జోరందుకున్న టీచర్​ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి.. ఈనెల 16న నోటిఫికేషన్​ విడుదల

హైదరాబాద్​– రంగారెడ్డి– మహబూబ్​నగర్​ టీచర్​ ఎమ్మెల్సీ ఎన్నికల సందడీ జిల్లాలో జోరుగా సాగుతుంది.

Update: 2023-02-11 08:43 GMT

దిశ, రంగారెడ్డి బ్యూరో: హైదరాబాద్​– రంగారెడ్డి– మహబూబ్​నగర్​ టీచర్​ ఎమ్మెల్సీ ఎన్నికల సందడీ జిల్లాలో జోరుగా సాగుతుంది. నోటిఫికేషన్​ విడుదల కాకముందే టీచర్​ సంఘాల నేతలు తమ తమ అభ్యర్థులను ప్రకటించారు. నిన్న, మొన్నటి వరకు మొక్కుబడిగా సాగించిన ప్రచారం నోటిఫికేషన్ 16న విడుదలైతుందనే విషయం ఎన్నికల కమీషన్​ప్రకటించడంతో మరింత దూకుడుగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. ఎక్కడిక్కడ వివిధ టీచర్ల సంఘాల నేతలు ప్రచార ప్రణాళికలను రూపొందించుకున్నారు.

అంతేకాకుండా అత్యధికంగా టీచర్ ఎమ్మెల్సీకి ఓట్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే ఉండటంతో అన్ని సంఘాల నాయకులు దృష్టి సాధించాయి. అదేవిధంగా టీచర్​ఎమ్మెల్సీ ఓట్లతో సంబంధం లేని వ్యక్తులను ప్రచారం కోసం నియమించుకున్నారు. వీరి ద్వారా టీచర్ ఎమ్మెల్సీ ఓటర్లను ఇంటింటికి తిరిగి కలిసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 16న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఫిబ్రవరి 23 వరకు నామినేషన్లకు గడువు... మార్చి 13న ఎన్నికల పోలింగ్‌... మార్చి 16న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

ఈ ఎన్నికల్లో ఎవరికి వారే విజయాల కోసం కసరత్తు చేసుకుంటున్నారు. దీంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో టీచర్ల హాడావుడి కనిపిస్తోంది. అయితే వివిధ పార్టీల నేతలతో టీచర్ల సంఘాల నేతలు మద్దతు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే అధికార పార్టీ ఏ సంఘానికి మద్దతు ఇస్తుందో వేచి చూడాలని టీచర్ల అభిప్రాయ పడుతున్నారు. కానీ ఇటీవల కాలంలో నూతన డైరీ, క్యాలెండర్ల ఆవిష్కరణ సందర్భాల్లో మంత్రి హారీష్‌ను కలిసినప్పుడు అధికార పార్టీ ఏ టీచర్ సంఘానికి మద్దతు ప్రకటించదని స్పష్టం చేశారు.

దీంతో అధికార పార్టీకి దూరంగా వ్యవహారించే టీచర్ సంఘాల నేతలు శుభపరిణామంగా భావిస్తున్నారు. ఇప్పుడు ఏ సంఘం ఏవిధంగా విద్యావ్యవస్థలోని మార్పులను, టీచర్ల సమస్యలను వ్యక్తం చేస్తాయో గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే వివిధ సంఘాల నేతలు అభ్యర్థులను ప్రకటించుకున్నారు. బీజేపీ ఈ ధఫా బలమైన టీచర్​ఎమ్మెల్సీ అభ్యర్ధిని గెలిపించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.

పోటీదారులు వీరే...

టీఎస్‌ యూటీఎఫ్‌ తరఫున మాణిక్‌రెడ్డి, పీఆర్‌టీయూ టీఎస్‌ నుంచి చెన్నకేశవరెడ్డి, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అభ్యర్థిగా ఏవీఎన్‌రెడ్డి, టీపీఆర్టీయూ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి, టీయూటీఎఫ్‌ అభ్యర్థిగా దేవన్నగారి మల్లారెడ్డి, ఎస్టీయూ నుంచి భుజంగరావు, మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన రిటైర్డ్‌ డీఈవో విజయ్‌కుమార్‌, హర్షవర్ధన్‌రెడ్డిలను ఇప్పటికే ఆయా సంఘాలు తమ అభ్యర్థులుగా ప్రకటించాయి.

వారంతా జోరుగా ప్రచారం నిర్వహిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో జి. హర్షవర్ధన్‌రెడ్డి (స్వతంత్ర) పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి ఈ సారి టీపీఆర్టీయూ నుంచి అవకాశం దక్కడం లేదని, దీంతో ఆయన రెబల్‌ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పీఆర్టీయూ తెలంగాణ సంఘం మద్దతుతో ఆయన ఎన్నికల బరిలో నిలవనున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో 12 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.

వారిలో జనార్ధన్‌రెడ్డి, మాణిక్‌రెడ్డి, ఏవీఎన్‌రెడ్డి మధ్య తీవ్ర పోటీ జరిగింది. తొలి ప్రాధాన్యత ఓట్లతో విజయం దక్కక పోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లతో జనార్ధన్‌రెడ్డి విజయం సాధించారు. మాణిక్‌రెడ్డి రెండో స్థానంలో, ఏవీఎన్‌రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. ఈసారి ఎన్నికల్లో టీఎస్‌ యూటీఎఫ్‌ అభ్యర్థి మాణిక్‌రెడ్డి, పీఆర్టీయూటీఎస్‌ అభ్యర్థి చెన్నకేశరెడ్డి, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అభ్యర్థి ఏవీఎన్‌రెడ్డి, మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రంగారెడ్డి జిల్లాలో అత్యధిక ఓటర్లు...

ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 126 పోలింగ్‌ స్టేషన్లలో మొత్తం 29,501 ఓటర్లున్నారు. అందులో పురుషులు 15,425, మహిళలు 14,074, ఇతర ఓటర్లు ఇద్దరున్నారు. ఇందులో రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 8,687 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఒక్క కందుకూరు రెవెన్యూ డివిజన్‌లోనే 4,239 మంది ఉన్నారు. బాలాపూర్‌ మండలం జిల్లెలగూడలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పోలింగ్‌ స్టేషన్‌లో అధికంగా 1,044 ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా కేశంపేట పోలింగ్‌స్టేషన్‌లో తొమ్మిది మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు.

Tags:    

Similar News