కలెక్షన్‌కు ఎలక్షన్ బ్రేక్.. ట్యాక్స్ స్టాఫ్‌కు ఎమ్మెల్సీ ఎలక్షన్ డ్యూటీలు
జీహెచ్ఎంసీ పరిస్థితి మూలుగుతున్న నక్కపై తాటి కాయపడినట్టయింది..
దిశ, సిటీ బ్యూరో: జీహెచ్ఎంసీ పరిస్థితి మూలుగుతున్న నక్కపై తాటి కాయపడినట్టయింది. ఇప్పటికే నెల జీతాలు, పెన్షన్లు, రోజువారీ మెయింటనెన్స్ గగనంగా మారిన గడ్డుకాలంలో ఆర్థిక సంవత్సరం చివరి రోజుల్లోనైనా ప్రాపర్టీ ట్యాక్స్ లక్ష్యానికి తగిన విధంగా వసూలు చేసుకుందామనుకుంటే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు బ్రేక్ వేశాయి. సిటీలోని 30 సర్కిళ్లలో జీహెచ్ఎంసీ ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్ ను వసూలు చేసుకునేందుకు సుమారు 140 మంది ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు, 300 మంది బిల్ కలెక్టర్లున్నారు. వీరందరు ఏడాది పొడువున వారికి కేటాయించిన డాకెట్ల పరిధిలోని పన్ను బకాయిదారుల నుంచి పన్ను వసూలు చేయటం, కొత్త భవనాలను ఆస్తి పన్ను చెల్లింపు పరిధిలోకి తీసుకురావటం వంటి విధులు నిర్వర్తిస్తుంటారు. కానీ కొంతకాలం వీరికి ఎన్నికల విధులు, డబుల్ బెడ్ రూమ్ దరఖాస్తుల వెరిఫికేషన్ అంటూ అదనపు విధులు కేటాయిస్తున్నారు. కనీసం ఆర్థిక సంవత్సరం చివర్లోనైనా వన్ పాయింట్ ప్రొగ్రాంగా ట్యాక్స్ కలెక్షన్ పై దృష్టి సారిద్దామని భావించిన సమయంలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలొచ్చాయి. దీంతో వీరందరికి ఎలక్షన్ డ్యూటీలు పడ్డాయి. ట్యాక్స్ కలెక్షన్ చేస్తేనే జీతాలు చెల్లిస్తామని చెప్పుకొచ్చిన అధికారులే వీరిని ఎలక్షన్ విధులకు పంపుతున్నారు. కేటాయించిన టార్గెట్ ప్రకారం ట్యాక్స్ కలెక్షన్ తో పాటు కేటాయించిన ఎలక్షన్ విధులు కూడా నిర్వర్తించాల్సిందేనని నిబంధన విధించటంతో ట్యాక్స్ సిబ్బంది టెన్షన్ పడుతుంది.
ఒక్కోక్కరికి ఒక్కో స్టైల్
జీహెచ్ఎంసీలోని దాదాపు అన్ని విభాగాల్లో విభాగాధిపతులు మొదలుకుని కింది స్థాయి సిబ్బంది వరకు ఎవరికి వారే బాస్‌లుగా వ్యవహారిస్తుంటారు. ట్యాక్స్ సిబ్బందికి సంబంధించి మరింత విచిత్రమైన పరిస్థితులున్నాయి. నేరుగా వెళ్లి పన్ను చెల్లించాలని బకాయిదారులను ప్రశ్నించొద్దంటూ కమిషనర్ ఆదేశాలు జారీ చేయగా, ఇచ్చిన టార్గెట్ల ప్రకారం పన్ను చెల్లించకపోతే చర్యలు తప్పవంటూ ఆయన కింది స్థాయి అధికారులు ట్యాక్స్ స్టాఫ్ కు డైరెక్షన్లు ఇస్తున్నట్లు సమాచారం. కొన్ని సందర్భాల్లోనైతే నేరుగా వెళ్లి బకాయిదారుడ్ని ట్యాక్స్ గురించి ప్రశ్నిస్తే కఠిన చర్యలు తప్పవంటూ కొందరు అధికారులు ఓటు బ్యాంక్ కోసం రాజకీయ నాయకుడి తరహాలో వ్యవహారించటం చర్చనీయాంశమైంది.
15 రోజుల్లో రూ. 489 కోట్ల టార్గెట్
వర్థమాన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీహెచ్ఎంసీ రూ.2 వేల కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ను టార్గెట్ గా పెట్టుకోగా, ఇప్పటి వరకు రూ. 1511 కోట్ల వరకు పన్ను వసూలైంది. ఇందులో అత్యధికంగా గత సంవత్సరం ఏప్రిల్ మాసంలో అమలు చేసిన ఎర్లీ బర్డ్, ఆ తర్వాత అమలు చేసిన వన్ టైమ్ సెటిల్ మెంట్ కార్యక్రమాలతోనే వసూలైంది. లక్ష్యానికి మిగిలిన రూ.489 కోట్లను ఈ నెలాఖరులోపు వసూలు చేయాల్సి ఉంది. ట్యాక్స్ సిబ్బంది కలెక్షన్ విధుల్లో ఫుల్ గా బిజీగా ఉండే ఈ నెలలో ఎన్నికల విధులు రావటం, అదీ కూడా ఈ నెల 16 వరకుండటంతో ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో కలెక్షన్ కోసం మిగిలింది కేవలం 15 రోజులే. ఈ సమయంలోనే టార్గెట్ కు తగ్గటు రూ.489 కోట్లు వసూలు చేసుకోవల్సి ఉంది. వసూలు కాని పక్షంలో చర్యలు ట్యాక్స్ సిబ్బందిపై తీసుకుంటారా? లేక వారికి ఎలక్షన్ డ్యూటీలు వేసినందుకు అధికారులపై యాక్షన్ తీసుకుంటారో? వేచి చూడాలి.