DSC-2008 : అపాయింట్మెంట్ ఆర్డ‌ర్లు ఇవ్వండి.. ప్ర‌జాభ‌వ‌న్‌లో డీఎస్సీ-2008 బాధితులు

త‌మ‌కు స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ పూర్త‌య్యి 50 రోజులు గ‌డుస్తున్నా ప్ర‌భుత్వం అపాయింట్మెంట్ ఆర్డ‌ర్లు ఇవ్వ‌డం లేద‌ని డీఎస్సీ-2008 అభ్య‌ర్థులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Update: 2024-11-19 13:11 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: త‌మ‌కు స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ పూర్త‌య్యి 50 రోజులు గ‌డుస్తున్నా ప్ర‌భుత్వం అపాయింట్మెంట్ ఆర్డ‌ర్లు ఇవ్వ‌డం లేద‌ని (DSC-2008) డీఎస్సీ-2008 అభ్య‌ర్థులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మంగ‌ళ‌వారం (Hyderabad) హైద‌రాబాద్‌లోని (Praja Bhavan) జ్యోతిరావు ఫూలే ప్ర‌జా‌భ‌వ‌న్‌కు దాదాపు 200 మంది డీఎస్సీ-2008 అభ్యర్థులు త‌ర‌లివ‌చ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 15 ఏళ్లుగా ఎదురు చూస్తున్న త‌మ‌కు ఉద్యోగాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణయించిందన్నారు. ఇటీవల రాష్ట్ర‌వ్యాప్తంగా 1400 మంది అభ్య‌ర్థులు స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ చేయించుకున్న‌ట్టు చెప్పారు. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డికి, క్యాబినెట్ మంత్రుల‌కు, విద్యాశాఖ అధికారుల‌కు ధ‌న్య‌వాదాలు అంటూ తెలిపారు.

వెంట‌నే కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇచ్చి, అపాయింట్మెంట్ (Appointment Orders) ఆర్డ‌ర్లు ఇస్తార‌ని ఆశించామ‌ని అన్నారు. కానీ 50 రోజులు గ‌డుస్తున్నా ప్ర‌క్రియ ముందుకు సాగ‌డం లేద‌న్నారు. దీంతో అభ్య‌ర్థులు ఆందోళ‌న చెందుతున్నార‌ని, ప్ర‌భుత్వ ఉద్యోగాలు వ‌స్తాయ‌న్న కార‌ణంతో త‌మ‌లో చాలా మంది ప్రైవేట్ ఉద్యోగాలు మానేయాల్సి వ‌చ్చింద‌ని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో త‌మ కుటుంబాల‌కు ఉపాధి లేకుండా పోయింద‌న్నారు. త‌మ వేద‌న‌ను అర్థం చేసుకొని, కౌన్సిలింగ్ షెడ్యుల్ ప్రకటించాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరారు. ప్ర‌జాభ‌వ‌న్‌లో కూర్చున్న అభ్య‌ర్థుల‌తో ప్ర‌ణాళిక సంఘం వైస్ ఛైర్మ‌న్ చిన్నారెడ్డి చ‌ర్చ‌లు జ‌రిపారు. అభ్య‌ర్థుల నుంచి వివ‌రాలు సేక‌రించారు. వెంట‌నే విద్యాశాఖ క‌మిష‌న‌ర్ న‌ర్సింహారెడ్డి, ఇత‌ర అధికారుల‌తో ఫోన్ లో మాట్లాడారు. అభ్య‌ర్థుల జాబితా రూప‌క‌ల్ప‌న ప్ర‌క్రియ చివ‌రి ద‌శ‌లో ఉన్న‌ద‌ని చెప్పారు. రెండు మూడు రోజుల్లో స‌మ‌స్య ప‌రిష్కారం అయ్యేలా చూస్తాన‌ని అభ్య‌ర్థుల‌కు చిన్నారెడ్డి హామీ ఇచ్చారు.

Tags:    

Similar News