50 ఏళ్లకే పెన్షన్.. నేత కార్మికులకు టీ- కాంగ్రెస్ కీలక హామీ
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో కుల గణన నిర్వహించి జనాభా ఆధారంగా బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో కుల గణన నిర్వహించి జనాభా ఆధారంగా బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. బీసీ-డీలో ఉన్న ముదిరాజులను బీసీ-ఏ లోకి మారుస్తామని, నేత కార్మికులకు 50 ఏళ్లు దాటితే పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. శుక్రవారం కామారెడ్డి లో జరిగిన బీసీ డిక్లరేషన్ సభలో బీసీ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ ప్రకటించింది. కర్నాటక సీఎం సిద్దరామయ్య, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీతో, టీజేఎస్ చీఫ్ కోదండరామ్, కమ్యూనిస్టు ముఖ్య నేతలతో పాటు పలువురు నాయకులు హాజరైన ఈ సభలో బీసీలకు కీలక హామీలు ఇచ్చింది.
స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు:
స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ 42 శాతం పెంచుతామని, బీసీ సబ్ ప్లాన్ ప్రవేశ పెట్టడంతో పాటు వైన్ షాపులో గౌడ్లకు ప్రస్తుతం ఇస్తున్న 15 రిజర్వేషన్ 25 శాతానికి పెంచుతామని పేర్కొంది. జనగామ జిల్లాను సర్వాయ్ పాపన్న సర్దార్ పాపన్న పేరు పెడుతామని, ఐదేళ్లలో బీసీల అభివృద్ధి కోసం లక్ష కోట్ల ఖర్చు చేస్తామని, రాష్ట్రంలో మూడు చోట్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తమని హామీ ఇచ్చింది. ప్రతి మండలానికి ఓ బీసీ గురుకులాన్ని ఏర్పాటు చేయడంతో పాటు బీసీ సంక్షేమ శాఖను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి జిల్లాకు బీసీ భవన్ ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ప్రతి మండలంలో ఓ బీసీ గురుకులం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.