రాజ్‌భవన్‌లో పెండింగ్ బిల్లుల కేసు: చీఫ్ జస్టిస్ బెంచ్‌కు తెలంగాణ పిటిషన్
రాష్ట్ర అసెంబ్లీ, శాసనమండలి ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఇంకా ఆమోదం తెలపలేదంటూ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సోమవారం (మార్చి 20)న విచారించనున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర అసెంబ్లీ, శాసనమండలి ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఇంకా ఆమోదం తెలపలేదంటూ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సోమవారం (మార్చి 20)న విచారించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే ఈ పిటిషన్ విషయాన్ని మంగళవారం కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గవర్నర్ దగ్గర ఆమోదానికి నోచుకోకుండా పది బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు. మరో గత్యంతరం లేకనే రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని దుష్యంత్ దవే పేర్కొన్నారు. వచ్చే శుక్రవారం (మార్చి 24)న విచారించనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. కానీ దుష్యంత్ దవే మాత్రం వీలైనంత తొందరగా విచారణ చేపట్టాలని, తెలంగాణ ప్రభుత్వ వాదనను వినాలని విజ్ఞప్తి చేశారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఈ నెల 20న చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.
బిల్లులను పరిశీలించే పేరుతో గవర్నర్ తన దగ్గర పెండింగ్‌లో ఉంచారని, ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం నిస్సహాయ స్థితిలో పడిందని, అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించినా గవర్నర్ నుంచి అప్రూవల్ రాకపోవడంతో అమలుకు వీలు పడడంలేదని ఆ పిటిషన్‌లో శాంతికుమారి పేర్కొన్నారు. బిల్లులను గవర్నర్ పరిశీలించే ప్రక్రియను పూర్తిచేస్తే వాటిని తిరస్కరించడమో, తగిన సవరణలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి తిప్పి పంపడమో లేక రాష్ట్రపతి పరిశీలన కోసం ఫార్వార్డ్ చేయడమో చేస్తే బాగుండేదని, కానీ దీర్ఘకాలంగా వాటిని అధ్యయనం పేరుతో ఉంచుకోవడం సమంజసంగా లేదని శాంతికుమారి ఆ పిటిషన్‌ల వివరించారు. గతేడాది సెప్టెంబరులో అసెంబ్లీ ఆమోదించిన ఏడు బిల్లులతో పాటు గత నెల బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆమోదించిన బిల్లులు కూడా రాజ్‌భవన్‌లో పెండింగ్‌లో ఉన్నట్లు ఆమె గుర్తుచేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఈ నెల 20న విచారణకు చేపట్టినప్పుడు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఎలాంటి వాదనలు చోటుచేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.