ట్రాఫిక్ సమస్యకు చెక్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కు(KBR Park) చుట్టూ రోడ్ల విస్తరణకు అనుమతి ఇచ్చింది.

Update: 2024-10-04 12:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కు(KBR Park) చుట్టూ రోడ్ల విస్తరణకు అనుమతి ఇచ్చింది. నాలుగు అండర్ పాస్‌లు, ఆరు ఫ్లైఓవర్ల నిర్మాణానికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం పరిపాలన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం కేబీఆర్ పార్కు చుట్టూ ఆరు జంక్షన్ల అభివృద్ధికి ఆమోదం తెలిపింది. ఈ మేరకు రూ.826 కోట్లు కేటాయించింది. రూ.421 కోట్లతో తొలి దశలో జూబ్లీచెక్ పోస్టు వద్దనున్న పార్కు ఎంట్రన్స్ జంక్షన్లు అభివృద్ధి చేయనున్నారు. రెండో దశలో రోడ్ నెంబర్ 45 జంక్షన్, ఫిల్మ్ నగర్ జంక్షన్, మహారాజా అగ్రసేన్, క్యాన్సర్ ఆసుపత్రి జంక్షన్‌ను అభివృద్ధి చేయనున్నారు.

కాగా, హైదరాబాద్ మహా నగరానికి కేబీఆర్ పార్క్ నడిబొడ్డుగా మారింది. నగరంలోని ప్రధాన ప్రాంతాలకు వెళ్లాలంటే ఈ పార్కు నుంచే వెళ్లాలి. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లోని గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాలను కలిపే ముఖ్యమైన రహదారులు కేబీఆర్ పార్క్ నుంచి ఉన్నాయి. దీంతో పలు ప్రాంతాలకు అనుసంధానంగా ఉన్న కేబీఆర్ పార్కు చుట్టుపక్కల రోడ్లన్నీ ఎప్పుడు రద్దీగా ఉంటాయి. జంక్షన్ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు కేబీఆర్ పార్కు చుట్టూ రోడ్ల విస్తరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


Similar News