మానుకోటలో విషాదం మిగిల్చిన స్వప్నలోక్ ఫైర్ యాక్సిడెంట్
ఎన్నో ఆశలతో పట్నం వైపు బాట పట్టిన నిరుద్యోగుల 'స్వప్నాలు' బుడిదయ్యాయి.
దిశ, మహబూబాబాద్ ప్రతినిధి : ఎన్నో ఆశలతో పట్నం వైపు బాట పట్టిన నిరుద్యోగుల 'స్వప్నాలు' బుడిదయ్యాయి. నిరుపేద కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉంటూ, అన్ని తామై కుటుంబాలు సాకుతున్న యువకులు ఊపిరిడాక చనిపోవడంతో బాధిత కుటుంబాలు రోదనలు మిన్నంటాయి. సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు మృతి చెందారు.
కేసముద్రం మండలం ఇంటికన్నే గ్రామానికి చెందిన అమరాజు ప్రశాంత్ (23), గూడూరు మండలం మట్టేవాడ గ్రామ శివారు సురేష్ నగర్‌కు చెందిన ప్రమీల (22)లు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. కేసముద్రం మండలానికి చెందిన అమరాజు జనార్దన్ - ఉపేంద్ర దంపతులకు కుమారుడైన ప్రశాంత్ డిగ్రీ పూర్తి చేశాడు. పోలీస్ ఉద్యోగం పొందాలని చిరకాల కోరిక. అందుకోసం ఆయన సాధన చేస్తున్నారు. గతంలో రెండు సార్లు పోలీస్ పరీక్షల కోసం నిర్వహించిన అన్ని టెస్ట్‌లలో ఉత్తీర్ణత సాధించిన తృటిలో ఉద్యోగం సాధించలేక పోయాడు.
ఈ పర్యాయం ఎలాగైనా ఉద్యోగం పొందాలని సికింద్రాబాద్‌లో కొంచింగ్ తీసుకున్నాడు. మళ్ళీ పరీక్ష రాశాడు. ఈ సారి ఉద్యోగం తప్పకుండా వస్తుందని ధీమాతో ఉన్నాడు. మృతుని స్వగ్రామంలో తోటి స్నేహితులకు పోలీసు ఉద్యోగ సాధన కోసం మెలకువలు సైతం చెప్పేవాడు. ఫలితాలు ఆలస్యమవుతాయని భావించిన ప్రశాంత్ తన స్నేహితులతో స్వప్న లోక్ కాంప్లెక్స్‌లో ఉద్యోగం చేస్తున్నాడు.
నిరుపేద కుటుంబం కావడంతో వీరికి ప్రశాంత్ పెద్ద దిక్కు. త్వరలో తమ కొడుకు పోలీస్ ఉద్యోగం పొంది, తమను సంతోషంగా ఉంచుతాడని వేచి చూసున్న తల్లిదండ్రులు ఈ మరణ వార్త విని షాక్‌కు గురయ్యారు. ఇంటికన్నే గ్రామానికి పోలీస్ ఉద్యోగంతో వస్తాడని అనుకుంటే మృతదేహమై వస్తుండడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గూడూరు మండలానికి చెందిన ప్రమీల కూడా ఈ అగ్నిప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంల తీవ్ర విషాదం నెలకొంది.