సీఎం రేవంత్ మరో గుడ్ న్యూస్.. గ్రూపు-1 అభ్యర్థుల వయో పరిమితి పెంపు
తెలంగాణ నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస శుభవార్తలు చెబుతున్నారు. ఇప్పటికే మరో 15 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన ఆయన.. గ్రూపు-1 నోటిఫికేషన్ పైనా స్పష్టత ఇచ్చారు.
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస శుభవార్తలు చెబుతున్నారు. ఇప్పటికే మరో 15 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన ఆయన.. గ్రూపు-1 నోటిఫికేషన్ పైనా స్పష్టత ఇచ్చారు. అతి త్వరలో పెంచిన పోస్టులతో గ్రూపు-1 నోటిఫికేషన్ ఇస్తామని శుక్రవారం అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు.. గ్రూపు-1 అభ్యర్థుల వయో పరిమితిని 46 ఏళ్లకు పెంచుతామని హామీ ఇచ్చారు. కొన్ని నిబంధనల వల్ల టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ఆలస్యమైందని అన్నారు. జీరాక్స్ సెంటర్లలో ప్రశ్నాపత్రాలు అమ్మి ఉద్యోగాలు భర్తీ చేసేవాళ్లం తాము కాదని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఏ ఒక్క తప్పు కూడా రిపీట్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. కాగా, ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం గ్రూపు-1 పోస్టులు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం మరో 60 గ్రూప్-1 పోస్టుల భర్తీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గతంలో 503 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. తాజాగా మరో 60 పోస్టులకు ఆమోదం తెలిపింది. వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే రెండుసార్లు రద్దయిన తెలంగాణ గ్రూప్-1 ఉద్యోగాలకు సంబంధించి త్వరలో కీలక ప్రకటన వెలువడనుంది. మొత్తం 563 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయనుంది.