాష్ట్ర సరిహద్దులు దాటి మరీ సైబర్ నేరగాళ్ల అంతు చూశారు.

Update: 2024-10-02 05:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పోలీసులు తమ తడాఖా చూపించారు. రాష్ట్ర సరిహద్దులు దాటి మరీ సైబర్ నేరగాళ్ల అంతు చూశారు. తెలంగాణలో పలు సైబర్ నేరాలకు కారణం అయిన 27 మంది నేరస్థులు రాజస్థాన్‌లో ఉన్నారని తెలియడంతో వాళ్లని పట్టుకోవడానికి పక్కా ప్లాన్ రెడీ చేసి పర్‌ఫెక్ట్‌‌గా ఇంప్లిమెంట్ చేశారు. దీనికోసం ఓ భారీ ఆపరేషన్ నిర్వహించి కరెక్ట్‌ టైమింగ్‌తో కేటుగాళ్లందరినీ అరెస్ట్ చేసి రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ శిఖా గోయల్ వివరించారు.

ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న 2వేలకు పైగా నేరస్థుల డేటాతో ఓ జాబితాను సిద్ధం చేశామని, వారిని పట్టుకునేందుకు తమ సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్లు 7 బృందాలుగా రాజస్థాన్‌కు వెళ్లారని చెప్పారు. ఈ క్రమంలోనే అక్కడ 15 రోజుల పాటు స్పెషల్ ఆపరేషన్‌ నిర్వహించి ఆన్‌లైన్‌లో ఘరానా మోసాలకు పాల్పడుతున్న 27 మంది సైబర్నేరగాళ్లను అరెస్ట్ చేశామన్నారు. ఈ 27 మందిపై దేశవ్యాప్తంగా 2,223 కేసులు.. తెలంగాణలోనే 189 కేసులు ఉన్నాయని తెలిపారు.

అయితే ఈ ఆపరేషన్‌ సమయంలో రాజస్థాన్ పోలీసులు తమకు పెద్దగా సహకరించలేదని, కానీ తాము పట్టు వదలకుండా పోరాడి నిందితుల స్థావరాన్ని కనిపెట్టి కేటుగాళ్ల పని పట్టామని ఆయన చెప్పారు. పట్టుబడినవారిలో గవర్నమెంట్ ఎంప్లాయీస్, జిమ్ ట్రైనర్స్, హోటల్ ఓనర్స్, వంటవాళ్లు.. ఇలా రకరకాల ప్రొఫెషన్స్‌కి సంబంధించిన వాళ్లు ఉన్నారని, వీళ్లంతా ఓ సీక్రెట్ గ్రూప్‌గా ఏర్పడి ఈ నేరాలకు పాల్పడుతున్నారని వివరించారు. అయితే వీరిని వెనకుండి కొన్ని ముఠాలు నడిపించాయని, ఆ ముఠా సభ్యుల కోసం తాము గాలిస్తున్నామని శిఖా గోయల్ తెలిపారు.

కాగా.. ఈ సైబర్ నేరగాళ్లు ఇప్పటివరకు రూ.11 కోట్ల వరకు కాజేశారని, ఒక్క తెలంగాణ నుంచే రూ.9 కోట్లు వీళ్లు కాజేశారని, ఆ డబ్బును దేశంలోని అనేక అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేశారని, ఆ తర్వాత ఆ డబ్బునంతా క్రిప్టో కరెన్సీగా మార్చి విదేశాలకు పంపించారని ఆయన వివరించారు. వీరంతా విదేశాల్లో ఉన్న సైబర్ మాఫియా కోసం పనిచేస్తూ కమిషన్లు పొందుతున్నారని తెలిపారు.

ఇదిలా ఉంటే రాజస్థాన్‌లో ఈ 27 మందిని అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ పిటి వారెంట్ మీద కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఇక్కడ నాంపల్లి కోర్టులో హాజరు పరచగా.. నిందితులకు న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.


Similar News