తెలంగాణ ఎన్నికలు వాటితోనే? కేంద్రం ప్లాన్ ఇదే!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను పార్లమెంట్ ఎలక్షన్స్‌తో కలిపి నిర్వహించే చాన్స్ ఉన్నట్టు ఢిల్లీ వర్గాల సమాచారం.

Update: 2023-04-05 02:12 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను పార్లమెంట్ ఎలక్షన్స్‌తో కలిపి నిర్వహించే చాన్స్ ఉన్నట్టు ఢిల్లీ వర్గాల సమాచారం. షెడ్యూలు ప్రకారం డిసెంబరులో తెలంగాణ, జనవరిలో మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఏప్రిల్, మేలో జరిగే పార్లమెంటు ఎలక్షన్స్‌తో కలిపే నిర్వహించే చాన్స్ ఉన్నట్టు ఢిల్లీ వర్గాల సమాచారం. వీటితో పాటు వచ్చే ఏడాది జూన్‌లో జరిగే ఏపీ, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్‌కూ కలిపే అవకాశముంది. వన్ నేషన్ - వన్ ఎలక్షన్ విధానంపై కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా ఆలోచిస్తున్నది. లా కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘం, అటార్నీ జనరల్ నుంచి కూడా అభిప్రాయాలను సేకరించింది. ఈ ఏడాది డిసెంబరు నుంచి ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలుచేసే ఆలోచనతో కేంద్రం ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా గతంలో జమిలి ఎన్నికలకు గతంలో బీఆర్ఎస్ పార్టీ సైతం మద్దతు తెలిపింది. మరి ప్రస్తుతం ఆ విధానాన్ని అమలు చేస్తే గులాబీ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందనేది సస్పెన్స్.

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ రాష్ట్రంలో నిన్న మొన్నటివరకూ ఊహాగానాలు వినిపిస్తే ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో ఇందుకు భిన్నమైన వార్తలు వెలువడుతున్నాయి. షెడ్యూలు ప్రకారం డిసెంబరులో జరగాల్సిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, జనవరిలో జరగాల్సిన మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికలు పార్లమెంటు ఎలక్షన్స్‌తో కలిపే నిర్వహించే చాన్స్ ఉన్నట్టు ఢిల్లీ వర్గాల సమాచారం.

సాధారణ ఎన్నికలకు కేవలం మూడు నెలల ముందే ఈ ఎన్నికలు జరగనున్నందున విడివిడిగా జరపడం కంటే ఒకేసారి కలిపి నిర్వహిస్తే మంచిదని విషయం కేంద్ర ఎన్నికల కమిషన్‌లో చర్చకు వచ్చినట్టు తెలిసింది. లీగల్‌గా వచ్చే చిక్కులను అధిగమించడానికి ఉన్న ప్రత్యామ్నాయమేంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఈ ఐదు రాష్ట్రాలతో పాటు షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది జూన్‌లో జరిగే ఏపీ, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్‌ను కూడా పార్లమెంట్ ఎలక్షన్స్‌తో కలిపి నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కమిషన్ వర్గాల ప్రాథమిక సమాచారం. వన్ నేషన్ - వన్ ఎలక్షన్ విధానంపై కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా ఆలోచిస్తూ ఉన్నది.

లా కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘం, అటార్నీ జనరల్ నుంచి కూడా అభిప్రాయాలను సేకరించింది. ఈ ఏడాది డిసెంబరు నుంచి ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలుచేసే ఆలోచనతో కేంద్రం ఉన్నట్టు సమాచారం. ఇందుకోసం ఆర్డినెన్సు బాటను ఎంచుకోనున్నట్టు తెలుస్తున్నది. అక్టోబరు తర్వాత దీనిపై మరింత క్లారిటీ వచ్చే చాన్స్ ఉన్నది.

ఐదారేండ్లుగా అభిప్రాయ సేకరణ

కొన్నేండ్లుగా జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. కేంద్ర లా కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ దిశగా పలు దఫాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలూ నిర్వహించింది. జమిలి ఎన్నికల నిర్వహణపై వారి అభిప్రాయాలను రాతపూర్వకంగా స్వీకరించింది. పార్టీల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు, కొత్త ప్రతిపాదనలను సైతం రికార్డు చేసింది.

వన్ నేషన్ – వన్ ఎలక్షన్ పాలసీ కోసం కేంద్ర ప్రభుత్వం సైతం అనేక కోణాల నుంచి కసరత్తు చేస్తూ ఉన్నది. పార్లమెంటుతో కలిపే అసెంబ్లీలకు కూడా ఎలక్షన్స్ నిర్వహించడంలోని ఇబ్బందులు, వాటిని అధిగమించడానికి ఉన్న మార్గాలపై అన్వేషణ మొదలుపెట్టింది. లా కమిషన్ చేసిన ప్రతిపాదనలనూ అధ్యయనం చేసింది. పార్లమెంటు చట్టం ద్వారా విధాన నిర్ణయం తీసుకోవడంపై ఫోకస్ పెట్టింది.

గడువు పొడిగింపు?

ఈ ఏడాది డిసెంబర్‌లో (17న) మిజోరాం, వచ్చే ఏడాది జనవరిలో తెలంగాణ(15న), మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీల గడువు ముగిసి కొత్త సభలు కొలువుతీరాల్సి ఉంటుంది. ఈ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీల గడువు ముగిసినా ఎన్నికలు నిర్వహించకుండా పార్లమెంటుతో కలిపి నిర్వహించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై ప్రాథమిక స్థాయిలో ఆలోచనలు జరిగాయి. లీగల్‌గా ఇబ్బందులు తలెత్తకుండా అనుసరించాల్సిన విధానంపై కేంద్ర ఎన్నికల సంఘం మరింత లోతుగా అధ్యయనం చేయాలనుకుంటున్నది.

విడివిడిగా ఎన్నికల నిర్వహణకు అయ్యే వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని పార్లమెంటుతో కలిపి ఈ రాష్ట్రాల ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎలక్షన్ కమిషన్ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నది. వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు జరగనున్నందున దానికి సంబంధించిన కసరత్తు ఆరు నెలల ముందే మొదలవుతుంది. అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల సిబ్బంది నిర్వహణాపరమైన అంశాల్లో తలమునకలు కానున్నారు. ఇలాంటి సమయంలో డిసెంబరు-జనవరి నెలల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరపాల్సి ఉంటుంది.

ఎన్నికల వ్యయం, తగినంత సిబ్బంది అందుబాటులో లేదనే కారణంతో అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించలేమనే నిర్ణయాన్ని ఎన్నికల కమిషన్ కేంద్రానికి తెలియజేయనున్నట్టు సమాచారం. ఈ కారణంతోనే పార్లమెంటుతో కలిసి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనను వివరించనున్నది. ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన నోట్‌ను పరిగణనలోకి తీసుకుని కేంద్ర మంత్రిమండలిలో చర్చించి ఆ తర్వాత ఆర్డినెన్సు రూపంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను పార్లమెంటుతో కలిపి నిర్వహించాలనే ప్రత్యామ్నాయం దిశగా అడుగులు పడొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఆలోచనల స్థాయిలోనే ఉన్న ఈ వ్యవహారం రానున్న కాలంలో ఏ దిశగా వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. వన్ నేషన్ – వన్ ఎలక్షన్ విధానంలో భాగంగా ఈ ఆర్డినెన్స్ వచ్చే అవకాశమున్నది.

అప్పటి వరకు ప్రస్తుత ప్రభుత్వాలే కంటిన్యూ!

అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలనే నిర్ణయం ఖరారైతే ప్రస్తుత అసెంబ్లీ గడువును అప్పటివరకూ వరకూ పొడిగించేలా పార్లమెంటులో ప్రత్యేక తీర్మానం చేయాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు పేర్కొన్నారు. గవర్నర్ పాలన, ఆపద్ధర్మ పాలన అవసరం లేకుండా రెగ్యులర్ ప్రభుత్వమే అప్పటివరకూ కంటిన్యూ కావడానికి వెసులుబాటు లభిస్తుంది.

కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత పార్లమెంటులో చర్చ జరిపి ఆమోదించడం అనివార్యం. దానికి అనుగుణంగా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సమాచారం అందిన తర్వాత అధికారికంగా నోటిఫికేషన్ వెలువడుతుంది. అసెంబ్లీ ఎన్నికల వాయిదా నిర్ణయం అధికారికంగా ప్రకటన రూపంలో వెలువడడానికి ఆరు నెలల ముందే ఈ కసరత్తు మొదలుకానున్నది.

జమిలికి మద్దతు పలికిన బీఆర్ఎస్

జమిలి ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం గతంలో నిర్వహించిన సమావేశాల్లో ఆయా పార్టీల అభిప్రాయాలు, రాతపూర్వకంగా సమర్పించిన ప్రతిపాదనలు కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు రానున్నాయి. జమిలి ఎన్నికలపై పార్లమెంటు ద్వారా చట్టం జరగడంతో సంబంధం లేకుండా పార్టీల అభిప్రాయాలనే పరిగణనలోకి తీసుకుని వాటి వైఖరి ఇదేనంటూ కమిషన్ ఒక కారణంగా చూపే చాన్స్ ఉన్నది.

ప్రధాని మోడీ అధ్యక్షతన ఢిల్లీలో 2019 జూన్ 19న జరిగిన సమావేశానికి బీఆర్ఎస్ తరఫున హాజరైన కేటీఆర్ జమిలి ఎన్నికలకు మద్దతు పలుకుతున్నట్టు స్పష్టం చేశారు. దీని వల్ల ఎన్నికల నిర్వహణకు అయ్యే వ్యయం తగ్గుతుందని వివరణ ఇచ్చారు. అప్పటికే పార్టీ అధినేతగా కేసీఆర్ రాతపూర్వకంగా జమిలి ఎన్నికలకు మద్దతు పలుకుతూ రాసిన లేఖను ఆయన తరపున వినోద్ కుమార్ (అప్పటి ఎంపీ) 2018 జూలై 18న లా కమిషన్‌కు సమర్పించారు.

ప్రతి ఐదేళ్లకూ రెండుసార్లు ఎన్నికల ప్రక్రియ జరగడం వల్ల జిల్లా ప్రభుత్వ యంత్రాంగానికి పని భారం అవుతుందని, ప్రభుత్వ పథకాల అమలుకు కూడా కోడ్ వల్ల ఆటంకం కలుగుతుందన్నారు. దానికి ముందు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశిస్తూ 2018 జనవరి 31న రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ చేసిన ప్రసంగం సందర్భంగా జమిలి ఎన్నికల విషయాన్ని ప్రస్తావించారు. దీనికి మద్దతు పలుకుతున్నట్టు అప్పటి టీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత జితేందర్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఒకవేళ పార్లమెంటు ఎన్నికలతో కలిపి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం భావించినట్లయితే అప్పటి టీఆర్ఎస్ వైఖరిని కూడా ప్రస్తావించే చాన్స్ ఉన్నది.

అనుకూల, ప్రతికూలతలు

జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటే అది ఏ పార్టీకి అనుకూలం, ప్రతికూలం అనే చర్చ మొదలవుతుంది. రాష్ట్రంలో ప్రభుత్వం‌పై ప్రజల్లో అసంతృప్తి, వ్యతిరేకత పెరుగుతూ ఉన్నందున మరో ఏడాదికల్లా అది ఇంకొంత పెరిగే అవకాశముందన్న అభిప్రాయాలు లేకపోలేదు. రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ ఈ తరహా నిర్ణయాన్ని తీసుకున్నదని బీఆర్ఎస్ రాజకీయంగా విమర్శలు చేసి దానిని అనుకూలంగా మల్చుకునే చాన్స్ ఉన్నది.

షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కేసీఆర్ వాటిపై ఫోకస్ పెట్టి పార్లమెంటు ఎన్నికల నాటికి ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ యాక్టవిటీస్‌ పెంచే పనిలో నిమగ్నమవుతారు. జమిలి ఎన్నికలతో కేసీఆర్‌కు అలాంటి అవకాశం లేకుండాపోతుంది. తెలంగాణకు మాత్రమే ఆయన పరిమితం కావాల్సి వస్తుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేసుకోడానికి, తగిన సమర్ధత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసుకోడానికి ఎక్కువ సమయం చిక్కుతుంది. అక్టోబరు నాటికి కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేదానిపై స్పష్టత రానున్నది.

Tags:    

Similar News