కేసీఆర్‌ను ఆహ్వానించిన రేవంత్ సర్కార్.. గులాబీ బాస్ నిర్ణయంపై స్టేట్ పాలిటిక్స్‌లో తీవ్ర ఉత్కంఠ
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ వెళ్లారు.
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ వెళ్లారు. ఈ మేరకు జూన్ 2వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ దశాబ్ది వేడుకలకు రావాలని ప్రభుత్వ ప్రోటోకాల్ బృందం కేసీఆర్‌ను ఆహ్వానించింది. కాగా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి జూన్ 2తో పదేళ్లు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. ఈ వేడుకలకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన వ్యక్తిగా పేరు పొందిన కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీని రేవంత్ సర్కార్ ఆహ్వానించింది. ప్రభుత్వం కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించున్న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సోనియాతో పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఉద్యమకారులను, తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలను ఈ వేడుకల్లో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది.
ఈ వేడుకలకు వారిని ఆహ్వానించి సత్కరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే పలువురు ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఆహ్వానాలు పంపుతోంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీ స్థాపించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన కేసీఆర్‌ను దశాబ్ధి వేడుకలకు ఆహ్వానించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే ఇవాళ ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ బృందం కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆహ్వానించింది. అయితే, కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న కేసీఆర్.. ఈ వేడుకలకు హాజరు అవుతారా..? లేదా..? అన్నది స్టేట్ పొలిటికల్ సర్కి్ల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.