సైబర్ ​నేరాల అదుపులో తెలంగాణ దేశంలోనే నెంబర్ ​వన్: ​DGP అంజనీకుమార్​

సైబర్​ నేరాలకు అడ్డుకట్ట వేయటంలో.. సైబర్ ​భద్రతలో తెలంగాణ పోలీసులు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారని డీజీపీ అంజనీకుమార్​అన్నారు.

Update: 2023-04-26 16:17 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: సైబర్​ నేరాలకు అడ్డుకట్ట వేయటంలో.. సైబర్ ​భద్రతలో తెలంగాణ పోలీసులు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారని డీజీపీ అంజనీకుమార్​ అన్నారు. సైబర్​సెక్యూరిటీ–2023 అన్న అంశంపై ఢిల్లీ నుంచి గ్లోబల్​ కౌంటర్ ​టెర్రరిజం కౌన్సిల్, డిజిటల్​ ఇండియా కలిసి సంయుక్తంగా ఆన్​లైన్‌లో నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో డీజీపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాలకు కళ్లెం వేసేందుకు దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ర్టంలో సైబర్ ​సెక్యూరిటీ బ్యూరోను ప్రారంభించినట్టు తెలిపారు.

ఏయేటికాయేడు దేశవ్యాప్తంగా సైబర్​నేరాలు పెరిగిపోతున్నట్టు చెప్పారు. తెలంగాణలో కూడా సైబర్​నేరాలు పెరుగుతూ వస్తున్నాయన్నారు. 2019లో 2,691 కేసులు నమోదు కాగా.. ఆ మరుసటి సంవత్సరం వీటి సంఖ్య 5,024కు పెరిగిందని చెప్పారు. 2021లో 10,303 కేసులు రిజిష్టరవ్వగా గత యేడాది 15,217 కేసులు నమోదైనట్టు వివరించారు.

ఈ క్రమంలోనే సైబర్ నేరాలకు కళ్లెం వేసేందుకు పోలీస్ కమాండ్​కంట్రోల్​భవనంలో సైబర్​సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ బ్యూరోలో అయిదు వందల మంది సిబ్బందిని నియమించినట్టు తెలిపారు. వీరికి సైబర్ నేరాలు.. వాటిని అడ్డుకోవటానికి తీసుకోవాల్సిన చర్యలపై సంపూర్ణ అవగాహన కల్పించినట్టు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో సైబర్​ఇన్వెస్టిగేషన్​ టీములను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. టోల్​ఫ్రీ నెంబర్​ అయిన 1930తోపాటు 100 నెంబర్​కు ఫోన్​ చేసినా ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్టు చెప్పారు.

సైబర్​ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్లో 65కోట్ల రూపాయలను రికవరీ చేసినట్టు తెలియచేశారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. రాష్ర్టంలోని ఎనిమిది వందల పోలీస్​స్టేషన్లలో ప్రత్యేక శిక్షణ ఇవ్వటం ద్వారా సైబర్​వారియర్స్‌ను సిద్ధం చేసినట్టు చెప్పారు. ఒక్క హైదరాబాద్‌లోనే మైక్రోసాఫ్ట్‌తో పాటు ఆరు వందల ఐటీ కంపెనీలు ఉన్నాయన్నారు. వీటిల్లో పదిలక్షల మంది వరకు పని చేస్తున్నట్టు చెప్పారు.

Tags:    

Similar News