Target Ponguleti.. కేటీఆర్‌కు బదులుHarish Raoకు బాధ్యతలు?

ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.

Update: 2023-01-12 08:43 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఓ వైపు బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఖమ్మం జిల్లానే కేసీఆర్ ఎంపిక చేసుకుంటే అంతలోనే ఆ పార్టీ కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసమ్మతి రాగం వినిపించడం సంచలనంగా మారింది. అయితే ఇన్నాళ్లు ఓపికగా ఉన్న పొంగులేటి ఇక బీఆర్ఎస్‌కు స్వస్తి పలికి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం జోరందుకున్న నేపథ్యలో కేసీఆర్ ఖమ్మం జిల్లా నేతలతో భేటీ అవ్వడం, ఇంతలోనే అనూహ్యంగా మంత్రి హరీష్ రావు తుమ్మల నివాసానికి వెళ్లడం హాట్ టాపిక్ అయింది. అయితే తుమ్మల నివాసానికి మంత్రి హరీష్ రావు వెళ్లడం వెనుక రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఒంటరి చేసే వ్యూహం:

ఇటీవల ఖమ్మం జిల్లా నేతలతో ప్రగతి భవన్‌లో భేటీ అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ పొంగులేటి అంశంపై వారితో చర్చించినట్లు తెలిసింది. ఆయన మన పార్టీని వీడుతారని పోయే వాళ్ల గురించి ఆలోచన వద్దని, ఖమ్మం సభ సక్సెస్ కోసం కృషి చేయాలని సూచించినట్టు టాక్ వినిపించింది. అయితే ఇక్కడే కేసీఆర్ తనదైన వ్యూహం అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తనతో విభేదించిన వారి విషయంలో గతంలో ఎలాంటి వ్యూహాలను అమలు చేశారో ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీని గులాబీ బాస్ అమలు చేస్తున్నారని, తుమ్మల నివాసానికి హరీష్ రావు వెళ్లడం వెనుక ఇదే రీజన్ అనే చర్చ కూడా జరుగుతోంది. పార్టీ వీడాలని భావిస్తున్న పొంగులేటిని ఒంటరి చేయడమే కేసీఆర్ లక్ష్యం అనే వాదన ఖమ్మం జిల్లా రాజకీయాల్లో వినిపిస్తోంది. పొంగులోటి బాటలోనే తుమ్మల కడా పయణిస్తారా? అనే ప్రచారం జరుగుతోంది. గత కొంత కాలంగా అధిష్టానంపై తుమ్మల అసంతృప్తితో ఉన్నారని, అదును చూసి పార్టీ మారాలని భావిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఇంతోల పొంగులేటి అమిత్ షాతో భేటీ కాబోతున్నారనే ఊహాగానాల నేపథ్యంలో ఆయన వెంటే తుమ్మల కూడా వెళ్తున్నారనే ప్రచారం జోరందుకుంది. అయితే పొంగులేటి ఎఫెక్టు పార్టీపై ఉండకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగానే ఆయన వెంట ఎవరూ వెళ్లకుండా పార్టీ నేతలను కేసీఆర్ అలర్ట్ చేస్తున్నట్టు చర్చ జరిగుతోంది.

తుమ్మల ఓకే.. సండ్ర సంగతేంటి?:

ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు బీఆర్ఎస్‌కు మొదటి నుంచి అంతగా కలిసి రాలేదు. గత ఎన్నికల్లోనూ రాష్ట్రమంతటా కారు జోరు కొనసాగినా ఇక్కడ మాత్రం ఎదురు గాలి వీచింది. దీనికి ప్రధాన కారణం పార్టీలో అంతర్గత పోరు అనేది అధినేత కేసీఆర్ సైతం అంగీకరించారు. అయితే పొంగులేటిని ఒంటరి చేసి ఆయన వెంట ఎవరూ వెళ్లకుండా కట్టడి చేయాలని భావిస్తున్న అధిష్టానం.. ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీష్ రావును రంగంలోకి దింపింది. ఈ క్రమంలో జిల్లాలో పర్యటించిన హరీష్ రావు తుమ్మల నివాసానికి వెళ్లడం వెళ్తూ వెళ్తూ సండ్ర వెంకట వీరయ్యను వెంట తీసుకువెళ్లడం ఆసక్తిగా మారింది. అయితే ఇటీవల సండ్ర చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చ నీయాంశం అయ్యాయి. కొంతమంది తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, టీడీపీలో ఉన్నప్పుడు కూడా తనను ఇబ్బంది పెట్టారని అన్నారు. అయినా చివరి వరకు పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేశానని, పదవులు అనుభవించిన పెద్దల తర్వాతే తాను పార్టీ మారానన్నారు. చిల్లర రాజకీయాలు చేసే వారు దమ్ముంటే ముసుగు తొలగించి రావాలంటూ సవాల్ విసిరారు. పరోక్షంగా చేసిన ఈ వ్యాఖ్యలు తుమ్మలను ఉద్దేశించే అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపించింది. ఈ నేపథ్యంలో పొంగులేటి ఎఫెక్టుతో తుమ్మల, సండ్ర మధ్య ఉన్న విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టడంపై అధిష్టానం దృష్టి సారించిందనే చర్చ జరుగుతోంది.

అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ రిపేరింగ్ బాధ్యతలను కేటీఆర్‌కు బదులు హరీష్ రావుకు అప్పగించారా అనే చర్చ తెరపైకి వస్తోంది. గతంలో జిల్లాలో పర్యటించిన కేటీఆర్ నేతలకు విభేదాలు విడవాలని, అందరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. కానీ అయినా పొంగులేంటి వంటి సీనియర్లు పార్టీని వీడాలనే అభిప్రాయానికి వచ్చారనే ప్రచారంతో కేటీఆర్ కు బదులు హరీష్ ను రంగంలోకి దింపినట్టు చర్చ జరుగుతోంది. అయితే తాజా పరిణామాలతో ఖమ్మం రాజకీయంలో ఎలాంటి మలుపులు తీసుకోబోతోంది అనేది ఆసక్తిగా మారింది.

ఇవి కూడా చదవండి : మహబూబాబాద్ ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్త 


Tags:    

Similar News