ఢిల్లీలో తెలంగాణ సీఎం.. కేబినెట్ విస్తరణపై కేసీతో కీలక భేటీ!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. సోమవారం రాత్రి హస్తిన (Delhi) చేరుకున్న ఆయన.. ఈ రోజు (మంగళవారం) ఉదయం లోక్‌సభ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ (Congress) సంస్థాగత ప్రధాన కార్యదర్శి, కేసీ వేణుగోపాల్ (KC Venugopal)తో సమావేశమయ్యారు. ఢిల్లీలోని వేణుగోపాల్ నివాసంలో ప్రస్తుతం ఈ సమావేశం కొనసాగుతోంది. ఇక ఈ భేటీలో నామినేటెడ్ పదవులు, సంస్థాగత వ్యవహారాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. టీపీసీసీ (TPCC) కార్యవర్గంపైన కూడా మాట్లాడుకుంటారని సమాచారం. కాగా.. ఈ భేటీ అనంతరం ఇటీవల అస్వస్థతకు గురైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేను రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కలిసి పరామర్శించనున్నారట.
ఇదిలా ఉంటే ప్రస్తుతం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఎలాగైనా దసరాలోపు మంత్రి వర్గాన్ని చేపట్టాలని అనుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కేబినెట్‌లో ఎవరికి అవకాశం ఇవ్వాలా అని ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీకి పయనమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నేతల్లో కూడా మంత్రి పదవుల కోసం పోటీ మొదలైంది. కేబినెట్‌లో ఎవరికి చోటు దక్కుతుందోనని నేతల్లో ఉత్కంఠ నెలకొంది.