లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా టీ.కాంగ్రెస్‌లో కీలక మార్పులు
అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజార్టీతో తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది.
దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజార్టీతో తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను లోక్ సభలోనూ రిపీట్ చేసేలా వ్యూహాత్మక నిర్ణయాలపై కసరత్తు పెట్టింది. ఇప్పటికే పీఏసీ సమావేశం నిర్వహించి పార్లమెంట్ సెగ్మెంట్లకు ఇన్ చార్జీలను నియమించిన హస్తం పార్టీ రేపు టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన విస్తృత కార్యవర్గ సమావేశం భేటీ కాబోతున్నది. తెలంగాణలో 15 లోక్ సభ స్థానాలలో గెలవడమే టార్గెట్ గా పెట్టుకుని కదనరంగంలోకి ముందుకు సాగేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వార్ రూమ్ స్ట్రాటజీనే సార్వత్రిక ఎన్నికల్లో వాడుకుని బీఆర్ఎస్, బీజేపీలకు చెక్ పెట్టేందుకు పావులు కదుపుతోంది. ఈ మేరకు రేపటి సమావేశానికి పీఏసీ సభ్యులు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఫ్రంటల్ చైర్మన్‌లు హాజరు కాబోతున్నారు.
సంస్థాగత మార్పులకు శ్రీకారం:
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి సార్వత్రిక ఎన్నికలు బిగ్ టాస్క్ గా మారాయి. గత ఎన్నికల్లో కేవలం మూడు ఎంపీలను గెలుచుకున్న హస్తం పార్టీ ఈసారి అధికార పార్టీ హోదాలో సత్తా చాటాలనే పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర, దక్షిణ తెలంగాణలో ఏయే సెగ్మెంట్లలో ఉన్న బలాబలాలేంటో బేరీజు వేసుకుని పార్టీని బలోపేతం చేసేందుకు సంస్థాగత మార్పులకు సైతం శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డినే పీసీసీగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇటు పాలన వ్యవహారాలు మరో వైపు పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టడం వల్ల సానుకూల ఫలితాలు ఉండవని భావిస్తున్న అధిష్టానం పూర్తిస్థాయిలో కొత్త పీసీసీకే అధిష్టానం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇటీవల జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కొత్త పీసీసీకి సంబంధించిన రాష్ట్ర నేతలకు అధిష్టానం నుంచి కీలక సూచనలు చేరినట్లు సమాచారం. దీంతో రేపటి సమావేశంలో పీసీసీ ఎంపికపై నేతల అభిప్రాయాన్ని సేకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే అన్ని జిల్లాలకు కొత్త డీసీసీల నియామకం, డీసీసీలకు ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయ కమిటీలు, అసెంబ్లీ ఎన్నికల తరహాలో వార్ రూమ్ నుంచి సాగించాల్సిన వ్యూహాలు, అగ్రనేతల పర్యటనలు, ప్రచార అంశాలు వంటి అంశాలపై రేపటి మీటింగ్ లో చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో తీసుకునే నిర్ణయాలను రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి థాక్రే అధిష్టానానికి అందజేయనున్నారు.
భేటీకి ముందు ఢిల్లీకి భట్టి:
టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశానికి ముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ఆసక్తిగా మారింది. ఈ టూర్ లో భాగంగా ఆయన కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ కాబోతున్నారు. అయితే రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ, ఎమ్మెల్సీలతో పాటు ఇతర నామినేటెజ్ పోస్టుల భర్తీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భట్టి హస్తినా టూర్ ఆసక్తిగా మారింది. వీటిపై చర్చించేందుకే భట్టిని అధిష్టానం ఢిల్లీకి పిలిపించినట్లు తెలుస్తోంది. మూడు రోజుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి అధిష్టానం పెద్దలతో భేటీ అయి రాగా తాజాగా డిప్యూటీ సీఎం వెళ్లడంతో రేపటి భేటీలో ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయనేది ఉత్కంఠగా మారింది.