T BJP: "రైతు హామీల సాధన దీక్ష" పేరుతో బీజేపీ ధర్నా.. బీజేఎల్పీ నేత ఏలేటి

ఈ నెల 30న రైతుల సమస్యలపై బీజేపీ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టనున్నామని, ఈ ధర్నా ఇందిరా పార్క్ వద్ద 24 గంటల పాటు కొనసాగుతుందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.

Update: 2024-09-24 13:10 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ నెల 30న రైతుల సమస్యలపై బీజేపీ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టనున్నామని, ఈ ధర్నా ఇందిరా పార్క్ వద్ద 24 గంటల పాటు కొనసాగుతుందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. "రైతు హామీల సాధన దీక్ష" పేరుతో ఇందిరా పార్క్ వద్ద 24 గంటల ధర్నా నిర్వహించనున్నామని, ఈ ధర్నా ఈ నెల 30 వ తేదీ ఉదయం 11 గంటల నుంచి వచ్చే నెల 1వ తేదీ ఉదయం 11 గంటల వరకు కొనసాగుతుందని చెప్పారు. ఈ ధర్నాలో బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొంటారని వెల్లడించారు.

ఈ సందర్భంగా.. కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. రైతు భరోసా ఎగ్గొడితే ఊరుకునే ప్రసక్తే లేదని, కౌలు రైతులు యజమానులతో మాట్లాడాలని తుమ్మల నాగేశ్వరరావు అంటున్నారని, తుమ్మల మాటలు చూస్తే కౌలు రైతులను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని అర్థం అవుతుందని ఆరోపించారు. సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని ఉత్తమ్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, సన్న వడ్లపై ఉత్తమ్ కుమార్ తప్పుడు లెక్కలు చెప్తున్నారని విమర్శించారు. తెలంగాణ మొత్తం సన్న వడ్లు పండవని, ఎక్కువ శాతం దొడ్డు వడ్లు పండుతాయని తెలిపారు. సన్న వడ్లకు మీరు ఇచ్చే ధర కన్నా మార్కెట్లో ఎక్కువ ధర ఉందని, మీరు ఇచ్చే ధరకి సన్న వడ్లు మీకు ఎవరు ఇవ్వరని, మీరు ఇచ్చేది బోనస్ కాదు బోగస్ అని మండిపడ్డారు. ఇక పొంగులేటి కాంట్రాక్టుల మీద మాట్లాడాల్సి ఉందని, ఆస్థాన గుత్తేదారులు అందరూ కాంట్రాక్టులు పంచుకున్నారని, పొంగులేటికి వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్స్ ఎలా వచ్చాయమని ఏలేటి ప్రశ్నించారు. 


Similar News