టార్గెట్ యూత్! అధికార పార్టీ ఎమ్మెలేల కొత్త స్కెచ్
పట్టణాల్లోని ఓటర్లు, యువత బీజేపీకి ఆకర్షితులవుతున్నారని గుర్తించిన బీఆర్ఎస్..
పట్టణాల్లోని ఓటర్లు, యువత బీజేపీకి ఆకర్షితులవుతున్నారని గుర్తించిన బీఆర్ఎస్.. వారిని డైవర్ట్ చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నది. గ్రామాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలపై నెలకొన్న అసంతృప్తిని చల్లార్చడంపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఎమ్మెల్యేలు వివిధ కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు ముఖ్యంగా యువతకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
వారిని బిజీ చేసేందుకు జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. ఆదరణ కోసం గ్రామీణ ప్రాంతాల్లో సామూహిక వివాహాలు, ఇతర సేవా కార్యక్రమాలు చేపడుతూ నిత్యం ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. - దిశ, తెలంగాణ బ్యూరో
దిశ, తెలంగాణ బ్యూరో : పట్టణ ఓటర్లు, యువత బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నట్లు అంచనా వేసిన బీఆర్ఎస్ కౌంటర్ వ్యూహాన్ని రూపొందించింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ అధికార ఎమ్మెల్యేలపై నెలకొన్న అసంతృప్తిని చల్లార్చేందుకు స్కెచ్ వేసింది. వరుసగా మూడోసారి పవర్‌లోకి రావాలని భావిస్తున్న గులాబీ పార్టీ దిద్దుబాటు చర్యలపై దృష్టి సారించింది. నిత్యం ప్రజల మధ్యే ఉండాలని ఎమ్మెల్యేలను ఆదేశిస్తున్నది.
అందులో భాగంగా యూత్‌ను తమవైపు తిప్పుకోవడానికి పలు రకాల ఐడియాలను సిద్ధం చేసింది. పట్టణాలు, నగరాలకు దగ్గరగా ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లలో జాబ్ మేళాలను నిర్వహించి యువతకు దగ్గర కావాలనుకుంటున్నది. సామూహిక వివాహాలు, ఇతర సేవా కార్యక్రమాల ద్వారా వారికి చేరువయ్యేలా ప్రణాళికను రచిస్తున్నది.
నిత్యం ప్రజల మధ్యే..
గ్రామీణ ప్రాంత నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు నిత్యం ప్రజల మధ్య ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. విలేజ్ టూర్ పేరుతో ప్రజల దగ్గరకు వెళ్లి వారు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం నుంచి పరిష్కారం కాని అంశాలు తదితరాలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే అనేక వెల్ఫేర్ స్కీమ్‌ల ద్వారా లబ్ధి పొందుతున్నప్పటికీ ఒక్క చోట అసంతృప్తి కలిగితే అదే చివరకు హాని చేస్తుందనే అభిప్రాయంతో ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే పల్లె యాత్రలకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల నాటికి వారి ఇబ్బందులను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కనుగొనడంపై ఫోకస్ పెట్టారు.
యూత్‌కు దగ్గరయ్యేందుకు జాబ్ మేళాలు
యూత్, ఫస్ట్ టైమ్ ఓటర్లు, విద్యావంతులు బీజేపీవైపు ఆకర్షితులవుతున్నట్లు బీఆర్ఎస్ గ్రహించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ మేరకు ప్రభావం కనిపించింది. ఇటీవలి కాలంలో యూత్ మరింతగా బీజేపీ వైపు వెళ్తున్న వాతావరణాన్ని గమనించిన గులాబీ నేతలు దిద్దుబాటు చర్యలపై దృష్టి పెట్టారు. గతంలో క్రికెట్ కిట్ల పంపిణీ లాంటివాటిని అమలు చేసినా ఈసారి వారు మరింత బిజీగా ఉండేలా ఆలోచనలను పదునుపెడుతున్నారు.
ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, కోదాడలో బీఆర్ఎస్ నాయకుడు కే.శశిధర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తదితరులు తమ తమ నియోజకవర్గాల్లో జాబ్ మేళాలను నిర్వహించారు. విద్యార్హతలకు అనుగుణంగా పరిశ్రమల్లో, ఇతర రంగాలకు చెందిన వాణిజ్య సముదాయాల్లో అవకాశాలను కల్పించారు. మాల్స్, స్టార్టప్‌ల నుంచి ఎంఎస్ఎంఈ స్థాయికి ఎదిగిన కొన్ని ఇండస్ట్రీలతో మాట్లాడి వీలైనంత ఎక్కువ మందికి అవకాశాలు వచ్చేలా చూస్తున్నారు.
జాబ్ నోటిఫికేషన్లు
యువతలో ఉన్న వ్యతిరేకత ప్రతిపక్షాలకు లాభించకుండా జాబ్ నోటిఫికేషన్లు వేసింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా 80 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. దాదాపు సగం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. కొన్నింటికి పరీక్షలు జరిగాయి. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ఇంకా అనుకున్నంత స్థాయిలో మొదలుకాలేదు. గ్రూపు-1, గ్రూపు-2, గ్రూపు-4, పోలీసు కానిస్టేబుల్, ఎస్సై పోస్టుల కోసం విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.
ఏడాది కాలంగా విద్యార్థులు ధర్నాలు, రాస్తారోకోలు లాంటి నిరసనల జోలికి వెళ్లకుండా పుస్తకాల్లో మునిగిపోయేలా చేశారు. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం నజరానాలు, క్రికెట్ కిట్లు, గిఫ్టులతో పనులు జరగవని అంచనా వేసి జాబ్ మేళా లాంటివాటిని ఎంచుకుంటున్నారు. ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి తన కుటుంబ ట్రస్ట్ ద్వారా సామూహిక వివాహాలతో నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారారు.
గ్రాఫ్ డౌన్ కాకుండా..
గ్రౌండ్ లెవల్‌లో చెడ్డ పేరు ఉంటే ఇంటెలిజెన్స్ నివేదికలకు అనుగుణంగా టికెట్ దక్కడం అనుమానమనే ఉద్దేశంతో ఇప్పటి నుంచే పరిస్థితులను చక్కదిద్దుకునే పనులు మొదలుపెట్టారు. ఈసారి ముక్కోణపు పోటీతో అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా ఏ పార్టీకి ఏ స్థాయిలో బలం ఉన్నదో, విజయావకాశాలు ఉన్నాయో పార్టీ అధినేత కేసీఆర్ లెక్కలేసుకుంటున్నారు. పార్టీ గ్రాఫ్ పడిపోతున్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలను, పార్టీ నేతలను అలర్టు చేసి అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో పాటు ఇలాంటి జాబ్ మేళాల గురించి సూచనలు చేస్తున్నారు. ఇవి అభ్యర్థులకు, పార్టీకి ఏ మేరకు కలిసొస్తాయన్నది ఎన్నికల రిజల్టు తేల్చనున్నది.