తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులు జీవితాలతో చెలగాటం ఆడుతుంది: కొండా విశ్వేశ్వర్ రెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ ది అరాచక పాలన అని, నిరుద్యోగులు ఉద్యోగాలివ్వడం ఆయనకు చేతకాలేదని, అదే కుటుంబ సభ్యులకైతే పదవులు మాత్రం ఇచ్చుకున్నారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శలు చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ ది అరాచక పాలన అని, నిరుద్యోగులు ఉద్యోగాలివ్వడం ఆయనకు చేతకాలేదని, అదే కుటుంబ సభ్యులకైతే పదవులు మాత్రం ఇచ్చుకున్నారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శలు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఏర్పడిన తెలంగాణలో తొమ్మిదేండ్లుగా ఉద్యోగ నియామకాలు లేక లక్షలాది మంది యువత అల్లాడుతోందని, కేసీఆర్ పాలనలో జారీ చేసిన అరకొర నోటిఫికేషన్లు సైతం తప్పుల తడకగా ఆయన బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ పేరుతో అభ్యర్థుల జీవితాలతో సర్కార్ ఆటలాడుతోందని ధ్వజమెత్తారు. లక్షలాది మంది నిరుద్యోగుల పక్షాన బీజేవైఎం కార్యకర్తలు ఆందోళన చేస్తే అరెస్ట్ చేయడం సిగ్గుచేటని విమర్శలు చేశారు.
లీకేజీ దోషులను వదిలేసి తప్పులను ఎత్తిచూపుతున్న వారిపై కేసులు పెట్టడం కేసీఆర్ అరాచక పాలనకు నిదర్శనమని ఆయన మండిపడ్డారు. తక్షణమే బీజేవైఎం కార్యకర్తలను బేషరతుగా విడుదల చేయాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ మాత్రం నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తుగ్లక్ పాలనతో యువత జీవితాలతో కేసీఆర్ ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు.
తన ఇంట్లో మాత్రం అందరికీ పదవులిచ్చిన కేసీఆర్ లక్షలాది మంది యువతకు మాత్రం ఉద్యోగాలివ్వకుండా రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నోటిఫికేషన్లు, ప్రశ్నాపత్రం లీకేజీ పేరుతో ఉద్యోగాలను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. పేపర్ లీకేజీ విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి కేసీఆర్ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని, అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన డిమాండ్ చేశారు.