Cabinet Expansion: వచ్చే నెలలో కేబినెట్ విస్తరణ!.. ‘స్థానిక’ ఎన్నికల ముందే మరో రెండు స్కీమ్స్!
తెలంగాణ కేబినెట్ విస్తరణపై మరోసారి చర్చ జోరందుకుంది.
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర కేబినెట్ విస్తరణకు (Cabinet Expansion) ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తున్నది. డిసెంబర్ 7వ తేదీతో రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సర్కార్ కొలువుదీరి ఏడాది కాలం పూర్తవబోతున్నది. ఈ నేపథ్యంలో ఆ లోపే మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎల్లుండి వెలువడబోతున్నాయి. దీంతో అధిష్టానం సైతం మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించినట్లు టాక్ వినిపిస్తున్నది. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాలకంటే ముందే మంత్రివర్గ విస్తరణ పూర్తిచేసే చాన్స్ ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తున్నది.
శాసనసభలో ధరణికి గుడ్ బై!
అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు (Assembly Session) ముహూర్తం ఫిక్స్ అయింది. డిసెంబర్ 9 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తున్నది. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణికి గుడ్ బై చెప్పి సరికొత్తగా రూపొందించిన ఆర్వోఆర్ చట్టాన్ని ఆమోదించే చాన్స్ కనిపిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం కులగణన సర్వేపై కూడా అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఈ సర్వే ఆధారంగా బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసే చాన్స్ ఉన్నట్లు సమాచారం.
‘స్థానిక’ ఎన్నికల ముందే మరో రెండు స్కీమ్స్!
స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం కీలక ప్రకటనలు చేయబోతున్నట్లు తెలుస్తున్నది. హామీల అమలులో భాగంగా ఆసరా పెన్షన్లు (Asara Pensions), రైతు భరోసా (Rythu Bharosa) పథకాలను ఎన్నికలకు ముందే అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.