TDP: టీడీపీ అ‌డ్‌హాక్ కమిటీలో చోటు ఎవరికో..? వారంలో ప్రకటించేందుకు బాబు కసరత్తు

తెలంగాణలో పూర్వవైభవం చాటేందు కు పార్టీ అధినేత చంద్రబాబు అడుగులు వేస్తున్నారు.

Update: 2024-08-27 02:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో పూర్వవైభవం చాటేందు కు పార్టీ అధినేత చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం ఉన్న పార్టీ కమిటీలన్నింటిని రద్దు చేశారు. అడ్ హక్ కమిటీ వేస్తానని ప్రకటించారు. ఈ కమిటీలో ఎంతమందికి చోటు కల్పిస్తారు? సీనియర్లలో ఎంతమందికి ఇస్తారు? ఎవరెవరికి మొండిచెయ్యి చూపుతారనేది హాట్ టాఫిక్ గా మారింది. కొంతమంది పార్టీ సీనియర్లమని చెప్పుకుంటూ ఎన్టీఆర్ భవన్ కు, మీడియాకే పరిమితమైన నేతలపై గుర్రుగా ఉన్నారు. దీంతో కొంతమందికి పార్టీ పదవులు ఇవ్వకుండా చెక్ పెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.

రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్ర బాబు దృష్టిసారించారు. అందుకు తగ్గట్టు ప్రణాళికలు రూ పొందిస్తున్నారు. సభ్యత్వ నమోదుతో పార్టీకి ప్రజల్లో ఏమేర అభిమానం ఉంది, ఏ పార్టీ నాయకుడి సత్తా ఏంటో తెలిసే అవకాశం ఉంది. అందుకే మొదటగా పార్టీ సభ్యత్వ నమోదు కు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇదే విషయాన్ని పార్టీ నాయకులకు సూచించారు. అందులో భాగంగానే తెలంగాణలోని పార్టీ రాష్ట్ర కమిటీతో పాటు అనుబంధ కమిటీలన్నింటిని రద్దు చేశారు. అయితే ఈ కమిటీలో ఎవరికి అవకాశం కల్పిస్తారనేది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఎంతమందితో కమిటీ వేస్తారు.. ఎవరికి అవకాశం ఇస్తారు.. పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్నవారికి అవకాశం ఉంటుందా? లేకుంటే యువతకు ప్రాధాన్యం ఇచ్చి, సీనియర్లకు ఉద్వాసన పలుకుతారా? మరి సీనియర్లకు ఎలాంటి అవకాశం కల్పిస్తారు? ఏమైనా నామినేటెడ్ పదవులు ఇస్తారా? లేకుంటే సలహాదారులుగా నియమించి వారిని పక్కకు పెడతారా? అనేది పార్టీలో చర్చనీయాంశమైంది.

వారంలో ప్రకటించేందుకు కసరత్తు

పార్టీ రాష్ట్ర అడహక్ కమిటీని వారం రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. అయితే తెలంగాణలో పాత జిల్లాలతో కలిపి కొత్తగా ఏర్పడిన జిల్లాలు మొత్తం 33 ఉన్నాయి. అయితే ఉమ్మడి పదిజిల్లాలకే అంటే అడహక్ కమిటీని 10మందితోనా? లేకుంటే 33 మందితో ప్రకటిస్తారా? అనేది నేతల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒక్కో అడహక్ కమిటీ సభ్యుడికి ఒక్కో జిల్లాను అప్పగించనున్నట్లు పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొనడంతో ఆయనతో జిల్లా అడహక్ కమిటీని వేసి అసెంబ్లీ సెగ్మెంట్ కు ఒకరికి బాధ్యతలు అప్పగించి సభ్యత్వ నమోదును ముమ్మరం చేస్తారా? లేకుంటే జిల్లాకు బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అడహక్ కమిటీ సభ్యుడే మొత్తం బాధ్యతలు నిర్వహిస్తారా? అధినేత ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాలి. అయితే అడహక్ కమిటీపై సోమవారం రాత్రి తన నివాసంలో కొంతమంది నేతలతోనే చంద్రబాబు భేటీ అయినట్లు విశ్వసనీయ సమాచారం.

సీనియర్లపై అధినేత సీరియస్

తెలంగాణలో టీడీపీ అధికారంలో లేకపోయినా పార్టీలోనే ఏళ్లతరబడి కొనసాగుతున్న సీనియర్లందరికీ పార్టీలో పదవులు కల్పించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో 64మందితో పూర్తి కమిటీని వేశారు. కొంతమంది పార్టీ మారడంతో పార్టీలో పనిచేస్తున్నవారికి అవకాశం కల్పించారు. కొన్ని మార్పులు చేశారు. అయితే పార్టీలో పదవులు ఇచ్చినప్పటికీ వారంతా ప్రజల్లోకి వెళ్లకుండా వారి సమస్యపై పోరాటం చేయకుండా ఎన్టీఆర్ భవన్ కే వచ్చిపోతున్నారు.

అంతేకాదు పార్టీ ఇస్తున్న ఫండ్, సౌకర్యాలను వినియోగించుకోవడంతో పాటు సొంతప్రయోజనాలకే పార్టీని వినియోగించుకుంటూ కాలం వెళ్లదీస్తున్నట్లు పలువురిపై ఆరోపణలు వచ్చాయి. ఇదే విషయం పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి సైతం వెళ్లినట్లు సమాచారం. మరికొంతమంది మీడియాకే పరిమితం కావడం, పార్టీ అనుంబంధ సంఘాలు సైతం ప్రజల పక్షాన ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో పార్టీ నేతలతో నిర్వహించిన రెండు సమావేశాల్లోనూ సీరియస్ అయినట్లు తెలిసింది. పనిచేసేవారికే పదవులు అంటూ స్పష్టం చేశారు. సొంత ప్రయోజనాల కోసమా పార్టీ పదవులు ఇచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎవరు ఏం చేస్తున్నారో తెలు సని, పార్టీకోసం ఎవరు కష్టపడుతున్నారో? తెలుసని చురకలంటించినట్లు విశ్వసనీయసమాచారం.

యువతకు పెద్దపీట

పార్టీలో సీనియర్ నేతలు పదవుల కోసం పాకులాడుతున్నారే కానీ పార్టీని మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదని, ఒకరు సమావేశం నిర్వహిస్తే మరొకరు దూరంగా ఉంటున్నారని బాబు మందలించినట్లు సమాచారం. నేతల మధ్య సఖ్యత లేకపోవడం వల్లే పార్టీలో కొనసాగుతున్న వారికి కాకుండా మరోవ్యక్తికి పార్టీ రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా సీనియర్లలో కొంతమందికి పదవులు ఇచ్చినా లాభం లేదని, యువతకు పెద్దపీట వేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని నేతల కు అధినేత చెప్పినట్లు సమాచారం. పనిచేసేవారికి, పార్టీకి పనికి వచ్చివారికి, మరోవైపు యువతకు పెద్ద పీట వేస్తామని పేర్కొనడంతో ఎవరెవరికి అవకాశం కల్పిస్తారనేది ప్రస్తుతం పార్టీలో హాట్ టాఫిక్ గా మారింది.


Similar News