అవ‌గాహ‌న‌తోనే టీబీ నియంత్రణ సాధ్యం: డాక్టర్ హిమబిందు

క్షయ వ్యాధిపై అవ‌గాహ‌న‌తోనే రోగి ప్రాణాల‌ను కాపాడ‌టంతో పాటు వ్యాప్తిని నియంత్రించ‌గ‌ల‌మ‌ని హ‌న్మకొండ జిల్లా క్షయ నివార‌ణ అధికారిణి డాక్టర్ హిమ‌బిందు అన్నారు.

Update: 2023-03-23 16:03 GMT

దిశ, హనుమకొండ టౌన్: క్షయ వ్యాధిపై అవ‌గాహ‌న‌తోనే రోగి ప్రాణాల‌ను కాపాడ‌టంతో పాటు వ్యాప్తిని నియంత్రించ‌గ‌ల‌మ‌ని హ‌న్మకొండ జిల్లా క్షయ నివార‌ణ అధికారిణి డాక్టర్ హిమ‌బిందు అన్నారు. క్షయ నివార‌ణ అనేది స‌మాజంలోని అంద‌రి బాధ్యత‌గా భావించాల‌ని అన్నారు. టీబీ బాక్టీరియా సాధారణంగా దగ్గు, తుమ్ముల సమయంలో గాలిలోకి విడుదలయ్యే చిన్న బిందువుల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంద‌న్నారు. టీబీ వ్యాధి ఉన్న వ్యక్తి దగ్గినప్పుడు, మాట్లాడినప్పుడు, తుమ్మినప్పుడు, పాడినప్పుడు, నవ్వినప్పుడు వారు టీబీని వ్యాప్తి చేస్తారు.

అకారణంగా బరువు తగ్గడం, నిరంతర దగ్గు, రాత్రిపూట చెమటలు పట్టడం, విపరీతమైన జ్వరం ఉన్నట్లయితే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుందన్నారు. మార్చి 24వ తేదీన ప్రపంచ టీబీ నివార‌ణ దినోత్సవం జ‌రుపుకుంటారు. ఈ సంద‌ర్భంగా టీబీ వ్యాధి ల‌క్షణాలు, రోగ నిర్ధార‌ణ‌, రోగి పాటించాల్సిన జాగ్రత్తలు, చికిత్స విధానంపై హ‌న్మకొండ జిల్లా క్షయ నివార‌ణ అధికారిణి డాక్టర్ హిమ‌బిందు ‘దిశ‌’ తో ప్రత్యేకంగా వివ‌రించారు. ఆ వివ‌రాలు ఆమె మాటల్లోనే..

వీరికి టీబీ వ‌చ్చే అవ‌కాశం.. ప‌రిణామాలు..

రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న పిల్లలు, వృద్ధులకు టీబీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మధుమేహం, కిడ్నీ వ్యాధులు, హెచ్ఐవీతో బాధపడుతున్న వారిలో టీబీ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. పోషకాహారలోపం, సిలికోసిస్ ఉన్నవారి లోనూ ఈ వ్యాధి సోకుతుంది. ఆర్థరైటిస్, సోరియాసిస్ వ్యాధిగ్రస్తుల్లోనూ టీబీ సోకుతుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తులకు సాధారణంగా వెన్నునొప్పి, దృఢత్వం లోపించడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే క్షయవ్యాధి వల్ల వచ్చే ఆర్థరైటిస్ సాధారణంగా తుంటి, మోకాళ్ల నొప్పులను పెంచుతుంది. రోగుల్లో మెదడును కప్పి ఉంచే పొరలు వాపుకు (మెనింజైటిస్) గురి కావడంతో శాశ్వతమైన, అడపాదడపా తలనొప్పి, అనేక మానసిక మార్పులకు గురవుతారు.

క్షయ వ్యాధి ల‌క్షణాలు..

క్షయ అంటువ్యాధి. స్త్రీ, పురుష లింగా బేధ‌ముల‌తో సంబంధం లేకుండా ఎవరికైనా రావచ్చు. ఇది ఊపిరితిత్తులకు ఎక్కువగా సోకుతుంది. రెండు వారాలకు మించి దగ్గు, సాయంత్రం పూట జ్వరం రావడం, ఆకలి మందగించడం చాతిలో నొప్పి, లింపు గ్రండులో నొప్పి, తెమడలో రక్తం చారలు కనబడటం ఈ వ్యాధి లక్షణాలుగా చెప్పవచ్చు. క్షయ వ్యాధి శరీరంలో ఏ భాగానికైనా రావచ్చు. గోరు, వెంట్రుకలకు మాత్రం రాదు. రక్తప్రసరణ జరుగు ప్రదేశాలలో ఈ వ్యాధి వస్తుంది, ఊపిరితిత్తులకు కాకుండా శరీరంలోనే ఏ ఇతర భాగాలకొస్తే ఆ వ్యాధిని ఎకస్థా పల్మనరీ టీబీ అంటారు. 

టీబీ రోగుల‌కు ఉచిత వైద్యం..ప్రభుత్వ సాయం కూడా..

టీబీ ల‌క్షణాలు ఉన్నట్లుగా అనుమానం ఉన్నవారు స‌మీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా ఎంజీఎం జిల్లా క్షయ నివారణ కార్యాలయంలో సిబినాట్, ట్రూనాట్ కార్ట్రిడ్జ్ బేస్‌డ్‌ న్యూక్లిక్ యాసిడ్ అప్లిఫికేషన్ టెస్టింగ్ ద్వారా తెమడ పరీక్ష కాకుండా మిగితా బయాలజికల్ శాంపిల్స్ అన్నింటిని పరీక్ష చేయవచ్చు. తద్వారా 2 గంటల్లో వ్యాధిని నిర్ధారించవచ్చు. రోగి స్థితిగ‌తుల‌కు అనుగుణంగా చికిత్స అందిస్తారు. హనుమకొండ జిల్లాలో గత సంవత్సరం 2022గాను 7,492 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయగా మొత్తం 1,465 మందికి టీబీ వ్యాధి సోకింది. వారందరికీ కూడా టీబీ మందులు అందించడం జరుగుతోంది. పిల్లల‌కు బీసీజీ వ్యాక్సినేషన్ ఇవ్వాలి.

వ్యాధి నిర్ధార‌ణ అయిన వారు విధిగా డాక్టర్లు చెప్పిన‌ట్లుగా మందులు వేసుకోవాలి. వ్యాధి లక్షణాలు తగ్గినా, వైద్యం మధ్యలో ఆప‌కూడ‌దు. మందులు వాడే సమయంలో రియాక్షన్లు వస్తే భయపడకుండా డాక్టరును సంప్రదించాలి. రోగుల ఇంట్లో 6 ఏళ్ల లోపు పిల్లలుంటే డాక్టర్ సలహా మేరకు మందులు ఇప్పించాలి. వ్యాధి నిర్ధారణ అయినట్లయితే టీబీ మందులు ఆశా వర్కర్ల ద్వారా ఇప్పించడం జరుగుతుంది. టీబీ వ్యాధికి నిర్ధారణ పరీక్షలు మందులు పూర్తిగా ఉచితంగా అందిస్తారు. టీబీ మందులు వాడుతున్న వారికి పోషకాహార సహాయం కింద నెలకు రూ.500ల‌ చొప్పున ఆరు నెలల కాలానికి అందిస్తారు.


జిల్లాలో 44 మంది..

ఇప్పటివరకు హ‌న్మకొండ‌ జిల్లాలో44 మంది టీబీ వ్యాధిగ్రస్తులకు అందజేశారు. టీబీ వ్యాధి త్వరితగతిన తగ్గటానికి. మందులతో పాటు పోషకాహారం అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం నిక్షయ్ మిత్ర అనే సామాజిక బాధ్యత గల దాతల ద్వారా టీబీ వ్యాధిగ్రస్తులకు పోషకాహరం కిట్లను అందేవిధంగా కార్యక్రమాలను జరుపుతున్నారు. దీనికిగాను ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు ఇచ్చింది. ఇప్పటివరకు ఈ కార్యక్రమంలో భాగంగా మన జిల్లాలో సర్వప్రేమ, రెడ్ క్రాస్ సొసైటీల, ఇతరుల సహాయంతో కిట్లను అందిస్తున్నారు.

ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం

ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవంగా ప్రతి సంవత్సరం మార్చి 24వ తేదీన నిర్వహించబడుతోంది. భయంకరమైన అంటువ్యాధైన టీబీ(క్షయ) దేశంలో ప్రతి సెకనుకు ఒక్కరికి సోకుతున్నదని, ప్రతిరోజు దేశవ్యాప్తంగా 1000మంది క్షయ వ్యాధితో మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. భారత ప్రభుత్వం 1962ను క్షయవ్యాధి నివారణకు ప్రత్యేకమైన చర్యలను తీసుకోవడం ప్రారంభించింది.

1882, మార్చి 24న డా. రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త క్షయ వ్యాధికారక సూక్ష్మక్రిములను (మైకోబ్యాక్టీరియమ్ టూబరిక్లోసిస్) మొదటిసారిగా కనుగొన్నారు. 1982లో అంతర్జాతీయ క్షయ, ఊపిరితిత్తుల వ్యాధుల వ్యతిరేక యూనియన్, రాబర్ట్ కోచ్ క్షయ వ్యాధికారక సూక్ష్మక్రిములను కనుగొని 100 సంవత్సరాలైన సందర్భంగా మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం జరుపుకోవాలని ప్రతిపాదించింది.

Tags:    

Similar News